డిజిటల్ అరెస్టు పేరుతో దోచేస్తున్నారు
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:48 PM
డిజిటల్ అరెస్టుల పేరుతో సైబరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వీరి ఉచ్చులో పడి చాలామంది భారీగా డబ్బులను పోగొట్టుకున్నారు.
-మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు
- భారీగా డబ్బులు పోగొట్టుకుంటున్న బాధితులు
- అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
-కాశీబుగ్గ రోటరీనగర్‌కు చెందిన బమ్మిడి షణ్ముఖరావు అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సైబర్‌నేరగాళ్ల వలలో చిక్కుకొని రూ.కోటి 30 లక్షల 85వేల నగ దును కోల్పోయాడు. మానవ అక్రమ రవాణాకు సం బంధించిన నేరగాళ్ల జాబితాలో మీ పేరు ఉందని, మీ బ్యాంకు ఖాతాలు మొత్తం స్తంభించాయని తొమ్మిది నెలల కిందట ఆయనకు ఓ వాట్సాప్ కాల్ వచ్చింది. దీంతో ఆయన తన ఆధార్, బ్యాంకుఖాతా వివరాలను సైబర్ నేరగాళ్లకు చెప్పడంతో వారు దపదఫాలుగా ఆయన ఖాతా నుంచి నగదును తస్కరించారు.
-కాశీబుగ్గకు చెందిన ఓ ఉపాధ్యాయుడుకు కూడా సైబర్ వలలో పడి రూ.1.20 లక్షల నగదును పోగొట్టుకున్నాడు. మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో మాకు చిక్కాడని, నగదు చెల్లిస్తే కేసు నుంచి బయటకు తెస్తామని ఓపోలీసు అధికారిగా సైబర్‌నేరగాళ్లు ఫోన్ చేశారు. దీంతో వారు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్‌కు రూ.1.20 లక్షల నగదు బదిలీ చేశాడు. తరువాత ఆ యన ఆరా తీయగా సైబర్‌నేరగాళ్ల పని అని తేలింది.
పలాస, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): డిజిటల్ అరెస్టుల పేరుతో సైబరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వీరి ఉచ్చులో పడి చాలామంది భారీగా డబ్బులను పోగొట్టుకున్నారు. ఇప్పటికే డిజిటల్ మోసాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారాలు, హె చ్చరికలు చేస్తున్నా ఇంకా ప్రజలు మోసపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటువంటి సైబర్ ముఠా ఎక్కువగా మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతు న్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఏటీఎం కేంద్రాల వద్ద కార్డులను ఏమార్చి నగదును తస్కరించే వారు. అదే విధంగా బ్యాంకు ఖాతాలను మార్పు చేయాలని, ఓటీపీలు చెప్పాలంటూ మోసాలకు పాల్పడేవారు. వీటిపై సైబర్‌క్రైమ్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడంతో పాటు విస్తృత ప్రచారాలు చేయడంతో ఆ నేరాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, ప్రస్తుతం డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతు న్నారు. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి మోసాలకు పాల్పడుతూ ప్రజల నగదును దోచుకుం టున్నారు. ఆర్‌బీఐ కూడా సైబర్ నేరాలపై అప్రమత్తం చేస్తోంది. ఏ బ్యాంకు అయినా నేరుగా వాట్సాప్, ఫోన్‌లోగాని ఓటీపీ నెంబర్లను అ డగదనే విషయాన్ని వినియోగదా రులు తెలుసుకోవాలి. అనుమానం వస్తే నేరుగా బ్యాంకును సంప్రదిం చాలని నిపుణులు చెబుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం..
ప్రజలకు ఏ చిన్న సైబర్ మో సానికి గురైనా మాకు వెంటనే సంప్రదించాలి. గుర్తుతెలియని వ్య క్తులు ఫోన్ చేసి మీ వ్యక్తిగత వివ రాలు అడిగితే చెప్పకండి. తప్పని సరిగా అటువంటి కాల్స్ సైబర్ నేరగాళ్లవి కావచ్చు. దీనిపై ప్రజ లకు అవగాహన కల్పిస్తున్నాం.
-వై.రామకృష్ణ, సీఐ, కాశీబుగ్గ