fertilizers stock : ఎరువుల కొరత లేదు
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:43 PM
Strict action against those involved in irregularities జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇబ్బందులుంటే ఒక్క ఫోన్‌తో పరిష్కారం
అక్రమాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఎరువుల పంపిణీపై పర్యవేక్షణ కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 91218 63788 ఏర్పాటు చేశాం. ఎరువుల సరఫరాలో ఎటువంటి సమస్యలున్నా ఈ నెంబర్‌కు ఫోన్ లేదా వాట్సాప్ మెసేజ్ చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటాం. వీఏఏల ద్వారా కానీ, సచివాలయంలో కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఖరీఫ్‌లో జిల్లాలో 3,37,300 ఎకరాల్లో వరి సాగవుతోంది. దీనికి 17వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేశాం. అయినా ఇప్పటివరకు రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 10,244 మెట్రిక్ టన్నులు, అలాగే ప్రైవేటు డీలర్ల ద్వారా 11,400 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశాం. అంచనాలకు మించి అందించాం. ప్రస్తుతం జిల్లాలో 1031 టన్నుల యూరియా అందుబాటులో ఉంది. వారం రోజుల్లో జిల్లాకు మరో 3,200 టన్నుల ఎరువులు రానున్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. రబీ సీజన్‌కు ఇప్పటి నుంచే ఎరువులను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిస్థాయి సరఫరాకు చర్యలు తీసుకున్నాం. ఎరువుల నిల్వలపై రోజూ రెవెన్యూ, విజిలెన్స్ విభాగాల సహకారంతో తనిఖీలు చేపడుతున్నాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారి లైసెన్సు రద్దు చేసి, షాపు సీజ్ చేసి కఠినచర్యలు తీసుకుంటాం. నానో యూరియా కూడా అందుబాటులో ఉంది. అరలీటరు కేవలం రూ.220 మాత్రమే. ఇది ఒక యూరియా బస్తాకు సమానం. దీనిని డ్రోన్ల ద్వారా, లేదా స్ర్పేయర్ల ద్వారా వినియోగించుకోవచ్చు. నానో యూరియా వినియోగం, దాని ద్వారా పొందే అధిక లాభాలను రైతులకు అవగాహన కల్పిస్తామ’ని కలెక్టర్ తెలిపారు.