Share News

నౌపడ ఉప్పు కనుమరుగు

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:06 AM

ఒకప్పుడు ఉప్పు గల్లీగా ఎంతో ప్రసిద్ధి చెందిన నౌపడ ఉప్పు పరిశ్రమ ఇప్పుడు అంతరించిపోయే దశకు చేరుకుంది.

నౌపడ ఉప్పు కనుమరుగు
నౌపడలో సాగువుతున్న ఉప్పు పంట (ఫైల్‌)

- ప్రాభవం కోల్పోతున్న పరిశ్రమ

- భూముల లీజును పునరుద్ధరించని కేంద్రం

- ఏడేళ్లుగా సాగుకు దూరమైన రైతులు

సంతబొమ్మాళి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు ఉప్పు గల్లీగా ఎంతో ప్రసిద్ధి చెందిన నౌపడ ఉప్పు పరిశ్రమ ఇప్పుడు అంతరించిపోయే దశకు చేరుకుంది. ఉప్పు భూముల లీజును కేంద్రం రెన్యువల్‌ చేయకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఫలితంగా దిగుబడి లక్షల టన్నుల నుంచి వేలకు పడిపోయింది. మండలంలోని నౌపడ, పాలనాయుడుపేట, సీతానగరం, మూలపేట, మర్రిపాడు, భావనపాడు, సెలగపేట, ఆర్‌.సున్నాపల్లి, యామలపేట తదితర గ్రామాల్లో సుమారు ఆరు వేల ఎకరాల్లో ఉప్పు పంట గతంలో సాగయ్యేది. ఈ ప్రాంతంలోని ఉప్పు భూములు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతో వాటిని సన్నకారు రైతులు లీజుకు తీసుకుని ఉప్పును సాగుచేసేవారు. ఈ లీజు 2018తో ముగిసిపోయింది. లీజును పునరుద్ధరించమని పలుమార్లు ఈ ప్రాంత రైతులు కేంద్ర ప్రభుత్వ అధికారులకు వినతులు అందించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, రైతుల కోరిక మేరకు భూముల లీజుకు సంబంధించి 2020లో కేంద్రం సబ్‌ కమిటీ వేసింది. ఈ కమిటీ ఈ ప్రాంత ఉప్పు భూములను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అయినా నేటి వరకు లీజును అధికారులు పునరుద్ధరించలేదు. ప్రస్తుతం రెండు ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో కేవలం 2వేల ఎకరాల్లో మాత్రమే మండలంలో ఉప్పుపంట సాగవుతుంది. గతంలో ఉప్పు పంట పండిస్తూ జీవనం సాగించిన కుటుంబాలు కొంత మంది ఈ ప్రైవేటు కంపెనీల్లో కూలీలుగా చేరగా, మరికొంత మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టారు.

గతమెంతో ఘనం

నౌపడ ఉప్పు పరిశ్రమ.. ఒకప్పుడు ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో, దేశంలో రెండో స్థానంలో ఉండేది. రైతులు ప్రతి ఏటా డిసెంబరులో ఉప్పు సాగును ప్రారంభించి జూలై మొదటి వారం వరకూ కొనసాగించేవారు. ప్రతి నలభై రోజులకు ఒకసారి దిగుబడి వచ్చేది. ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఎంతో సందడిగా ఉండేది. ఇక్కడి నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా ఒడిశా, రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు ఉప్పు రవాణా జరిగేది. రైల్వే ద్వారా రవాణా జరగడం.. ఖర్చులు కూడా తక్కువగా ఉండడంతో అప్పట్లో రైతులకు ఉప్పు సాగు లాభదాయంగా ఉండేది. అయితే, ఈ ప్రాంతంలో రైల్వే లైన్‌ను తొలగించడంతో నౌపడ ఉప్పు రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. రోడ్డు మార్గం ద్వారా ఉప్పును రవాణా చేయడంతో ఖర్చులు పెరిగాయి. అయినా రైతులు సాగుకు ముందుకు వస్తున్నా భూముల లీజును కేంద్రం రెన్యువల్‌ చేయకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల ఉప్పు పరిశ్రమ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.

లీజును పునరుద్ధరించాలి

ఉప్పు భూముల లీజును కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలి. అప్పుడే ఈ ప్రాంతంలో ఉప్పు పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుంది. 2018లో లీజు పూర్తయింది. రెన్యువల్‌ కోసం రైతులు చేసిన విజ్ఞప్తుల మేరకు 2020లో కేంద్రం సబ్‌ కమిటీ వేసినా ఇంత వరకు ఎటువంటి చర్యలు లేవు. నౌపడ ఉప్పు పరిశ్రమ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

-పిలక రవికుమార్‌రెడ్డి, కార్యదర్శి, సన్నకార ఉప్పు ఉత్పత్తికారుల సంఘం, నౌపడ

Updated Date - Dec 11 , 2025 | 12:06 AM