Share News

పిలిచారు.. ఎత్తుకెళ్లారు!

ABN , Publish Date - Nov 08 , 2025 | 12:35 AM

పలాస జీడి వ్యాపారి, బ్యాంకుల కన్సల్టెంట్‌ వైశ్యరాజు లక్ష్మీనారాయణ రాజు కిడ్నాప్‌ వ్యవహారం జిల్లాలో సంచలనం కలిగించిన విషయం విదితమే.

పిలిచారు.. ఎత్తుకెళ్లారు!
రాజును కిడ్నాపర్లు బలవంతంగా తీసుకెళ్తున్నట్టు సీసీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యం

  • సీసీ ఫుటేజీలో రికార్డయిన కిడ్నాప్‌ వ్యవహారం

  • ఐదుగురిపై కేసు నమోదు

  • మరో ముగ్గురి ప్రమేయంపై పోలీసుల ఆరా

పలాస, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): పలాస జీడి వ్యాపారి, బ్యాంకుల కన్సల్టెంట్‌ వైశ్యరాజు లక్ష్మీనారాయణ రాజు కిడ్నాప్‌ వ్యవహారం జిల్లాలో సంచలనం కలిగించిన విషయం విదితమే. కేటీ రోడ్డు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న టీ స్టాల్‌ వద్ద సీసీ కెమెరాలో ఈ వ్యవహారం రికార్డు అయింది. ఇద్దరు వ్యక్తులు షాపులోకి వచ్చి టీ తాగుతున్న వీఎల్‌ఎన్‌ రాజుతో తొలుత నెమ్మదిగా మాట్లాడారు. తర్వాత వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కారు వద్దకు రావాలని బలవంతంగా వారిద్దరూ రాజు చేతులు పట్టుకుని తీసుకుని వెళ్లడం కనిపించింది. ఇది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిత్యమూ రద్దీగా ఉండే ప్రాంతంలోనే కిడ్నాప్‌ చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. వీఎల్‌ఎన్‌ రాజు స్వగ్రామం ఆమదాలవలస. పలాసకు చెందిన మాధవితో వివాహమైన నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. రాజు కొద్ది రోజులు జీడి వ్యాపారం, ప్రస్తుతం బ్యాంకులకు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్నారు. ఆమదాలవలస పట్టణంలో ఆయనకు ఉన్న ఓ స్థలానికి సంబంధించి జరిగిన ఘర్షణ కిడ్నాప్‌ వరకూ తీసుకువచ్చింది. పొట్నూరు వేణుగోపాలరావు నుంచి రాజు కొంత మొత్తాన్ని తీసుకుని తన స్థలాన్ని బోగబంద (అద్దె లేకుండా నగదు తీసుకునే విధానం)కు ఇచ్చినట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఆ స్థలాన్ని రాజు విక్రయించేందు సిద్ధమవ్వగా.. తనకే అమ్మాలంటూ వేణుగోపాలరావు పట్టుబడుతున్నాడు. ఈ వ్యవహారంపై వీరిమధ్య కొన్నాళ్లగా ఘర్షణ కొనసాగుతుంది. ఈ క్రమంలో రాజును కిడ్నాప్‌ చేసి ఆ స్థలాన్ని తన పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు వేణుగోపాలరావు ప్లాన్‌ చేసుకున్నాడు. దీంతో తనకు తెలిసిన ఏడుగురిని పురమాయించి రెండు కార్లతో గురువారం పలాస-కాశీబుగ్గ చేరుకున్నారు. టీ తాగుతున్న రాజుతో మాట్లాడి.. బలవంతంగా ఓ కారులోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. విషయం పోలీసులకు తెలియడం.. వారు వేణుగోపాలరావును హెచ్చరించడంతో అతడి ప్లానంతా బెడిసికొట్టింది. కిడ్నాప్‌ చేసిన క్రమంలో వీఎల్‌ఎన్‌ రాజుపై భౌతికంగా దాడి జరగడంపై స్థానికంగా ఆందోళన నెలకొంది. వ్యాపారులకు స్వర్గధామమైన పలాస-కాశీబుగ్గలో ఇటువంటి ఘటనలు మునుపెన్నడూ జరగలేదు. వ్యాపారులపై భౌతిక దాడులకు దిగితే తమ పరిస్థితి ఏమిటనే పలువురు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ మాట్లాడుతూ.. కిడ్నాప్‌కు పాల్పడిన పొట్నూరు వేణుగోపాలరావు, బొడ్డేపల్లి శ్రీనివాసరావుతో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ వ్యవహారంలో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుందని, దీనిపై ఆరా తీస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Nov 08 , 2025 | 12:35 AM