లక్ష్యాల సాధనలో బ్యాంకర్ల పాత్ర కీలకం
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:05 AM
bankers is crucial in achieving goals వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో బ్యాంకర్ల పాత్ర కీలకమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ శాఖలు, బ్యాంకుల మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసే జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.
జిల్లా అభివృద్ధికి సహకరించాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో బ్యాంకర్ల పాత్ర కీలకమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ శాఖలు, బ్యాంకుల మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసే జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలు త్వరితగతిన అందించి వరి కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. సూర్యాఘర్ పథకాన్ని ప్రోత్సహించాలి. రైతులకు ఇచ్చే డ్రోన్ల సంఖ్యను పెంచాలి. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు అందజేయాలి. జిల్లా స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకర్లు సహకరించాలి. స్వయం సహాయక సభ్యులకు వ్యాపార రుణాలు ఇచ్చి, వారి ఆదాయం పెంచేలా ప్రోత్సహించాలి. ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వరంగ బ్యాంకులతో సమానంగా రుణాలు మంజూరు చేయాల’ని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు, డీసీసీ కన్వీనర్ పైడి రాజా, నాబార్డు డీడీఎం రమేష్‌కృష్ణ, ఆర్బీఐ అధికారి నవీన్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
కొత్త కలెక్టరేట్‌లో 84 ప్రభుత్వ శాఖలకు గదులు
కొత్తగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో 84 ప్రభుత్వ శాఖలకు గదులు కేటాయింపు ప్రక్రియ కొలిక్కి వచ్చిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి 84 ప్రభుత్వ శాఖలకు గదుల కేటాయింపుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘పాత కార్యాలయాల నుంచి పనికిరాని ఎలక్ర్టానిక్ వ్యర్థాలను తీసుకురావడానికి వీల్లేదు. వాటిని ప్రభుత్వ అనుమతితో వేలం వేయాల’ని తెలిపారు. గ్రౌండ్‌ఫ్లోర్ నుంచి మూడో అంతస్తు వరకు ఏయే శాఖలకు ఏ గదులు కేటాయించారో తగు సూచనలు చేశారు. కొత్త భవనంలోకి మారే ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా సాగేందుకు ప్రతి శాఖ సహకరించాలని తెలిపారు. కొత్త కార్యాలయాలకు సంబంధించి కరెంట్ బిల్లులు ఆయా శాఖలే భరించాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.