Share News

సిక్కోలు సమస్యలు ఇవే!

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:01 AM

రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా పేరొందిన శ్రీకాకుళాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా చేయాల్సిన బాధ్యత జిల్లా శాసన సభ్యులపై ఉంది.

  సిక్కోలు సమస్యలు ఇవే!

- సాగు నీటి ప్రాజెక్టులు ఆధునికీకరించాలి

- ‘జల్‌జీవన్‌ మిషన్‌’ వేగవంతం లేదాయె

- నిధులు మంజూరు చేస్తేనే ఫలితం

- నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

- అసెంబ్లీలో ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు

శ్రీకాకుళం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా పేరొందిన శ్రీకాకుళాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా చేయాల్సిన బాధ్యత జిల్లా శాసన సభ్యులపై ఉంది. జిల్లా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం, నిధులు మంజూరయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది. గురువారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వీటిని జిల్లా ఎమ్మెల్యేలు సద్వినియోగం చేసుకుని, తమ గళం వినిపించి అభివృద్ధి, ఉపాధి, రహదారులు, మౌలిక వసతులు కల్పనకు సాధ్యమైనన్ని నిధులు తీసుకువస్తారని ప్రజలు గంపెడాశతో ఉన్నారు.

ఇవీ సమస్యలు..

2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రూపుదాల్చిన నాగావళి-వంశధార నదుల అనుసంధానం ప్రక్రియను.. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ఇప్పటికైనా నదుల అనుసంధానాన్ని వేగవంతం చేయాలి. గొట్టా బ్యారేజీ.. తోటపల్లి, మడ్డువలస, నారాయణపురం, వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువ తదితర సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణకు కోట్లాది రూపాయల నిధుల అవసరముంది. కాలువలు సక్రమంగా లేకపోవడం.. పూర్తిస్థాయిలో పూడిక తీత చేపట్టకపోవడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. తాగునీటికి సంబంధించి జల్‌జీవన్‌ మిషన్‌ పనులు నత్తనడకనగా సాగుతున్నాయి. ఈ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ పథకం నుంచి ఏప్రిల్‌ తర్వాత కొత్తగా నిధులు మంజూరుకాలేదు. బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ పనులు అసలు జరగుతున్నాయో లేదో కూడా తెలియడం లేదు. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలి. శ్రీకాకుళం నగరపాలక సంస్థకు ఎన్నికలు దశాబ్దం నుంచి లేవాయె. అభివృద్ధి కూడా అంతేసంగతి. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా శ్రీకాకుళం జిల్లాలో కస్తూర్బా, ఎంజేపీ, సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు భోజనంతో కూరగాయలు, ఇతరత్రా పోషకాహారం సమకూర్చేందుకుగాను సాధ్యంకాని ధరలను కాంట్రాక్టర్లకు అధికారులు కట్టబెట్టారు. వసతి గృహాల్లో ‘మెనూ’ అంటేనే అంతేలే.. అన్న రీతిలో అధికారులే అనుమానంగా ఉన్నారు. నేరుగా హోల్‌సేల్‌ మార్కెట్‌లో కూడా అంతటి తక్కువ ధరకు లభించని.. ధరలను కాంట్రాక్టరు వేయడం... అధికారులు కూడా గుడ్డిగా అప్పగించడం జరిగింది. దీంతో వసతి గృహాల్లో పౌష్టికాహారం రికార్డుల్లో నూరుశాతం అమలై.. క్షేత్రస్థాయిలో అంతేసంగతిగా మారింది. దీనిపైనా చర్చించి వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేలా, కారకులపై చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.


అన్ని విషయాలపై స్పందిస్తా

రాష్ట్ర మంత్రిగా అన్ని విషయాలపై స్పందిస్తా. ఇటు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలతోపాటు సభ్యులు లేవనెత్తే ప్రతి అంశానికి బదులిస్తా. శాఖాపరంగా నేను తీసుకోవాల్సిన చర్యలపై వెంటనే ఉపక్రమిస్తాను.

- కింజరాపు అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి

రుణాల సమస్యను ప్రస్తావిస్తా

బీసీ కార్పొరేషన్‌ రుణాల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. వారికి రుణాలు మంజూరు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. వంశధార నీరు శివారు భూములకు అందడంలేదు. రైతుల మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా.. కాలువలకు షట్టర్లను ఏర్పాటు చేయాల్సిఉంది. ఈ విషయంపై చర్చిస్తాను. టిడ్కో ఇళ్లును పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాల్సి ఉంది. గిరిజనులు అధికంగా మా నియోజకవర్గంలో ఉన్నారు. జిల్లాలో ఎక్కడైనా ‘ఐటీడీఏ’ను ఏర్పాటు చేయాలి. కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌లో పూర్తిస్థాయిలో వైద్యసిబ్బంది నియమించాలి. ఇవన్నీ సభలో ప్రస్తావిస్తా.

- గౌతు శిరీష, ఎమ్మెల్యే, పలాస


అవసరమైన నిధులు తీసుకువస్తా

మా నియోజకవర్గ ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు అవసరమైన సహకారం కోసం సభలో ప్రస్తావిస్తాను. ఇండస్ట్రీయల్‌ పార్కును శంకుస్థాపన చేశాం. కానీ పరిశ్రమలు ఒక్కటీ ఏర్పాటు కాలేదు. ఎల్‌.ఎన్‌.పేట మండలంలో పోలీసు స్టేషన్‌ లేక పోవడంతో శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ పోలీసు స్టేషన్‌ అవసరం ఉంది. గొట్టాబ్యారేజీ యాప్రాను(రాతికట్ట) పాడైంది. ఇందుకోసం రూ.18 కోట్లు వెచ్చిస్తే ప్రాజెక్టుకు బలం చేకూరుతుంది. వీటన్నింటిపైనా ప్రస్తావించి అవసరమైన నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తా.

-మామిడి గోవిందరావు, ఎమ్మెల్యే, పాతపట్నం

ఉద్యోగుల సమస్యలు తెలియజేస్తా

ఈ దఫా సమావేశాల్లో చాలా విషయాలు ప్రస్తావిస్తా. ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి నదులు అనుసంధానం పూర్తిచేయాలి. వంశధార, నాగావళి కరకట్టల నిర్మాణం చేపట్టాలి. ఎత్తిపోతల పథకాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటికి నిధులు అవసరముంది. జల్‌జీవన్‌ మిషన్‌ పనులు సరిగ్గా జరగట్లేదు. గత ప్రభుత్వం అమ్మేసిన గ్రూప్‌-1 ఉద్యోగుల విషయమై అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీ వంటి విషయాలను ప్రస్తావిస్తాను.

-కూన రవికుమార్‌, పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే, ఆమదాలవలస


రైతుల ఇబ్బందులను ప్రస్తావిస్తా

వంశధార ఎడమ ప్రధాన కాలువలో 2300 క్యూసెక్కుల నీరు ప్రవహించాల్సిఉంది. కానీ 1400 క్యూసెక్కుల నీరు దాటితే కాలువకు గండి పడిపోతుంది. కాలువను ఆధునికీకరించాల్సిందే. సాగునీటి కోసం రైతుల ఇబ్బందులను ప్రస్తావిస్తాను. వనితమండలం వంతెన పనులను గత ప్రభుత్వం పక్కనబెట్టేసింది. మరలా ఇప్పుడు సాంకేతిక పరంగా అనుమతులు ఇచ్చి.. వంతెనను పూర్తిచేయాలి. సారవకోట మండలంలో మరో ఉద్దానం మాదిరిగా కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడకు సురక్షితమైన తాగునీటిని ప్రాజెక్టు ద్వారా అందించే పథకాన్ని మంజూరుచేయాలి. జల్‌జీవన్‌ మిషన్‌ పనులు అంతగా నిర్వహించలేదు. ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తాను.

- బగ్గు రమణమూర్తి, ఎమ్మెల్యే, నరసన్నపేట

ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతా..

ఎచ్చెర్ల నియోజకవర్గంలో అత్యధిక పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ స్థానికులకు కూడా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాన్ని కోరుతా. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తాను. తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టులను ఆధనికీకరించాలి. బుడగట్లవానిపాలెం హార్బర్‌ పనులు కొనసాగేలా సీఎంను కోరుతా. గత ప్రభుత్వంలో అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. వారికి ఇప్పుడు ఇళ్ల స్థలం కేటాయించి.. ఇళ్లను నిర్మించి ఇచ్చేలా ప్రస్తావిస్తా. కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం పనులు ప్రారంభించాలని, యువతకు ఉపాధి కోసం స్కిల్‌ డవలప్‌మెంట్‌ సెంటర్‌ను నెలకొల్పాలని కోరుతా.

- నడుకుదిటి ఈశ్వరరావు, ఎమ్మెల్యే, ఎచ్చెర్ల


మైనర్‌ ఇరిగేషన్‌ కోసం మాట్లాడుతా

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న సాగునీటి వనరులన్నీ మైనర్‌ ఇరిగేషన్‌కు చెందినవే. వాటి నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరుచేయాలని కోరుతా. ఇప్పుడు నేను ప్రభుత్వ విప్‌గా ఉండటంతో అన్ని విషయాల్లో ఆచితూచి స్పందించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చాఫురం నియోజకవర్గం వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చాలని కోరుతాను. ఆటో, ట్రాక్టర్‌ వాహనాల సామర్థ్యం పరీక్షించేందుకు జిల్లా కేంద్రానికి వాహనం తీసుకుని వాహనదారులు వెళ్లాల్సివస్తుంది. నియోజకవర్గ కేంద్రంలో వాహన సామర్థ్య(ఫిట్‌నెస్‌) పరీక్ష నిర్వహించాలని ప్రస్తావిస్తాను. బెంతుఒరియాల విషయాన్ని మరలా ప్రస్తావిస్తాను.

-బెందాళం అశోక్‌, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం

సమస్యల పరిష్కారం కోసం యత్నిస్తా

శ్రీకాకుళం నగర పాలక సంస్థకు ఎన్నికల నిర్వహించే ముందరే వార్డుల పునర్విభజన జరగాలి. ఈ విషయమై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. శ్రీకాకుళం నియోజకవర్గంలో వంశధార కుడిప్రధాన కాలువ పరిధి 37 ఉపకాలువ నుంచి శివారు భూములకు సాగునీరు అందడంలేదు. ఈ విషయమై ప్రశ్నించేందుకు ఇప్పటికే సమాయత్తమయ్యాను. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దేందుకు.. తాగునీటి వ్యవస్థను సరిచేసేందుకు.. ట్రాఫిక్‌ రెగ్యులైజేషన్‌ చేసేందుకుగాను నిధులు మంజూరుచేయాల్సిఉంది. వీటిపై సమగ్రంగా చర్చిస్తాను. ఎత్తిపోతల పథకాల మరమ్మతుకు నిధులు అవసరం. సింగుపురంలో జూనియర్‌ కళాశాల నిర్మాణం చేయాలి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న నర్సింగ్‌ కళాశాలను త్వరితగతిన పూర్తిచేయాలి. కేఆర్‌ స్టేడియం, ఆమదాలవలస రోడ్డు పూర్తిచేయాలి. ఇలా అన్ని విషయాలపై అసెంబ్లీలో చర్చించి.. సమస్యల పరిష్కారం కోసం యత్నిస్తాను.

- గొండు శంకర్‌, ఎమ్మెల్యే, శ్రీకాకుళం.

Updated Date - Sep 18 , 2025 | 12:01 AM