Share News

మైదానాలున్నా ఆటల్లేవ్‌

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:56 PM

Shortage of PDs in junior colleges పాఠశాల విద్యార్థుల క్రీడా పోటీలు ఇటీవల జరిగాయి. మరి జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు అంటే మాత్రం సమాధానం దొరకదు. దీనికి కారణం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పీడీలు లేకపోవడం.

మైదానాలున్నా ఆటల్లేవ్‌
రణస్థలంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ క్రీడామైదానం

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పీడీల కొరత

క్రీడలకు దూరంగా విద్యార్థులు

రణస్థలం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యార్థుల క్రీడా పోటీలు ఇటీవల జరిగాయి. మరి జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు అంటే మాత్రం సమాధానం దొరకదు. దీనికి కారణం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పీడీలు లేకపోవడం. ప్రభుత్వ కాలేజీలతో పోల్చుకుంటే ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో పీడీల నియామకం జరుగుతుండడంతో అంతర్‌ యూనివర్సిటీ, జోనల్‌స్థాయిలో ప్రైవేటు విద్యార్థులే మెరుస్తున్నారు. ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల జాడ లేదు. ప్రస్తుతం విద్యాసంవత్సరంలో సగం రోజులు పూర్తయ్యాయి. కానీ కాలేజీల్లో క్రీడల దుస్థితి మాత్రం నానాటికీ తీసికట్టుగా మారింది. జిల్లాలో 38 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. ఇంటర్‌ ప్రథమ విద్యార్థులు 6,491మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,895 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ కళాశాలలన్నింటికీ క్రీడా మైదానాలు ఉన్నాయి. కానీ విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు కనీస స్థాయిలో ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడు సైతం లేకపోవడం దారుణం. గతంలో జూనియర్‌ కాలేజీల్లో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలు కొనసాగేవి. ఏటా క్రమం తప్పకుండా క్రీడాపోటీలు నిర్వహించేవారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఉండేవారు. కానీ వారు పదవీవిరమణ చెందిన తర్వాత కొత్తగా పోస్టులు భర్తీ చేయలేదు. సబ్జెక్టు బోధకుల మాదిరి కాంట్రాక్టు ప్రతిపాదికన నియమించలేదు. దీంతో కాలేజీల్లో క్రీడా శిక్షణ లేకుండా పోయింది. జిల్లాకేంద్రంలో ప్రభుత్వ కాలేజీల్లో సైతం క్రీడలు నిర్వహించని దుస్థితి నెలకొంది.

మైదానాలు అస్తవ్యస్తం

జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ క్రీడా మైదానాలకు సంబంధించి సరైన నిర్వహణ లేక అస్తవ్యస్తంగా మారాయి. కొన్నిచోట్ల గత వైసీపీ సర్కారు నాడు-నేడు పనుల పేరిట భవన నిర్మాణ సామగ్రితోపాటు తొలగించిన భవనాలకు సంబంధి వేస్ట్‌ మెటీరియల్‌ను పడేసింది. వైసీపీ పాలనలో ప్రభుత్వ కాలేజీల స్థాయిలో క్రీడాపోటీలు కూడా నిర్వహించలేదు. ఎన్నికలకు ముందు గ్రామాల్లో మాత్రం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట హడావుడి చేశారు. అంతకుమించి క్రీడల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిన దాఖలాలు మాత్రం లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం కళాశాలల్లో క్రీడా పోటీల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వ్యాయామ ఉపాధ్యాయులను కూడా భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.

దృష్టిపెట్టాం..

వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాం. జిల్లాలోని 38 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నియామకాలకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమించనున్నాం.

- సురేష్‌కుమార్‌, జిల్లా వృత్తివిద్యాధికారి, శ్రీకాకుళం

Updated Date - Nov 22 , 2025 | 11:56 PM