వెన్నెముకే ప్రధానం.
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:59 PM
మనిషి శరీరానికి వెన్నెముకే ప్రధానం. ఇది కేవలం శరీరాన్ని నిలబెట్టడమే కాకుండా నాడీ వ్యవస్థకు రక్షణ కల్పించి... ప్రతి కదలికకూ ఆధారం అవుతుంది.
- శరీరంలో అదే కీలకం
- నేడు ప్రపంచ వెన్నెముక దినోత్సవం
అరసవల్లి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మనిషి శరీరానికి వెన్నెముకే ప్రధానం. ఇది కేవలం శరీరాన్ని నిలబెట్టడమే కాకుండా నాడీ వ్యవస్థకు రక్షణ కల్పించి... ప్రతి కదలికకూ ఆధారం అవుతుంది. ప్రతి శ్వాసలో, అడుగులో వెన్నెముక పాత్ర ఉంటుంది. మన శరీరానికి పునాది లాంటిది వెన్నెముక. ఇది 33 ఎముకలతో కూడి ఉంటుంది. ఇది మెడ నుంచి తుంటి వరకూ విస్తరించి... నాడులను రక్షిస్తుంది. వంగడం, నిలబడడం, కూర్చోవడం, నడవడం ఇవన్నీ వెన్నెముక సమతౌల్యత వల్లనే సాధ్యమవుతాయి.
వెన్నెముక సమస్యలు ఇవే..
ప్రస్తుత యాంత్రిక జీవనశైలి. వ్యాయామం లేకపోవడం... ఎక్కువ సేపు కంప్యూటర్ల ముందు కూర్చొని... విధులు నిర్వహించడం వల్ల వెన్నెముక వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో రోజుకు 8 నుంచి 10 గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి... డిస్క్ సమస్యలు వస్తున్నాయి. మొబైల్, ల్యాప్‌టాప్‌లు చూస్తూ వంగి కూర్చోవడం... వెన్నెముకను బలపరిచే యోగాసనాలు, నడక వంటి శారీరక వ్యాయామం లేకపోవడం... అధిక బరువు, పోషకాహార లోపం వంటి కారణాలు వెన్నెముకపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
సమస్యలు ఇవే...
హెర్నియేటెడ్ డిస్క్‌లు
వెన్నుపూసల మధ్య కుషనింగ్ డిస్కులు ఉబ్బినప్పుడు, చీలిపోయినప్పుడు, వెన్నెముక నరాలపై ఒత్తిడి తెచ్చి తీవ్రమైన నొప్పి, తిమ్మిరిని కలిగిస్తాయి.
డీజనరేటివ్ డిస్క్ వ్యాధి
డిస్క్‌లు హైడ్రేషన్, ఫ్లెక్సిబులిటీ కోల్పోయినప్పుడు తరచుగా దీర్ఘకాలిక నొప్పికి దారి తీస్తుంది.
స్కోలియోసిస్
పిల్లల్లో వెన్నెముక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పార్శ్వ గూని అనేది వెన్నెముక వక్రత, అసౌకర్యం, భంగిమ వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా కౌమారదశలో ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తుంది.
స్పైనల్ స్టెనోసిస్
ఇది ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంది. వయస్సు సంబంధిత క్షీణత కారణంగా వెన్నెముక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి.
ఆస్టియోపోరోసిస్
ఎముకలను బలహీన పరిచే ఒక పరిస్థితి. దీని వల్ల అవి పగుళ్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. బోలు ఎముకల వ్యాధి వెన్నెముక పగుళ్లు, వెన్నుపాము గాయాలకు దారి తీయవచ్చును. ప్రధానంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు,
జిల్లాలో పరిస్థితి ఇలా...
జిల్లాలో వెన్నెముక సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగుల తాకిడి ఎక్కువ అవుతోంది. రోజుకు వందకు పైగా కేసులు వెన్నెముక సంబంధిత సమస్యలతో వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా యువతే వీటి బారిన ప డుతుండడం గమనార్హం. ఉద్యోగాల్లో ఎక్కువ సేపు కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయడం, సెల్‌ఫోన్ వినియోగం, బైకులపై అధిక దూరాలు ప్రయాణం చేయడం... మారుతున్న జీవన విధానం వల్ల వెన్నెముక సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
లక్షణాలు
వెన్ను లేదా మెడలో నిరంతర నొప్పి, ఒక చోట నిలబడలేకపోవడం, భుజాలు, చేతులు, లేదా కాళ్లు మొద్దుబారడం, వంగేటప్పుడు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.
ఆధునిక వైద్య చికిత్సలు ఇవే
ఫిజియోథెరపీ ద్వారా వెన్నెముక కండరాలను బలపరచవచ్చును. అలాగే వెన్నుపూసలు దెబ్బతిన్నప్పుడు వైద్య నిపుణులతో పెద్ద కోతలు లేకుండా లేజర్ లేదా మైక్రో సర్జరీలతో చికిత్స చేస్తారు. పెయిన్ మేనేజ్‌మెంట్ థెరపీ, ఆయుర్వేదం, యోగా వంటి చికిత్సలు ఫలప్రదంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
రిమ్స్‌లో ప్రత్యేక శస్త్ర చికిత్సలు
రిమ్స్‌లో ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అత్యంత అధునాతన ప్లాస్మా రిచ్ ప్రెసిసిటెంట్ (పీఆర్పీ) చికిత్సను కూడా ఉచితంగా చేస్తున్నాం. దీంతో తక్షణ నివారణ, ఉపశమనం కలుగుతుంది. వెన్నుపూసకు సంబంధించి డిస్కెక్టమీ, స్పైనల్ స్టెబిలైజేషన్ సర్జరీలు కూడా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం పరికరాలు సమకూరిస్తే ఎండోస్కోపిక్ సర్జరీలు కూడా ఇక్కడే నిర్వహించగలుగుతాం. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలి.
-డాక్టర్ ఎం.పార్థసారథి, ప్రొఫెసర్ ఇన్ ఆర్థోపెడిక్స్