Share News

ఇవి వైసీపీ భూ అరాచకాలు

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:38 AM

Farmers' lands were destroyed and sold గత వైసీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతో చేసిన నిర్వాకంతో జిల్లాలో వందలాది మంది రైతులు, ప్రజలు తమ భూములను, స్థలాలను కోల్పోయారు. వీటి పరిష్కారం కోసం శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో ‘మీ చేతికి మీ భూమి- 22-ఏ నుంచి స్వేచ్ఛ’ గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు.

ఇవి వైసీపీ భూ అరాచకాలు
అర్జీలను స్వీకరిస్తున్న రాష్ట్రమంత్రి కింజరాపు.అచ్చెన్నాయుడు

  • రైతుల భూములు మాయం చేసి అమ్మేశారు

  • అధికారం ఉందికదాని చెలరేగిపోయారు

  • ప్రైవేటు భూములూ ప్రభుత్వ భూములుగా..

  • జడ్పీలో ప్రత్యేక గ్రీవెన్స్‌కు పోటెత్తిన బాధితులు

  • నాటి ప్రభుత్వం చేసిన అన్యాయంపై ఆవేదన

  • వారంతా వైసీపీ ప్రభుత్వం బాధితులు. భూములు వారివే. కానీ వారికి దక్కకుండా చేశారు. కొన్ని ప్రభుత్వ భూములుగా చూపించారు. ఇంకొన్ని సర్వేనెంబర్లే మార్చేశారు. అడ్డుగోలుగా అమ్మేసుకున్నారు. నాలుగైదేళ్లుగా బాధితులంతా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఏఒక్కరు కూడా కనికరించలేదు. నాటి పాలకులూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. బాధితులకు న్యాయం చేయాలని సంకల్పించింది. ‘మీ చేతికి మీ భూమి- 22-ఏ నుంచి స్వేచ్ఛ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం జడ్పీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాధితులు పోటెత్తారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

  • కలెక్టరేట్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతో చేసిన నిర్వాకంతో జిల్లాలో వందలాది మంది రైతులు, ప్రజలు తమ భూములను, స్థలాలను కోల్పోయారు. వీటి పరిష్కారం కోసం శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో ‘మీ చేతికి మీ భూమి- 22-ఏ నుంచి స్వేచ్ఛ’ గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ల నుంచి రెవెన్యూ, అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది సమక్షంలో భూ సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వందలాది మంది బాధితులు ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.

  • మా భూమిలో రోడ్డు వేశారు:

  • తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూమి 3 ఎకరాలు ఉండేది. మా భూమి మీదుగా రోడ్డు వేశారు. 80 సెంట్లు కోల్పోయాం. మిగిలిన 2.20 ఎకరాలు రీసర్వే పుణ్యమా అని ప్రభుత ్వ భూమిగా నమోదైంది. అసలే వృద్ధాప్యం, అనారోగ్యంతో వైద్యం కూడా చేయించుకోలేక పోయాను. కుమార్తె పెళ్లి కోసం భూమి అమ్ముకుందామన్నా వీలుకాని పరిస్థితి. నరకయాతన అనుభవిస్తున్నాం. సమస్య పరిష్కారం కోసం ఇక్కడికి వచ్చాను.

  • - శశిరేఖ మహాపాత్రో, బెల్లుపడ, ఇచ్ఛాపురం

  • 22-ఏలో చేర్చి.. నరకం చూపిస్తున్నారు

  • శ్రీకూర్మం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 1038లో 12 మందికి చెందిన 30 ఎకరాలు రీసర్వే తరువాత 22-ఏ జాబితాలోకి చేర్చారు. ఇప్పటికి 10 సార్లు సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేసుకున్నాం. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంక తిరిగేందుకు ఓపిక కూడా లేదు. ప్రత్యేక గ్రీవెన్స్‌లో పరిష్కారం లభిస్తుందనే ఆశతో వచ్చా.

  • - సీతరాజు, గార

  • రీసర్వేలో పేరు మార్చేసి అమ్మేశారు:

  • తాతలు, తండ్రుల నుంచి 40 సెంట్ల భూమిని సాగు చేసుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసరే ్వ పేరిట స్థానిక వైసీపీ నాయకులు 20 సెంట్ల స్థలాన్ని వేరే వ్యక్తి పేరిట బదలాయింపు చేశారు. ఇది జరిగిన 15 రోజుల్లోనే ఆ స్థలాన్ని వేరే వ్యక్తికి అమ్మేశారు. దయచేసి న్యాయం చేయండి.

  • - పల్లా అప్పన్న, గార

  • నాలుగు గ్రామాల్లో 150 ఎకరాలు మాయం

  • రీసర్వే పేరుతో టెక్కలి మండలం కిట్టాలపాడు, డమర, గూడెం, అలాగే నందిగాం మండలం రాంపురం గ్రామాలకు చెందిన 150 ఎకరాల భూమిని రీసర్వే పేరుతో ప్రభుత్వ భూమిగా మార్చేశారు. దీంతో 200 మంది చిన్న, సన్నకారు రైతులు రోడ్డున పడ్డారు. అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. 100 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న మా భూములను ఎలా మార్చేసారో? మా భూములను మాకు ఇప్పించాలి.

  • - నాలుగు గ్రామాల ప్రజల ఆవేదన

  • ఎకరా భూమి.. మార్చేశారు

  • తాతల కాలం నుంచి పొందూరు గ్రామంలో 1.99 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాం. 99 సెంట్లను అమ్మేశాం. అయితే ఆశ్చర్యకరంగా మిగిలిన ఎకరా రీసర్వే తరువాత మా పేరున కనిపించలేదు. దేవాదాయశాఖ భూముల్లోకి ఎలా చేర్చేసారో అర్థం కావడం లేదు. దయచేసి మా భూమిని ఇప్పించాలి.

  • - చదువుల దుర్గాప్రసాదరావు, పొందూరు

  • మా భూమిని మాయం చేశారు:

  • 70 ఏళ్లుగా సరుబుజ్జిలి పంచాయతీ, చిగురువలస గ్రామం సర్వే నెంబర్‌ 16లోని 1.50 ఎకరాల జిరాయితీ భూమిని సాగుచేసుకుంటూ బతుకుతున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో 22-ఏలో చేర్చి మా భూమిని మాయం చేశారు. అన్ని పత్రాలు మా పేరునే ఉన్నాయి. శిస్తు కూడా సక్రమంగా చెల్లిస్తున్నాం. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగుతున్నా.. వాయిదా వేయడం తప్ప పని జరగడం లేదు.

  • - బాన్న గురువులు, చిగురువలస, సరుబుజ్జిలి

Updated Date - Dec 27 , 2025 | 12:38 AM