Share News

హోంగార్డుల సేవలు కీలకం

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:00 AM

Home Guards Day జిల్లా పోలీసుశాఖలో హోంగార్డుల సేవలు కీలకమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రసంశించారు. శనివారం శ్రీకాకుళం మండలం తండేంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం మైదానంలో ఘనంగా 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.

హోంగార్డుల సేవలు కీలకం
శ్రీకాకుళం రూరల్‌6 .పరేడ్‌ కమాండర్‌కి బహుమతి ప్రదానం చేస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం రూరల్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసుశాఖలో హోంగార్డుల సేవలు కీలకమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రసంశించారు. శనివారం శ్రీకాకుళం మండలం తండేంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం మైదానంలో ఘనంగా 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీకి హోంగార్డులు గౌరవ వందనం సమర్పించారు. కమాండర్‌ హోంగార్డు శశిభూషణ్‌ ఆఽధ్వర్యంలో నిర్వహించిన రైజింగ్‌ పరేడ్‌ను ఎస్పీ పరిశీలించారు. శాంతిచిహ్నంగా బెలూన్లు, పావురాలను ఎగురవేశారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ... ‘1962లో కొద్దిమందితో స్వచ్ఛందంగా ఏర్పడిన హోంగార్డు ఆర్గనైజేషన్‌ సేవలు క్రమేపీ పెరిగాయి. ప్రస్తుతం జిల్లాలో 699 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులతో సమానంగా సేవలు అందిస్తున్న హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వేతనాలను పెంచే ఆలోచనలో ఉంది. ఆరోగ్య, ప్రమాద బీమా సదుపాయాలకు కార్యాచరణ సిద్ధం చేశాం. ప్రతి నెల ఇచ్చే రెండు రోజుల విశ్రాంతి సెలవులతోపాటు అత్యవసర పరిస్థితుల్లో సెలవులు పొందే అవకాశం కూడా కల్పించామ’ని తెలిపారు. సమస్యలు ఉంటే తమను సంప్రదిస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరేడ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పరేడ్‌ కమాండర్‌, ప్లాటూన్‌ కమాండర్‌, సిబ్బందికి మెడల్స్‌ను బహుకరించారు. పదవీ విరమణ పొందిన హోంగార్డు రమణమూర్తికి.. (జిల్లాలో హోంగార్డుల ఒక రోజు గౌరవ వేతనాన్ని) రూ.4.18 లక్షలు ఆర్థిక సహాయాన్ని ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద, ఏఓ సీహెచ్‌ గోపీనాథ్‌, సీఐలు ఇమ్మాన్యుయేల్‌ రాజు, పైడిపునాయుడు, ఈశ్వరరావు, అవతారం, సూర్యచంద్రమౌళి, సన్యాసినాయుడు, సత్యనారాయణ, ఆర్‌ఐలు నర్శింగరావు, కృష్ణప్రసాద్‌, ఆర్‌ఎస్‌ఐలు, రూరల్‌ ఎస్‌ఐ కె.రాము, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 12:00 AM