తాగునీటి సరఫరా బాధ్యత అధికారులదే
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:16 AM
గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు.
- పారిశుధ్యం మెరుగుపర్చాలి
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
-కవిటి పంచాయతీరాజ్ ఏఈకి చార్జిమోమో
కవిటి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కవిటి మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి ఇచ్ఛాపురం నియోజకవర్గ స్థాయి అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉద్దానం, ఆర్‌డబ్ల్యూఎస్ పథకాలను మెగా కంపెనీలో విలీనం చేసిన తర్వాత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఎమ్మెల్యే అశోక్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతీ సెక్షన్‌కు ఒక్కో అధికారి అజమాయిషీగా ఉండడంతో పాటు వారిమధ్య సమన్వయం లేకపోవడం ఇబ్బందికరంగా మారిందన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. రెండువారాల్లో నీటిసరఫరా మెరుగుపడాలని, లేదంటే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. సమీక్షకు కవిటి పంచాయతీరాజ్ ఏఈ ప్రవీణ్ హాజరుకాకపోవడంతో ఆయనకు చార్జిమెమో జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని మండలాల్లో పారిశుధ్యం మెరుగుపడాల్సి ఉందన్నారు. నెలలో రెండువారాలు పారిశుధ్యం మెరుగుపర్చితే చాలు ఎంతో మార్పు కనిపిస్తుందన్నారు. చెత్తసంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని, అలా చేయకుంటే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కవిటి మండలంలో రీసర్వే తర్వాత జిరాయితీ భూములు ప్రభుత్వ ఖాతాల్లో చూపిస్తున్నాయని, జాయింట్ ఎల్‌పీ నెంబర్లు వచ్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి పలువురు తీసుకువెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఇచ్ఛాపురం మండలం మండపల్లి పంచాయతీలో అధికారులకు చెక్‌పవర్ ఇస్తే సర్పంచ్‌తో కలసి అక్రమంగా నిధులు డ్రాచేయటంపై సమగ్ర నివేదికను అందించాలని డీపీవో భారతీ సౌజన్యను ఆదేశించారు. ఈ సమీక్షలో డ్వామా పీడీ సుధాకర్, పలాస ఆర్డీవో జి.వెంకటేష్,ఈఈ శంకర్‌బాబు, డీఈఈలు గోపాలకృష్ణ,ఆశాలత, సూర్యప్రకాష్, ఎంపీడీవో ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయరంగానికి జీఎస్టీ ఊతం
ప్రభుత్వం జీఎస్టీ ధరలను తగ్గించడంతో వ్యవసాయరంగానికి ఊతంలభించిందని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కవిటిలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బి.అశోక్, రైతులతో కలసి ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇచ్ఛాపురం రైతుసంఘానికి డ్రోన్‌ను అందించారు. అంతకు ముందు బల్లిపుట్టుగలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ గ్రామంలో రేషన్ దుకాణాన్ని ప్రారంభించారు.