Share News

ఒక్కో మ్యుటేషన్‌కు రూ.20వేలు ఇవ్వాలంట!

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:58 PM

Allegations against revenue officials మ్యుటేషన్‌ చేయడానికి అధికారులు రూ.20వేలు అడుగుతున్నారంటూ ఓ టీడీపీ నాయకులు చేసిన ఆరోపణ కలకలం రేపింది. అక్కడే ఉన్న కొందరు రైతులు ఇది నిజమేనని చెప్పడంతో అక్కడే ఉన్న అధికారులు కంగుతిన్నారు.

ఒక్కో మ్యుటేషన్‌కు రూ.20వేలు ఇవ్వాలంట!
సమావేశానికి హాజరైన రైతులు.. ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకుడు

సరిచేయడానికి డబ్బులు అడుగుతున్నారు

రెవెన్యూ అధికారుల తీరుపై ఆరోపణలు

ఆర్డీవో ఎదుట టీడీపీ నాయకుడి ఆవేదన

వజ్రపుకొత్తూరు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): మ్యుటేషన్‌ చేయడానికి అధికారులు రూ.20వేలు అడుగుతున్నారంటూ ఓ టీడీపీ నాయకులు చేసిన ఆరోపణ కలకలం రేపింది. అక్కడే ఉన్న కొందరు రైతులు ఇది నిజమేనని చెప్పడంతో అక్కడే ఉన్న అధికారులు కంగుతిన్నారు. మంగళవారం గుణుపల్లి సచివాలయంలో ఆర్డీవో జి.వెంకటేష్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ డి.వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ సీతారామ్మూర్తి స్థానిక రైతులతో సమావేశమయ్యారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ, నష్ట పరిహారం విషయమై చర్చించారు. దీనిపై రైతుల అభిప్రాయాలను స్వీకరించారు. అక్కడే ఉన్న గుణుపల్లి పంచాయతీ టీడీపీ నాయకుడు జోగి తిరుపతిరావు మాట్లాడుతూ ‘వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు రెవెన్యూ పరిధిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీ సర్వేలో అనేక తప్పులు దొర్లాయి. వాటిని ప్రస్తుతం సరిచేయాలని కోరగా రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నార’ని ఆరోపించారు. ఒక్కో మ్యూటేషన్‌కు రూ.20వేల వరకు డిమాండ్‌ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. భూముల సర్వే నెంబర్లు తప్పులు సవరించడానికి ఇన్ని ఇబ్బందులు పెడుతున్న అధికారులు.. ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం రైతులను భూములు ఎలా అడుగుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఆరోపణలు నిజమేనంటూ మరికొంతమంది రైతులు మద్దతు తెలపడం సభ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది.

ఈ ఆరోపణలపై ఆర్డీవో వెంకటేష్‌ వీఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. విచారణ చేసి.. ఆరోపణలు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకరిద్దరు తీరువల్ల రెవెన్యూ వ్యవస్థపై అవినీతి మచ్చ పడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలి తప్ప వారి నుంచి డబ్బులు ఆశించవద్దని స్పష్టం చేశారు.

Updated Date - Dec 09 , 2025 | 11:58 PM