JEE Main: జేఈఈ మెయిన్‌లో మెరిశారు
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:44 AM
JEE Main: జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు మెరిశారు.
- జిల్లా విద్యార్థులకు ర్యాంకులు
రామభద్రపురం/గజపతినగరం/బొబ్బిలి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు మెరిశారు. శనివారం విడుదలైన ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులను కైవసం చేసుకున్నారు.
బొబ్బిలి పట్టణంలోని రత్నాల నగర్‌కు చెందిన పీతల టీను ఆనంద్ చక్రవర్తి ఓపెన్ కేటగిరీలో 86 ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 12వ ర్యాంకు సాధించాడు. తండ్రి శ్రీనివాసరావు పారాది జడ్పీ హైస్కూల్‌లో గణిత ఉపాధ్యాయుడిగా, తల్లి అనూరాధ పాతపట్నం మోడల్ స్కూల్‌లో గణిత ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.
మెంటాడ మండలం పిట్టాడ గ్రామానికి చెందిన రొంగళి కార్తీక్ 99.9896 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా స్థాయిలో 212 ర్యాంక్, ఓబీసీలో 29వ ర్యాంక్ సాధించాడు. కార్తీక్ కుటుంబం గజపతినగరం మండలం పురిటిపెంటలో నివాసం ఉంటుంది. తల్లిదండ్రులు మురళీసత్యనారాయణ, సత్యవతి ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.
బొబ్బిలి పట్టణంలోని నాయుడుకాలనీకి చెందిన పొట్నూరు కార్తీక్ 281 మార్కులతో 481 ర్యాంకును సాధించాడు. 99.97 పర్సంటైల్ పొందాడు. తండ్రి కాళిరాంప్రసాద్ వ్యాపారి కాగా, తల్లి కుమారి గృహిణి.
రామభద్రపురం మండలం ఆరికతోట గ్రామానికి చెందిన జాగాన యోగీశ్వర్ 99.95 శాతం పర్సంటైల్ తో జాతీయ స్థాయిలో ఓబీసీ కేటగిరీలో 135వ ర్యాంకు, కామన్ కేటగిరీలో 853వ ర్యాకు సాధించాడు. యోగీశ్వర్ తండ్రి జాగాన సింహాచలం సాలూరులోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా, తల్లి ఎర్రయ్యమ్మ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు.