ఆదిత్యుని తాకిన సూర్యకిరణాలు
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:13 AM
ఆరోగ్యప్రదాత సూర్యనారాయణ స్వామివారిని భానుడి లేలేత కిరణాలు బుధవారం తాకాయి.
- పులకించిన భక్తజనం
- నేడు కూడా కిరణ స్పర్శ
అరసవల్లి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత సూర్యనారాయణ స్వామివారిని భానుడి లేలేత కిరణాలు బుధవారం తాకాయి. ఉదయం 6 గంటలకు కిరణాలు ఆలయ ముఖద్వారం గుండా పయనించి, అనివెట్టి మండపం మీదుగా నేరుగా గర్భాలయంలోని స్వామివారి పాదాలను స్పృశించాయి. క్రమంగా పాదాల నుంచి శిరోభాగం వరకు స్వామివారిని పూర్తిగా కిరణాలు తాకాయి. దీంతో ఆదిత్యుడు బంగారు వర్ణంలో మెరిసిపోయారు. ఈ సుందర దృశ్యాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఓం నమో భాస్కరాయనమః నామస్మరణతో ఆలయం మార్మోగింది. ప్రత్యేకంగా కిరణ స్పర్శను వీక్షించేందుకు దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని చూసి ఆనందపరవశులయ్యారు. గురువారం కూడా స్వామివారిని కిరణాలు తాకనున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ తెలిపారు.