Share News

చంపేస్తున్నారు!

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:01 AM

Increasing murders in the srikakulam జిల్లాలో హత్యలు పెరుగుతున్నాయి. ఏడాది వ్యవధిలో పదుల సంఖ్యలో హత్యకు గురై ప్రాణాలు కోల్పోయారు. వివాహేతర సంబంధాలు, ఆస్తి గొడవలు, వ్యసనాలకు బానిసై తప్పుదోవపడుతున్న యువత దొంగతనాలకు అలవాటు పడడం వంటి కారణాలతోనే ఎక్కువగా ఈ ఘటనలు జరుగుతున్నాయి.

చంపేస్తున్నారు!

జిల్లాలో పెరుగుతున్న హత్యలు

వివాహేతర సంబంధాలతోనే అధికం

ఆస్తులు, బంగారం కోసం సైతం..

రణస్థలం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో హత్యలు పెరుగుతున్నాయి. ఏడాది వ్యవధిలో పదుల సంఖ్యలో హత్యకు గురై ప్రాణాలు కోల్పోయారు. వివాహేతర సంబంధాలు, ఆస్తి గొడవలు, వ్యసనాలకు బానిసై తప్పుదోవపడుతున్న యువత దొంగతనాలకు అలవాటు పడడం వంటి కారణాలతోనే ఎక్కువగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. భార్య వెరకొరితో తిరుగుతోందని ఒకరు, ప్రియురాలు తనను దూరం పెట్టిందని మరొకరు, బంగారం దోచుకునేందుకు.. ఇలా రకరకాల రూపంలో హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు మద్యం, గంజాయి మత్తుతో ఇటువంటి ఘటనలు పెరుగుతుండడం కూడా భయం గొలుపుతోంది. సెల్‌ఫోన్లను సద్వినియోగం కంటే దుర్వినియోగానికే ఎక్కువగా వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫోన్లలో పరిచయమైన అపరిచిత వ్యక్తులతో మాటలు కలపడం, సోషల్‌ మీడియా ద్వారా పరిచయాలు అనేక అనర్ధాలకు కారణమవుతున్నాయి. వివాహేతర సంబంధాలు సజావుగా సాగుతున్న సంసారంలో చిచ్చులు పెడుతున్నాయి. హత్యలకు దారితీస్తున్నాయి. వివాహేత సంబంధాలతో భార్య, ప్రియుడితో కలిసి ఎక్కువగా హతమార్చిన ఘటనలు బయటపడుతున్నాయి. వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అలాగే మద్యం మత్తులో జరిగిన ఘాతుకాలే అధికంగా ఉన్నాయి. జిల్లాలో విచ్చలవిడిగా పట్టుబడుతున్న గంజాయి చూస్తుంటే ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో అర్ధం అవుతోంది. అందుకే మద్యం మత్తులో ఉండేవారితో వీలైనంతగా వాదనలు పెట్టుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా జీవిస్తే ఎటువంటి కలహాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో కూడా సర్దుకుపోయేతత్వం ఉంటే ఘర్షణలు, హత్యలకు దారితీయవని చెబుతున్నారు. మనిషిలో మానవతా విలువలు తగ్గిపోవడం, ఇష్టం లేని వివాహాలు చేయడం అనర్థాలకు ప్రధాన కారణం. అందుకే పిల్లలకు కూడా ప్రాథమిక స్థాయి నుంచి మానవతా విలువలు, నైతిక విలువల గురించి చెప్పాలని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఘటనలెన్నో

ఈ నెల 3న ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. లావేరు మండలం మురపాకలో పశువులను మేతకు తీసుకెళ్లిన వడ్డి పార్వతీ అనే మహిళ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఆమెను చంపేసి.. మృతదేహాన్ని బావిలో పడేశారు. ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జంక్షన్‌ వద్ద తులసీరత్నం అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె హత్యకు గురైనట్టు పోలీసుల విచారణలో తేలింది.

అక్టోబరు 30న ఆమదాలవలస చంద్రయ్యపేటలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఆమెతో సన్నిహితంగా ఉండే నవీన్‌ అనే యువకుడు ఈ దరుణానికి ఒడిగట్టాడు. ఆమె ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు దోచుకుపోయాడు.

ఆగస్టు 27న నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి పార్వతీశం గుప్త దారుణ హత్యకు గురయ్యారు. బంగారం కోసం కారు డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తి ఆయన్ను కిడ్నాప్‌ చేసి ఆపై చంపేశారు. మృతదేహాన్ని శ్రీకాకుళం శివారులోని రామిగెడ్డలో పడేశారు.

మే 17న సోంపేట మండలం పాలవలసకు చెందిన గోకర్ల ఈశ్వరరావు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో సమీప బంధువే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

మే 8న కోటబొమ్మాళిలో పట్టపగలే లక్ష్మీ అనే మహిళను ఆమె భర్త తిరుపతిరావు నరికి చంపేశాడు. దంపతులిద్దరి మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకుని గొడవ పడుతూ పదునైన ఆయుధంతో గొంతుకోసి పరారయ్యాడు.

ఏప్రిల్‌ 19న రణస్థలం మండలం పైడిభీమవరం జంక్షన్‌ సమీపంలోని చెరువు వద్ద భవాని అనే మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా ఓ హోటల్‌లో పనిచేసే ఆమెను చెరువు వద్దకు పిలిచి గొంతుకోశాడు నిందితుడు. వివాహేతర సంబంధం మాటున ఈ హత్య జరిగినట్టు పోలీసు విచారణలో తేలింది.

ఈ ఏడాది మార్చిలో నరసన్నపేటలో ఓ వృద్ధురాలిని బాలుడు హత్య చేశాడు. తులంన్నర బంగారం కోసం అతి కిరాతకంగా హత్యచేశాడు.

జనవరి 20న శ్రీకాకుళం న్యూ కాలనీలో 50 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురయ్యారు. పొందూరు మండలానికి చెందిన ఆమె న్యూకాలనీలోని ఓ ప్లాట్‌లో విగత జీవిగా పడి ఉండడాన్ని గుర్తించారు. శరత్‌ అనే వ్యక్తి ఆమెను హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆర్థిక, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని విచారణలో తేలింది.

ప్రజల సహకారంతో నేర నియంత్రణ..

జిల్లాలో నేర నియంత్రణపై పోలీస్‌ శాఖ దృష్టిపెట్టింది. కుటుంబ పరిస్థితులు, ఇతరత్రా కారణాల వల్ల కొందరు హత్యకు గురవుతున్నారు. మరికొందరు నిందితులు అవుతున్నారు. అందుకే పిల్లల కదలికలపై తల్లిదండ్రులు గుర్తించాలి. ఇంట్లో సైతం సమస్యలు చెప్పుకునే మంచి వాతావరణం ఉండాలి. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యం.

- వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం

Updated Date - Dec 08 , 2025 | 12:01 AM