వాయు‘గండం’ గడిచింది
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:54 PM
No affect the storm జిల్లావాసులకు వాయుగుండం ముప్పు తప్పింది. జిల్లా సరిహద్దులో వాయుగుండం మంగళవారం తీరం దాటనుందని, ఈ నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో అధికారులు రెడ్‌అలెర్ట్ ప్రకటించారు.
జిల్లాపై ప్రభావం చూపని తుఫాన్
ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రజలు
శ్రీకాకుళం/ ఇచ్ఛాపురం/ కవిటి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): జిల్లావాసులకు వాయుగుండం ముప్పు తప్పింది. జిల్లా సరిహద్దులో వాయుగుండం మంగళవారం తీరం దాటనుందని, ఈ నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో అధికారులు రెడ్‌అలెర్ట్ ప్రకటించారు. జిల్లా అధికారులు సోమవారం అర్ధరాత్రి వరకు వరుస సమీక్షలతోపాటు మండలాల వారీగా ప్రజలను అప్రమత్తం చేశారు. ఏవిధమైన నష్టం వాటిల్లకుండా ముందస్తుగా జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు కూడా ప్రకటించారు. తీరప్రాంతం పొడవునా.. అధికారులు సైతం మకాం వేశారు. కానీ.. మంగళవారం పరిస్థితి తారుమారైంది. వాయుగుండం.. ఏమాత్రం ప్రభావం చూపకుండా వెళ్లిపోయింది. దీంతో హమ్మయ్య.. గండం గడిచిపోయిందంటూ జిల్లాప్రజలు.. అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
పోటెత్తిన వరద
ఒడిశా నుంచి ఉప్పొంగి వరద నీరు జిల్లాలోని ప్రాజెక్టుల్లో చేరడంతో గొట్టా బ్యారేజీ, మడ్డువలస నుంచి అదనపు నీటిని బయటకు విడిచిపెట్టేశారు. దీంతో నాగావళి, వంశధార నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే బాహుదానదిలోకి భారీగా వరదనీరు చేరింది. ఒడిశాలోని బగలెట్టి డ్యాం గేట్లు ఎత్తివేయడంతో వరదనీరు పోటెత్తింది. బాహుదా నీటితో కళకళలాడుతోంది. నదిలో ఊటబావులు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఇటీవల ఎండల తీవ్రతకు బాహుదా ఎడారిలా మారడంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం జలకళతో తమకు తాగునీటి సమస్య తీరుతుందని భావిస్తున్నారు.
కోతకు గురైన తీరం
తుఫాన్ ప్రభావంతో జిల్లాలో గత మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిశాయి. మంగళవారం కవిటి మండలంలోని పుక్కళ్లపాలెం, జాలారిపాలెం వద్ద సముద్ర తీరం కోతకు గురైంది. కెరటాల ఉధృతితో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల ఎగసిపడుతుండడంతో మత్స్యకారులు భయాందోళన చెందారు.
నీట మునిగిన పంట పొలాలు..
జిల్లావ్యాప్తంగా పంట పొలాలు నీట మునిగే ఉన్నాయి. శ్రీకాకుళం, రణస్థలం, ఎచ్చెర్ల, నరసన్నపేట, పోలాకి, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, ఇచ్ఛాపురం, సంతబొమ్మాళి తదితర తీరప్రాంత మండలాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. పంటను కాపాడుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.
జిల్లాకు రూ.కోటి మంజూరు
జిల్లాలో వరద నివారణ చర్యలు.. ప్రభుత్వం తీసుకోవాల్సిన అత్యవసర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో.. ఆహారం సమకూర్చడం.. వైద్యం.. ఇలా ఇతరత్రా సహాయ సహకారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.
వర్షనష్టం అంచనాలు పూర్తి చేయండి : కలెక్టర్
జిల్లాలో భారీ వర్షాల వలన కలిగిన నష్టాల అంచనాలను పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, ఉప కలెక్టర్లు బి.పద్మావతి, జయదేవి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.