Road works: అప్పుడూ వారే.. ఇప్పుడూ వారే!
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:26 PM
ITDA road works గిరిజన ప్రాంతవాసులకు రహదారి కష్టాలు తప్పడం లేదు. వైసీపీ పాలనలో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
చక్రం తిప్పుతున్న వైసీపీ హయాంలోని కాంట్రాక్టర్లు
రోడ్డు పనుల నిర్వహణలో ఓ అధికారి ఇష్టారాజ్యం
అధికారపార్టీ నాయకులకు పరిచయంచేసి పనుల అప్పగింత
కలెక్టర్‌కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
16 పనులు పీఆర్ శాఖకు బదలాయింపు
అప్పుడూ.. ఇప్పుడూ ఆ కాంట్రాక్టర్లే చక్రం తిప్పుతున్నారు. వారికి ఓ అధికారి సహకరిస్తున్నారు. అధికారపార్టీ నాయకులకు వారికి ‘దగ్గర’చేసి మరీ పనులు అప్పగిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్లు మాత్రం బిల్లులు చేసుకుని పనులు మధ్యలే ఆపేశారు. ఇది గిరిజనులకు శాపంగా మారింది. ఈ వ్యవహారాలపై కలెక్టర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కలెక్టర్ రూ.20.3 కోట్ల విలువైన 16 పనులకు పీఆర్‌కు బదలాయించారు. ఇంతజరుగుతున్నా సదరు అధికారిపై చర్యలు తీసుకోవడం లేదు. కొందరు అధికారపార్టీ నేతలు ఆ అధికారికి అభయం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
మెళియాపుట్టి, జూలై 1(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతవాసులకు రహదారి కష్టాలు తప్పడం లేదు. వైసీపీ పాలనలో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ గిరిజన శాఖఅధికారులతో ప్రత్యేక సమావేశమయ్యారు. రహదారులు లేని గ్రామాలను గుర్తించాలని ఆదేశించారు. ప్రతీ గిరిజన గ్రామానికి వాహనం వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, డోలీ మోతలు లేని గ్రామాలు కనిపించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాకు సంబంధించి సీతంపేట ఐటీడీఏ పరిధిలో తొలివిడతగా ఉపాధిహామీ నిధులతో 151 పనులకు సుమారు రూ.75కోట్లు మంజూరు చేశారు. ఇందులో పాతపట్నం నియోజకవర్గంలోనే 107 పనులకుగానూ రూ.56 కోట్లు కేటాయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే అంచనాలు రూపొందించి పనులు చేయాలని ఆదేశించారు. కాగా, ఐటీడీఏలోని ఓ ఇంజనీరింగ్ అధికారి.. పక్క జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది కాంట్రాక్టర్లను అధికారపార్టీ నాయకులకు పరిచయం చేసి పనులు అప్పగించినట్టు తెలుస్తోంది. దీంతో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వారే నియోజకవర్గంలో అధికంగా పనులు చేస్తున్నారు. గతంలో వారు పనులు చేయకముందు అడ్వాన్స్‌ల రూపంలో బిల్లులు చేయించుకున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా పనులు ప్రారంభించి.. మధ్యలోనే వదిలేశారు. యంత్రాలతో మట్టి తవ్వి రోడ్డుపై వదిలేయడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో 16 రోడ్లకు సంబంధించి రూ.20.30 కోట్లతో చేయాల్సిన పనులను ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ నుంచి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ కేటాయించారు. మెళియాపుట్టి మండలంలో 11, హిరమండలం మండలంలో మూడు, కొత్తూరు మండలంలో రెండు రహదారుల పనులను పీఆర్ ఇంజనీరింగ్‌శాఖకు అప్పగించారు. ఈ మేరకు ఇటీవల పంచాయతీరాజ్ ఎస్‌ఈ జి.రవి ఐటీడీఏ పరిధిలో రహదారులను పరిశీలించారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పనులు చేపట్టే అవకాశం లేదు. నిధులున్నా పనులు జరగడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఆ అధికారిపై చర్యలేవీ?
రహదారుల పనుల బదలాంపు నేపథ్యంలో.. ఐటీడీఏ ఇంజనీరింగ్‌శాఖలో ఏమి జరుగుతుందనేది చర్చనీయాంశమవుతోంది. ఐటీడీఏలోని ఒక ఇంజనీర్ పనుల వద్దకు వెళ్లకుండానే కాంట్రాక్టర్ ద్వారానే ఎం-బుక్‌లో వివరాలు నమోదు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అందుకే గత ప్రభుత్వంలో పనిచేసిన ఇతర జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు(ఆ అధికారి బంధువులే) ఇక్కడ పనులపై ఆసక్తి కనబరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ అక్రమాల వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో పనులు బదలాయింపు జరిగినట్టు తెలుస్తోంది. కాగా, గతంలో ఆ అధికారి తీరుపై జిల్లాకు చెందిన అధికారపార్టీ నేత ఒకరు అమరావతిలో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, కొంతమంది అధికారపార్టీ నేతలే ఇంతవరకూ ఆ అధికారిపై చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని, ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
సాంకేతిక అనుమతులు రావాలి
ఐటీడీఏ శాఖ నుంచి పంచాయతీరాజ్ శాఖకు 16 రోడ్ల పనులు అప్పగించాం. వీటికి మళ్లీ అంచనాలు తయారు చేసి సాంకేతిక అనుమతులకు పంపించాం. ఇటీవల పంచాయితీరాజ్ ఎస్‌ఈ పనులు పరిశీలించారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులను ప్రారంభిస్తాం.
- ఆనంద్‌కూమార్, పంచాయతీరాజ్ ఏఈ, మెళియాపుట్టి