బెల్లుపడలో యజ్ఞం ప్రారంభం
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:15 AM
పాంచాహ్నిక పంచకుండాత్మక శ్రీరామ తారక మహామంత్ర యజ్ఞం బెల్లుపడ గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది.
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): పాంచాహ్నిక పంచకుండాత్మక శ్రీరామ తారక మహామంత్ర యజ్ఞం బెల్లుపడ గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది. శని వారం ఉదయం నుంచి వేదపండితులు విష్వక్సేస పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురారోపణ, మృత్సంగ్రహణం, మండప ఆవాహనాలు చేశారు. అనంతరం అగ్నిప్రతిష్ఠ, హోమాలు జరిగాయి. యజ్ఞం సందర్భంగా గ్రామంలో ప్రత్యేకంగా తయారు చేసిన రాధాకృష్ణుడు, హనుమాన్, సీతారామలక్ష్మణ విగ్రహాల ను ఏర్పాటు చేశారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిని భక్తులు ఆసక్తితో తిలకిస్తున్నారు. రాధాకృష్ణ మందిరం వద్ద హరేరామ హరేకృష్ణ బృందంతో ప్రత్యేకంగా భజన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.