Share News

blasting in granite quarries: చంపేస్తున్నారు!

ABN , Publish Date - May 29 , 2025 | 11:59 PM

blasting in granite quarries: జిల్లాలో సహజ వనరులుగా ఉన్న కొండలను కొందరు కొల్లగొడుతున్నారు.

blasting in granite quarries: చంపేస్తున్నారు!
రణస్థలం: రాపాక, గారపేట క్వారీలను తనిఖీ చేస్తున్న పోలీసులు

- గ్రానైట్‌ క్వారీల్లో ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్‌లు

- అనుమతి లేకుండా పేలుడు పదార్థాల వినియోగం

- నిబంధనలు పట్టని వైనం.. ఐదేళ్లలో 20మంది మృతి

- ప్రకృతి వనరులు విధ్వంసమవుతున్నా పట్టని అధికారులు

- ప్రమాదం జరిగినప్పుడే తనిఖీల పేరిట హడావుడి

  • ఎచ్చెర్ల మండలం చిలకపాలెం నుంచి పొందూరు వెళ్లే రోడ్డులో రాత్రిపూట భారీ శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ రోడ్డు చెంతనే క్వారీలు అధికంగా ఉంటాయి. నిత్యం బాంబుల మోతతో పరిసర గ్రామాలు దద్దరిల్లిపోతుంటాయి. ఆయా గ్రామాల వారు అధికారులకు ఫిర్యాదు ఇవ్వడం..వారు వాటిని బుట్టదాఖలు చేస్తుండడం సాధారణంగా మారింది. కనీసం ఆయా క్వారీల్లో ఏం జరుగుతుందో కూడా అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేయరు.

  • ఇటీవల జిల్లా వ్యాప్తంగా క్వారీల్లో అధికారులు తనిఖీలు చేశారు. మెళియాపుట్టి మండలంలో ఓ క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. దీంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ, భూగర్భ గనులు, పోలీస్‌, అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. పోలీస్‌ జాగిలాలతో ఈ తనిఖీలు సాగాయి. కానీ ఏం నివేదిక ఇచ్చారో మాత్రం తెలియడం లేదు.

రణస్థలం/మెళియాపుట్టి, మే 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సహజ వనరులుగా ఉన్న కొండలను కొందరు కొల్లగొడుతున్నారు. తమకున్న పలుకుబడితో లీజులు సంపాదించి అడ్డగోలుగా కొండలను గుల్ల చేస్తున్నారు. నిబంధనలను పక్కనపెట్టి క్వారీల్లో యథేచ్ఛగా బాంబులను పెట్టి పేల్చుతున్నారు. సమీపంలో గ్రామాలు ఉన్నా.. ప్రజలు నివసిస్తున్నా..ప్రకృతి వనరులు విధ్వంసానికి గురవుతున్నా.. వన్యప్రాణులకు ముప్పువాటిల్లుతున్నా.. చివరకు మనుషుల ప్రాణాలు పోతున్నా పట్టించుకునేవారు కరువవుతున్నారు. అనధికారికంగా పేలుడు పదార్థాలు విక్రయిస్తున్న వ్యాపారులపై ఎటువంటి చర్యలు లేకుండా పోతున్నాయి. దీంతో వీటి అక్రమాలు జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి.


21mlp0000000003.gifమెళియాపుట్టి: వీఆర్‌టీ గ్రానైట్‌ కార్వీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ దినకర్‌ పుండ్కర్‌

ఇదీ పరిస్థితి..

జిల్లాలో గనుల శాఖ పరిధిలో 301 క్వారీలు నిర్వహిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 233 కలర్‌ గ్రానైట్‌, 56 రోడ్డు మెటల్‌ కంకర, గ్రావెల్‌.. క్వార్జ్‌కు సంబంధించి 12 క్వారీలు ఉన్నాయి. వీటిలో చాలాచోట్ల అనధికారిక పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. సాధారణంగా పేలుడు సామగ్రి వినియోగించాలంటే పెట్రోలియం అండ్‌ పేలుడు పదార్థాల భద్రత సంస్థ (పెసో) అనుమతితో కూడిన లైసెన్స్‌ మంజూరు చేయాల్సి ఉంటుంది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఎక్కువ మందికి దీనిని మంజూరు చేయరు. అంత సులభంగా లైసెన్స్‌ ఇవ్వరు. ప్రస్తుతం జిల్లాలో మూడు సంస్థలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అయితే, క్వారీలు ఎక్కువగా నడుస్తున్న ప్రాంతాల్లో అనధికారికంగా విక్రయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒడిశాలో వీటి ధర తక్కువగా ఉండడంతో అక్కడ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అనధికారంగా టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, శ్రీకాకుళం వంటి పట్టణాల్లో అధికంగా గ్రానైట్‌ పేలుడు పదార్ధాలు అమ్మకాలు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం కొంతమంది అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలు పట్టకుండా తెస్తున్న పేలుడు పదార్థాలతో భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికులు విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.


21mlp0000000004.gifవీఆర్‌టీ గ్రానైట్‌ కార్వీని పరిశీలిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి (ఫైల్‌)

కానరాని చర్యలు

గత ఐదు సంవత్సరాల్లో అధికారిక లెక్కల ప్రకారం క్వారీ ప్రమాదాల్లో 20 మందికిపైగా మృతిచెందారు. 50 మంది వరకూ క్షతగాత్రులయ్యారు. అయినా సరే యంత్రాంగంలో కనీస చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిలెటెన్‌ స్టిక్స్‌ వంటి పేలుడు పదార్థాలు వినియోగించాలంటే క్వారీ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్‌, గనులు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అనుమతులు పొందాలి. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారమందించాలి. అటు తరువాత లైసెన్స్‌దారుడు నుంచి మాత్రమే పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలి. నిపుణుల సమక్షంలో వాటిని పేల్చాల్సి ఉంటుంది. అదే సమయంలో క్వారీలో పనిచేస్తున్న కార్మికుల భద్రతకు పెద్దపీట వేయాలి. వారికి లైఫ్‌ జాకెట్‌తో పాటు రక్షణ సామగ్రి అందించాలి. క్వారీకి 500 మీటర్ల వరకు జనసంద్రత లేకుండా చూసుకోవాలి. పేలుళ్లు చేసేముందు సైరన్‌ మోగించాలి. బ్లాస్టింగ్‌ చేసేవారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి భద్రత కల్పించాలి. కానీ, జిల్లాలో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. నిపుణులను తీసుకువస్తే వారికి అధికంగా జీతాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని క్వారీల్లో కార్మికులతోనే పేలుళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఫలితంగానే క్వారీల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.


పర్యవేక్షణ కరువు..

ఇటీవల మెళియాపుట్టి మండలంలో క్వారీ ప్రమాదం జరిగిన తరువాత అధికారులు హడావుడి చేశారు. రెండు రోజుల పాటు వరుసగా క్వారీలు తనిఖీ చేశారు. వాస్తవానికి నిర్ణిత సమయంలో విధిగా క్వారీలు తనిఖీలు చేయాలి. గనులు, పోలీస్‌, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ, భద్రత, అగ్నిమాపక శాఖలు క్వారీలను నిత్యం పర్యవేక్షిస్తుండాలి. నిత్యం తనిఖీలు చేపట్టి నిబంధనాలు ప్రకారం నడుపుతున్నారా? అన్నది పరిశీలించాలి. లేకుంటే చర్యలకు ఉపక్రమించాలి. కేసులు నమోదుచేయాలి. కానీ, ఏదైనా ఘటన జరిగినప్పుడు ఉరుకులు పరుగులు పెట్టడం.. తరువాత దాని గురించి మరిచిపోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం క్వారీల నిర్వహణపై దృష్టిసారించాల్సి అవసరం ఉంది.


నివేదిక ఎక్కడ?

గత వైసీపీ ప్రభుత్వంలో అధికంగా వైసీపీ నేతల క్వారీలకే అనుమతులు ఇచ్చేవారు. దీంతో ఇష్టారాజ్యంగా పేలుళ్లకు పాల్పడినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. జగన్‌ ప్రభుత్వంలో టీడీపీ నేతలకు చెందిన క్వారీలపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేయడంతో వాటిని మూసివేశారు. ప్రస్తుతం అధికంగా వైసీపీ నేతలకు చెందిన గ్రానైట్‌ క్వారీలే ఉన్నాయి. కూటమి సర్కారు వచ్చిన తరువాత గ్రానైట్‌ క్వారీలపై ఫిర్యాదులు అందడంతో సుమారు ఐదు నెలల పాటు జిల్లాలో పర్మిట్లు నిలుదల చేసింది. విచారణ చేపట్టాలని విజిలెన్స్‌ అధికారులను ఆదేశించింది. కానీ, ఇప్పటికీ నివేదిక బయటకు రాలేదు.


యాజమాన్యంపై చర్యలు శూన్యం..

మెళియాపుట్టి మండలంలోని వీఆర్‌టీ గ్రానైట్‌ క్వారీలో ఈ నెల 16న బ్లాస్టింగ్‌ జరిగి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. అయితే, యాజమాన్యం మాత్రం పిడుగుపడి కార్మికులు మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకు చెప్పింది. దీనిపై మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేయడంతో కలెక్టర్‌, ఎస్పీ వెళ్లి గ్రానైట్‌ క్వారీని పరిశీలించారు. బ్లాస్టింగ్‌ వల్లే కార్మికులు మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే, ఇంత వరకు క్వారీ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


త్వరలోనే అరెస్టు చేస్తాం

క్వారీల్లో అనుమతులు లేకుండా పేలుడు సామగ్రి వినియోగిస్తే కేసులు నమోదు చేస్తాం. వీఆర్‌టీ గ్రానైట్‌ క్వారీలో ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటనకు సంబంధించి యాజమాన్యంపై కేసు నమోదు చేశాం. త్వరలోనే అరెస్టులు చేస్తాం. అన్ని క్వారీలను తనిఖీ చేస్తున్నాం.

-రమేష్‌బాబు, ఎస్‌ఐ, మెళియాపుట్టి


ప్రత్యేక దృష్టి సారించాం

జిల్లాలో క్వారీల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. ముఖ్యంగా పేలుడు పదార్థాల వినియోగానికి అనుతులు తప్పనిసరి. శిక్షణ పొందినవారే ఈ పేలుడు పదార్థాలు వినియోగించాలి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని క్వారీల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఇకపై నిత్య పర్యవేక్షణ, తనిఖీలు ఉంటాయి. ఎక్కడైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్వారీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కేసులు కూడా నమోదుచేస్తాం

-కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం

Updated Date - May 29 , 2025 | 11:59 PM