Share News

ఇక రైల్వేగేట్లు ఉండవ్‌

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:19 AM

రైల్వే లెవిల్‌ క్రాస్‌ గేట్లు ఇక ఉండవు. వాటిని పూర్తిగా ఎత్తివేసి వాటి స్థానంలో వాహనాల రద్దీని బట్టి అండర్‌ పాసేజ్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు.

ఇక రైల్వేగేట్లు ఉండవ్‌
సున్నాదేవి రైల్వే లెవిల్‌ క్రాస్‌ గేటు

- వాటిస్థానంలో అండర్‌ పాసేజ్‌లు, ఫ్లైఓవర్ల ఏర్పాటు

- పలాస సబ్‌డివిజన్‌లో 18 నిర్మాణం

- భూసేకరణకు రైల్వేశాఖ ఆదేశం

పలాస, జూలై 2(ఆంధ్రజ్యోతి): రైల్వే లెవిల్‌ క్రాస్‌ గేట్లు ఇక ఉండవు. వాటిని పూర్తిగా ఎత్తివేసి వాటి స్థానంలో వాహనాల రద్దీని బట్టి అండర్‌ పాసేజ్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ పనులు పూర్తికానున్నాయి. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ ఖుర్ధా డివిజన్‌ పరిధిలోని పలాస సబ్‌డివిజన్‌లో ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు మొత్తం 18 అండర్‌ పాసేజ్‌ల నిర్మాణానికి రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు భూసేకరణ చేసి త్వరితగతిన స్థలాలు అప్పగించాలని జిల్లా కలెక్టరేట్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పలాస డివిజన్‌ పరిధిలో భూసేకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా రైల్వేశాఖలో వినూత్న మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా లెవిల్‌క్రాస్‌ గేట్లు లేని రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. రైల్వేగేట్ల నిర్వహణ రైల్వేశాఖకు భారంగా మారింది. రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో గేట్లు వేయడంతో గంటల కొద్ది సమయం వృఽథాతో పాటు సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ భారాన్ని తగ్గించుకోవడానికి లెవిల్‌క్రాస్‌ గేట్లు పూర్తిగా ఎత్తివేయాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో అండర్‌ పాసేజ్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించాలని భావిస్తోంది. కాశీబుగ్గ, తాళభద్ర రైల్వే లెవిల్‌ క్రాస్‌ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం రైల్వేశాఖ నిధుల ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అంచనాలు సమర్పించింది. వీటితో పాటుగా కొర్రాయిగేటు, పాలవలస వంటి ప్రాంతాల్లో కూడా ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు ముందుగా అండర్‌ పాసేజ్‌లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సున్నాదేవి, కొండలోగాం జంక్షన్‌(సొండోడికొట్టు), కొబ్బరూరు, రంగోయి తదితర ప్రాంతాల్లో ఉన్న రైల్వే గేట్లను తొలగించి ఆయా ప్రాంతాల్లో అండర్‌ పాసేజ్‌లు నిర్మించనున్నారు. ఇప్పటికే ఈస్ట్‌కోస్ట్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న విశాఖ డివిజన్‌లో 90 శాతానికి పైగా అండర్‌ పాసేజ్‌ల నిర్మాణం పూర్తయ్యాయి. పది శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటికి ఉన్న చిన్నచిన్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించి ఆ పనులు కూడా చేయడానికి రైల్వేశాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అండర్‌పాసేజ్‌ల నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు పలాస ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నాయి. దీంతో అధికారులు నవంబరు నాటికి భూ సేకరణ పూర్తిచేసి రైల్వేశాఖకు అప్పగించనున్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయితే వచ్చే ఏడాది నాటికి లెవిల్‌క్రాస్‌ గేట్లు లేని వ్యవస్థగా రైల్వేశాఖ మారనుంది.

Updated Date - Jul 03 , 2025 | 12:19 AM