వీధుల్లో వర్షపునీరు ఉండరాదు
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:42 PM
no rainwater on the streets వర్షపు నీరు నగర వీధుల్లో నిలిచిపోవడానికి వీల్లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్, పాతబ్రిడ్జి, ముత్యాలమ్మ మార్కెట్, సత్యానగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): వర్షపు నీరు నగర వీధుల్లో నిలిచిపోవడానికి వీల్లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్, పాతబ్రిడ్జి, ముత్యాలమ్మ మార్కెట్, సత్యానగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కాలువలు, రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. వర్షపు నీరు నిల్వ ఉండడం గమనించి, చర్యల కోసం అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కాలువలపై ఎక్కడైనా నిర్మాణాలు ఆటంకం కలిగిస్తే, వెంటనే వాటిని తొలగించాలని స్పష్టం చేశారు. ఆర్‌అండ్‌బీ నిధులతో రోడ్లకు ఇరువైపులా కాలువలను పునరుద్ధరించి, ఎటువంటి అడ్డంకులు లేకుండా వర్షపు నీరు నదిలోకి చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణంలో నీటి నిల్వ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా అధికారులు సమన్వయం పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, సహాయ ప్రణాళికాధికారులు వెంకటేశ్వరరావు, జానకి, మునిసిపల్ హెల్త్ అధికారి సుధీర్‌కుమార్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.