జిల్లాలో థర్మల్ ప్రాజెక్టు
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:21 AM
AP Genco proposal ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఏపీ జెన్‌కో సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. వెన్నెలవలస వద్ద 3,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
సరుబుజ్జిలి మండలంలో నిర్మాణానికి ఏపీ జెన్‌కో ప్రతిపాదన
ఒక్కోటి 800 మెగావాట్ల చొప్పున.. నాలుగు యూనిట్లు
రూ.30వేల కోట్లు అవసరమని అంచనా
శ్రీకాకుళం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఏపీ జెన్‌కో సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. వెన్నెలవలస వద్ద 3,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒక్కొక్కటి 800 మెగావాట్ల చొప్పున నాలుగు యూనిట్లను జెన్‌కో సొంతంగా నిర్మించనుంది. డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ఢిల్లీకి చెందిన దేశీఇన్ సంస్థ రూపొందించనుంది. ప్రాజెక్టు ఏర్పాటు చేసే ప్రాంతంలో టోపోగ్రఫికల్ సర్వే పనులను ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు అప్పగించింది. జియో టెక్నికల్ పరిశీలన పనులను ఆంధ్రా యూనివర్శిటీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహిస్తోంది. కొన్నాళ్ల కిందట అధికారులు సరుబుజ్జిలి మండలం చిగురువలస పంచాయతీలోని వెన్నెలవలస, శ్రీరామువలస, లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో భూములను పరిశీలించారు. అలాగే ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా కొన్నాళ్ల కిందట జెన్‌కో బృందంతో సమీక్ష నిర్వహించారు. థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.30వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. మూలపేట నౌకాశ్రయానికి దగ్గరగా ఏర్పాటు చేస్తే ఒడిశా నుంచి సముద్రమార్గంలో బొగ్గు సులభంగా తీసుకునేందుకు తరలించేందుకు వెసులుబాటు.. సౌకర్యం ఉంటుందని అధికారులు గుర్తించారు. ఆమదాలవలస రైల్వేస్టేషన్ నుంచి రైల్వే స్లయిడింగ్ పనులకు అంచనాలు రూపొందించే పనులను రైట్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. అలాగే గత నెల 22న జెన్‌కో ఎమ్‌డీ చక్రధరరావు కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు. వెన్నెలవలస వద్ద విద్యుత్ కేంద్రం నెలకొల్పేందుకు సుమారు రెండువేల ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. విద్యుత్ కేంద్రం నెలకొల్పితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
రిజర్వాయర్ నుంచి నీటి వినియోగం..
థర్మల్‌ప్లాంట్ నిర్వహణకు అవసరమైన నీటిని హిరమండలం రిజర్వాయర్ నుంచి వినియోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంతోపాటు సరుబుజ్జిలికి చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్‌లో నీటి లభ్యత(హైడ్రాలిక్ డేటా)ను జలవనరుల శాఖ అంచనావేసింది. ఈమేరకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రాజెక్టు పనులు ప్రారంభమైతే... నాలుగేళ్లలో పూర్తిఅవుతుందని అధికారులు అంచనా వేశారు. విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయితే జిల్లా అభివృద్ధి చెందనుందని భావిస్తున్నారు.
ఆటంకాలు లేకుండా.. ముందే గుర్తిస్తే మేలు..
ఇటీవల కొంతమంది థర్మల్ ప్లాంట్ వద్దంటూ.. ఉద్యమానికి సిద్ధమయ్యారు. చిన్నపాటి చర్చాకార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అంతటా సర్వే చేసి.. ప్రజల ప్రయోజనాలు.. జిల్లా అభివృద్ధి పరంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నాకే ప్లాంట్ నిర్మాణం మొదలు పెడుతుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్లాంట్ నిర్మాణం ముందుకు సాగాలంటే.. అవాంతరాలను గుర్తించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది, జిల్లా పోలీసు శాఖదే. థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో ప్రభుత్వం తీసుకునే భద్రతా చర్యలు.. వినియోగించే టెక్నాలజీ.. మారనున్న జిల్లా అభివృద్ధి గురించి సమగ్రంగా వివరిస్తూ సదస్సులను నిర్వహిస్తే అందరికీ అవగాహన కలుగుతుంది. వ్యతిరేక ప్రచారం లేకుండా ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరే అవకాశముంది. జిల్లా ప్రజాప్రతినిధులు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.