Share News

బెలూన్లు అమ్ముకోవడానికి వచ్చి..

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:17 AM

గ్రామాల్లో బెలూన్లు అమ్ముకోవడానికి వచ్చిన ఓ ముఠా ఓ రిటైర్డ్‌ హెచ్‌ఎం ఇంటిలో దొంగతనానికి పాల్పడింది.

బెలూన్లు అమ్ముకోవడానికి వచ్చి..
వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌చార్జి డీఎస్పీ లక్ష్మణరావు

- రిటైర్డ్‌ హెచ్‌ఎం ఇంటిలో దొంగతనం

- కేసును ఛేదించిన పోలీసులు

- హిజ్రా అరెస్టు.. మరో ముగ్గురి కోసం గాలింపు

- 12.75 తులాల బంగారం స్వాధీనం

పలాస, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో బెలూన్లు అమ్ముకోవడానికి వచ్చిన ఓ ముఠా ఓ రిటైర్డ్‌ హెచ్‌ఎం ఇంటిలో దొంగతనానికి పాల్పడింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో తాళాలు విరగ్గొట్టి 25 తులాల బంగారాన్ని అపహరించింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. కవిటి గ్రామానికి చెందిన ఓ హిజ్రాను అరెస్టు చేసి 12.75 తులాల బంగారం రికవరీ చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వివరాలను కాశీబుగ్గ ఇన్‌చార్జి డీఎస్పీ లక్ష్మణరావు బుధవారం సాయంత్రం స్థానిక సబ్‌డివిజన్‌ పోలీసు కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. కంచిలిలో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ లెక్చరర్‌ పి.సింహాద్రిప్రధాన్‌ ఈ ఏడాది జూలై 5న విదేశాల నుంచి వస్తున్న తన కుమారుడు, కోడలును రిసీవ్‌ చేసుకోవడానికి విశాఖపట్నం వెళ్లారు. మరుసటి రోజు వారు ఇంటికి చేరుకోగా, తాళాలు విరగ్గొట్టి ఉన్నట్లు గుర్తించి కంచిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో 25 తులాల బంగారు ఆభరణాలు, వెంటి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్‌ఐ పారినాయుడు కేసు నమోదు చేశారు. సోంపేట సీఐ మంగరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సీఐకు వచ్చిన సమాచారం మేరకు కంచిలి రైల్వేస్టేషన్‌ వద్ద కవిటి గ్రామానికి చెందిన నాగుల సోనియా అనే హిజ్రాను అదుపులోకి తీసుకున్నారు. సోనియా వద్ద ఉన్న కవర్‌ను తనిఖీ చేయగా బంగారం, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగుజూసింది. కంచిలి కంచెమ్మ ఆలయం వద్ద యాచిస్తూ పొట్టపోషించుకుంటున్న సోనియాకు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌కు చెందిన బాబు, ఔరంగాబాద్‌కు చెందిన కబాడియా, సనాటా, టున్ని అనే నలుగురు వ్యక్తులు పరిచయమయ్యారు. ఈ నలుగురూ గ్రామాల్లో తిరుగుతూ బెలూన్లు అమ్ముతుంటారు. బెలూన్లు అమ్మితే రోజుకు రూ.50 కూడా మిగలడం లేదని, దొంగతనం చేసి ఒక్కసారిగా డబ్బులు సంపాదించాలని వీరంతా అనుకున్నారు. వీరికి సోనియా సహకరించింది. ఈ క్రమంలో రిటైర్డ్‌ లెక్చరర్‌ సింహాద్రిప్రధాన్‌ ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. దొంగిలించిన బంగారంలో కొత్త భాగం సోనియా బరంపూర్‌లో అమ్మడానికి వెళ్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడింది. 12.75 తులాల బంగారం స్వాధీనం చేసుకుని సోనియాను అరెస్టు చేశామని, మిగిలిన వారికోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ డీఎస్పీ తెలిపారు. కేసు మిస్టరీ ఛేదించిన సీఐ, ఎస్‌ఐతో పాటు ఏఎస్‌ఐలు రామారావు, రూప్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు కోదండ, శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ షణ్ముఖరావును అభినందించారు. వీరికి రివార్డులు అందిస్తామని తెలిపారు.

Updated Date - Oct 02 , 2025 | 12:17 AM