Share News

తొక్కిసలాట ఘటన యాదృచ్ఛికమే

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:21 AM

kasibugga Temple issue ‘కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన యాదృచ్ఛికంగానే జరిగింది. ఎవరూ కావాలని చేసింది కాదు. భక్తులు కొంచెం సంయమనం పాటించినా.. నిర్వాహకులు బారికేడ్లు నిర్మించి జాగ్రత్తలు తీసుకున్నా ఈ ఘటన జరిగి ఉండేది కాదు.’ అని దేవదాయశాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

తొక్కిసలాట ఘటన యాదృచ్ఛికమే
కాశీబుగ్గలో వేంకటేశ్వరాలయాన్ని పరిశీలిస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

  • మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

  • పలాస/రూరల్‌/కాశీబుగ్గ, నవంబరు2(ఆంధ్రజ్యోతి): ‘కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన యాదృచ్ఛికంగానే జరిగింది. ఎవరూ కావాలని చేసింది కాదు. భక్తులు కొంచెం సంయమనం పాటించినా.. నిర్వాహకులు బారికేడ్లు నిర్మించి జాగ్రత్తలు తీసుకున్నా ఈ ఘటన జరిగి ఉండేది కాదు.’ అని దేవదాయశాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మృతుల కుటుంబాలతో పాటు పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఎమ్మెల్యే గౌతు శిరీష నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొక్కిసలాటలో 8 మంది మహిళలు, ఒక బాలుడు మృతి చెందడం హృదయవిదారకరమని అన్నారు. ‘ముకుంద పండా మంచి ఉద్దేశంతోనే ఇక్కడ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. సొంత స్థలంలో సొంత నిధులతో ఆలయాన్ని కట్టారు. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇంజనీర్లు, దేవాలయ స్థపతుల సలహాలు తీసుకొని ఉంటే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదు. దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే మంత్రులు నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు, అనిత, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించాం. అవసరమైన వారికి సర్జరీలు చేయిస్తాం. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. 24 గంటల వ్యవధిలోనే మృతుల కుటంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.15లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరఫున రూ.2లక్షలు అందించాం. ప్రైవేటు ఆలయంలో జరిగిన ఘటనను రాజకీయం చేయడం దురదృష్టకరం. ముకుందపండా ఆలయ నిర్మాణంలో టీటీడీ స్థాయిలో ఏర్పాటు చేయాలనుకున్నారు. అది ఆగమశాస్త్ర ప్రకారం జరగలేదు. ఆయనకు తగు సూచనలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏది చేయాలో అది చేస్తాం. దేవదాయశాఖ కమిషనర్‌, ఇంజనీర్ల సహకారంతో ఆలయాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. దీనికి ముకుందపండా సహకరించాలి. ఇక నుంచి ప్రైవేటు ఆలయాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. దీనికోసం ప్రత్యేక వ్యవస్థను సైతం అందుబాటులోకి తెస్తాం. దీనిపై త్వరలోనే రాష్ట్రస్థాయిలో చర్యలు చేపడతాం. ప్రైవేట్‌ ఆలయాల వివరాలను తీసుకుంటాం. అడ్వయిజరీ కమిటీని నియమించి ఆలయాల నిర్మాణాలు, వాటి జాబితా తయారు చేస్తున్నాం. కలెక్టర్ల వద్ద వాటి వివరాలు ఉండే విధంగా పొందుపరుస్తాం. అవసరమైనప్పుడు బందోబస్తుకు అవకాశం ఉంటుంది. గత వైసీపీ పాలనలో ఆలయాలపై అనేక దాడులు జరిగాయి. వాటి వివరాలు కూడా ప్రస్తుతం లేవు.’ అని మంత్రి ఆనం తెలిపారు. ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ.. ఇంతటి పెను విషాదంలో కూడా వైసీపీ రాజకీయాలు చేయడం తగదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, విమర్శలు చేస్తున్న వారిని వారి విజ్ఞతకే వదిలేస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గౌతు శివాజీ, ఏపీ టీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, దేవదాయ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌, వై.వెంకన్నచౌదరి తదితరులు పాల్గొన్నారు.

  • త్రిసభ్య కమిటీ విచారణ

  • కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై విచారణకు టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, శ్రీకాకుళం ఏఎస్పీ కేవీ రమణ, దేవదాయశాఖ సహాయ కమిషనర్‌ ప్రసాద్‌తో కూడిన త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై కమిటీ విచారించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఈ మేరకు కమిటీ తొక్కిసలాట జరిగిన ఆలయాన్ని ఆదివారం పరిశీలించింది. భక్తుల మృతికి గల కారణాలను ప్రత్యక్షసాక్షులు, నిర్వాహకులను అడిగి తెలుసుకుంది. అంచనాకు మించి భక్తులు తరలిరావడం, ఆలయ ప్రాంగణంలో ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడం, లోపల జరుగుతున్న వ్యవహారం బయటకు తెలియకపోవడం, బారికేడ్లు లేకపోవడం, క్యూలైన్‌లో ఉన్న స్టీల్‌రైలింగ్‌ పటిష్టంగా లేకపోవడం, పోలీసు బందోబస్తు కూడా లేకపోవడం వంటి అంశాలను కమిటీ గుర్తించింది. రెండుమూడు రోజుల్లో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు కసరత్తు చేస్తుంది.

Updated Date - Nov 03 , 2025 | 12:21 AM