Share News

వ్యసనాలకు బానిసై దొంగలుగా మారి..

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:23 AM

ఉన్నత చదువులు చదువుకోవాల్సిన ఓ ఇద్దరు యువకులు వ్యసనాలకు బానిసై దొంగలుగా మారారు. పదో తరగతి వరకూ చదువుకున్న వీరిద్దరూ ఉన్నత చదువుల చదవకుండా గంజాయి, మత్తు పదార్థాల బారినపడి దొంగతనాలకు పాల్పడి కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డారు.

వ్యసనాలకు బానిసై దొంగలుగా మారి..

  • ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

  • రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

  • వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకట అప్పారావు

పలాస, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువులు చదువుకోవాల్సిన ఓ ఇద్దరు యువకులు వ్యసనాలకు బానిసై దొంగలుగా మారారు. పదో తరగతి వరకూ చదువుకున్న వీరిద్దరూ ఉన్నత చదువుల చదవకుండా గంజాయి, మత్తు పదార్థాల బారినపడి దొంగతనాలకు పాల్పడి కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డారు. పలాస మండలం గరుడఖండి గ్రామానికి చెందిన కవిటి నిఖిలేష్‌(22), ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా కాశీనగర్‌కు చెందిన తూముల కార్తికేయ(22) కొన్నేళ్ల కిందట టెన్త్‌ తర్వాత చదువు మానేసి జల్సాలకు అలవాటుపడ్డారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాల దొంగలుగా మారారు. శనివారం ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వి.వెంకటఅప్పారావు వెల్లడించారు. పలాస మండలం టెక్కలి పట్నం గ్రామానికి చెందిన డోర సురేష్‌ తన ద్విచక్రవాహనాన్ని ఇంటివద్ద ఈనెల 14న పార్కింగ్‌ చేశాడు. మరుచటి రోజు ఉదయం చూసేసరికి కనిపించలేదు. దీంతో ఆయన కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గార మండలం మెండ పేట గ్రామానికి చెందిన మెండ ఢిల్లేశ్వరరావు కాశీబుగ్గలో పనుల మీద వచ్చి ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి వద్ద ఈ నెల 18న తన బైక్‌ను పార్కింగ్‌ చేశాడు. తిరిగి వచ్చిచూసే సరికి తన వాహనం కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నిఖిలేష్‌, తూముల కార్తికేయ విశాఖ నుంచి వస్తుండగా పోలీసులకు తారాసపడ్డారు. వారి ని విచారించగా ద్విచక్ర వాహనాలు తామే దొంగతనం చేసినట్టు అంగీకరించారు. వీరిద్దరూ శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పదో తరగతి వరకూ కలసి చదువుకున్నారు. మద్యం, గంజాయి, ఆన్‌లైన్‌ బెట్టింగులకు అలవాటుపడి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. వీరి తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు సరిపడక పోవడంతో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డారు. విశాఖలో కూడా వీరిపై ద్విచక్ర వాహనాల దొంగతనాలపై కేసులు నమోదయ్యా యి. చోరీ చేసిన వాహనాలను విశాఖలో అమ్మేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటారు. వీరిద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. సీఐ పి.సూర్యనారాయణ, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:23 AM