Share News

ఇవి సమస్యల కాంప్లెక్స్‌లు

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:10 AM

many problems in complexes జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. పాడైన తాగునీటి కుళాయిలు, శిథిలావస్థలో మరుగుదొడ్లు, కూర్చోవడానికి వీల్లేకుండా విరిగిన కుర్చీలు.. తిరగని ఫ్యాన్లతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇవి సమస్యల కాంప్లెక్స్‌లు
నరసన్నపేట కాంప్లెక్స్‌లో కుర్చీలు పాడైపోవడంతో.. అధిక శాతం మంది నిల్చొన్న ప్రయాణికులు

  • శిథిలమైన మరుగుదొడ్లు

  • అలంకారప్రాయంగా కుర్చీలు

  • పనిచేయని తాగునీటి కుళాయిలు

  • వర్షం పడితే చుట్టూ నీరే

  • అరకొర సౌకర్యాలతో ప్రయాణికులకు ఇక్కట్లు

  • అరసవల్లి/ నరసన్నపేట/ పలాస/ ఇచ్ఛాపురం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. పాడైన తాగునీటి కుళాయిలు, శిథిలావస్థలో మరుగుదొడ్లు, కూర్చోవడానికి వీల్లేకుండా విరిగిన కుర్చీలు.. తిరగని ఫ్యాన్లతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు వర్షం పడితే చాలు.. కాంప్లెక్స్‌ ఆవరణ చుట్టూ నీరు నిలిచి.. మురుగు కంపుతో నరకయాతన పడుతున్నారు.

  • జిల్లాకేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కాంప్లెక్స్‌ ఆవరణలో రోడ్లు పాడైపోయాయి. మురుగునీరు, చెత్తతో అపరిశుభ్రంగా మారింది. వర్షం కురిస్తే కాంప్లెక్స్‌ ఆవరణ చుట్టూ అడుగున్నరకుపైగా నీరు నిలిచిపోతుంది. కాలువల్లో మురుగునీరు సైతం వరదనీటితో కలిసి ప్రయాణికులకు మరింత ఇబ్బంది కలుగజేస్తోంది. కాంప్లెక్స్‌ ఆవరణలో చాలా కుర్చీలు, ఫ్యాన్లు పాడైపోయాయి. మరుగుదొడ్లు శుభ్రంగా లేవు. ప్రయాణికుల మధ్యనే శునకాలు తిరుగుతూ.. సేదతీరుతున్నాయి. ఔట్‌గేటు వద్ద వ్యాపారులు బళ్లుపై పండ్లు విక్రయించడంతో బస్సులు రాకపోకల సమయంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

  • శ్రీకాకుళం తర్వాత నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌ నిత్యం ప్రయాణికులతో కళకళలాడుతుంది. ఈ కాంప్లెక్స్‌ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ వంటి ప్రాంతాలతోపాటు జిల్లాలో రూరల్‌ ప్రాంతాలకు కూడా అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రోజుకు సరాసరి 2వేల మంది ప్రయాణిస్తుంటారు. కాగా కాంప్లెక్స్‌లో చాలా కుర్చీలు పాడై.. కూర్చోవడానికి వీల్లేకుండా పోయాయి. మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షం కురిస్తే మరుగుదొడ్ల పైనుంచి నీరు కారుతుంది. పురుషుల మరుగుదొడ్లకు తలుపులు ఊడిపోయాయి. తాగునీటి కుళాయి వద్ద అపారిశుధ్యం కనిపిస్తోంది. ఇక షాపుల్లో ఎక్కువగా నాన్‌ బ్రాండ్‌ శీతల పానీయాలు అధిక ధరకు విక్రయించి ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఇటీవల ఆర్టీసీ ఆవరణలో దుకాణాలు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు నిల్చోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది.

  • పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌లోనూ మౌలిక సదుపాయాలు లేవు. మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేక దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల ఇబ్బందులు వర్ణణాతీతం. కాంప్లెక్స్‌ ఆవరణ చుట్టూ అపారిశుధ్యమే. ఇటీవల కురిసిన వర్షానికి వరదనీరు చేరడంతో కాంప్లెక్స్‌కు వెళ్లే మార్గం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పలాస కన్నా.. కాశీబుగ్గలోని మునిసిపల్‌ బస్‌ కాంప్లెక్స్‌ నుంచే అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. పలాస కాంప్లెక్స్‌ను ఆధునికీకరించి.. సౌకర్యాలు కల్పిస్తే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

  • ఇచ్ఛాపురం కాంప్లెక్స్‌లో ప్రయాణికులు కూర్చొనేందుకు కుర్చీలు కానీ, తాగేందుకు నీటి సౌకర్యం కానీ లేదు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా పట్టించుకునేవారు లేరు. కాంప్లెక్స్‌ చుట్టూ ప్రహరీ లేక.. ముళ్లపొదలతో నిండిపోయింది. కాంప్లెక్స్‌ ఆవరణలో రోడ్డు గతుకులమయంగా దర్శనమిస్తోంది. ప్రధానంగా వర్షాలు పడితే.. నీరు నిల్వ ఉండిపోవడంతో ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం వర్షం కురవగా.. కాంప్లెక్స్‌లో ఆవరణలో వరదనీటితో అవస్థలు పడ్డారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. కాంప్లెక్స్‌ల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని వేడుకుంటున్నారు.

  • సౌకర్యాలు కల్పించాలి

  • నరసన్నపేట నుంచి ఇతర ప్రాంతాలకు తరుచూ ప్రయాణిస్తాం. కాంప్లెక్స్‌లో కనీస సౌకర్యాలు సరిగా లేవు. మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. తాగునీటి వ్యవస్థ బాగా లేదు. బస్సులు వచ్చే సమాచారం తెలిపే మైకులు లేవు. వర్షం కురిసే సమయంలో మరింత ఇబ్బందులు పడుతున్నాం. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి.

    - శ్రీకాంత్‌, సంతబొమ్మాళి

  • కుర్చీలు ఏర్పాటు చేయాలి

  • నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మరుగుదొడ్లు సరిగా పనిచేయవు. వర్షంపడితే పై నుంచి నీరు కారుతుంది. బస్సులు వచ్చేవరకు కూర్చొనేందుకు కుర్చీలు ఏర్పాటు చేయాలి.

    - లీలారాణి, ఉపాధ్యాయురాలు

Updated Date - Oct 14 , 2025 | 12:10 AM