చోరీ చేసి.. ఇంటికి తాళం వేసి..
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:33 PM
30 tolas of gold stolen in Sompeta సోంపేటలోని కోర్టుపేట వీధిలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. పట్టణానికి చెందిన తంగుడు మనోజ్ ఇంట్లో 30 తులాల బంగారం, లక్ష రూపాయలకు పైగా నగదు అపహరణకు గురైంది.
సోంపేటలో 30 తులాల బంగారం అపహరణ
రూ.లక్షకుపైగా నగదు కూడా..
పోలీసులకు బాధితుల ఫిర్యాదు
సోంపేట, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): సోంపేటలోని కోర్టుపేట వీధిలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. పట్టణానికి చెందిన తంగుడు మనోజ్ ఇంట్లో 30 తులాల బంగారం, లక్ష రూపాయలకు పైగా నగదు అపహరణకు గురైంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తంగుడు మనోజ్ ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బరంపురంలో ఓ శుభ కార్యక్రమానికి వెళ్లారు. రాత్రి తిరిగొస్తుండగా ఇచ్ఛాపురం వద్ద వారి ద్విచక్రవాహనం ప్రమాదానికి గురై మనోజ్ గాయపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకున్నారు. అనంతరం మనోజ్ కాస్త అస్వస్థతకు గురయ్యారు. ఆయన భార్య ఆందోళన చెంది మనోజ్ స్నేహితుడికి ఫోన్ చేయగా ఆయన వచ్చి సపర్యలు చేశాడు. విషయం తెలిసి పక్కవీధిలోనే నివాసం ఉంటున్న మనోజ్ అన్న శ్రీను కూడా ఇంటికి వచ్చారు. తమ్ముడ్ని, పిల్లలు, మరదలు ఆందోళన చూసి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి వారందరినీ తన ఇంటికి తీసుకెళ్లిపోయారు. సోమవారం ఉదయం పిల్లలను పాఠశాలలకు సిద్ధం చేసే క్రమంలో మనోజ్ దంపతులు తమ ఇంటికి చేరుకోగా గేటుకు తాము వేసినది కాకుండా మరో తాళం వేసి ఉండడంతో అవాక్కయ్యారు. ఆ తాళాన్ని పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. బీరువా తాళాలు కూడా తాము భద్రపరిచిన స్థానంలోనే ఉన్నాయి. కానీ బీరువా తెరిచి చూడగా తాము దాచుకున్న బంగారం 30తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్షకుపైగా నగదు కనిపించలేదు. దీంతో వారు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ లవరాజు, ఎస్‌ఐ మంగరాజుతోపాటు శ్రీకాకుళం నుంచి క్లూస్‌టీమ్ వచ్చి ఇల్లుతోపాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఇదిలా ఉండగా తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. బీరువాలో దుస్తులు, వెండి వస్తువులు భద్రంగా ఉండగా, బంగారం ఆభరణాలు, నగదు మాత్రం చోరీకి గురవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొంటున్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ లవరాజు తెలిపారు.
దొంగతనాల జోరు
సోంపేట పట్టణంలో ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల చీకటిబంగ్లా వీధిలో కూడా తాళం వేసిన ఇంట్లో చోరీకి యత్నించారు. పోలీసులు స్పందించి నిఘా పెంచాలని, చోరీలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.