అధికారులు లేరు... ప్రజాప్రతినిధులు రారు
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:35 PM
ZP standing committee meetings శ్రీకాకుళంలోని జడ్పీ స్థాయీ సంఘ సమావేశం వెలవెలబోయింది. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు స్థాయీ సంఘ సమావేశాలు ప్రారంభించాల్సి ఉంది. కాగా.. సకాలంలో పూర్తిస్థాయిలో అధికారులు లేక.. ప్రజాప్రతినిధులు రాలేదు. దీంతో మధ్యాహ్నం 2.45 గంటలకు జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన సీఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమైంది.
ఇదీ జడ్పీ స్థాయీసంఘ సమావేశాల దుస్థితి
సమస్యలు వినేదెవరంటూ ఎమ్మెల్యే కూన రవి ధ్వజం
అరసవల్లి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని జడ్పీ స్థాయీ సంఘ సమావేశం వెలవెలబోయింది. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు స్థాయీ సంఘ సమావేశాలు ప్రారంభించాల్సి ఉంది. కాగా.. సకాలంలో పూర్తిస్థాయిలో అధికారులు లేక.. ప్రజాప్రతినిధులు రాలేదు. దీంతో మధ్యాహ్నం 2.45 గంటలకు జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన సీఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమైంది. మధ్యాహ్న సమయానికి కూడా సమావేశానికి జిల్లాస్థాయి అధికారులు చాలామంది గైర్హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు కూడా అతి కొద్దిమంది మాత్రమే వచ్చారు. దీంతో సమస్యలపై చర్చ ముందుకు సాగలేదు. సమస్యను ప్రస్తావిస్తే.. కిందిస్థాయి సిబ్బంది ‘మా పై అధికారుల దృష్టికి తీసుకువెళతాం’ అని చెప్పడంతో సమావేశానికి హాజరైన పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ సమావేశాలకు జిల్లా అధికారులు హాజరుకాకుంటే సమస్యల పరిష్కారం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. సమస్యలను ప్రస్తావించే వేదిక ఇదని, ఇటువంటి సమావేశాలకు హాజరు కావాల్సిన బాధ్యత అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఉందని స్పష్టం చేశారు. ‘గత నెలలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చింకుండానే వైసీపీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు ప్రొటోకాల్ రగడ పేరిట బయటకు వెళ్లిపోయారు. ఇది ఎంతమాత్రం హర్షించదగ్గ చర్య కాదు. ఏ విషయమైనా సమావేశంలోనే చర్చించాలి. సొంత అజెండాతో ఇలా ప్రవర్తించడం సరికాదు. ప్రజలు ఎన్నుకున్నది ఇందుకేనా?. జడ్పీటీసీలకు బాధ్యత లేదా?’ అని రవికుమార్ ప్రశ్నించారు. జడ్పీ ఆధ్వర్యంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించాలని, లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న, ఇంకా మొదలుకాని పనుల వివరాలను తెలియజేయాలని అధికారులను కోరారు. సమస్యలపై పెద్దగా చర్చ జరగకుండానే సమావేశం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు టొంపల సీతారాం, కిలారి త్రినాథులు, ధర్మాన కృష్ణచైతన్య, సురవరపు నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.