అసలు నిందితులు చిక్కట్లే!
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:01 AM
జిల్లాలోని ఇచ్ఛాపురం, కంచిలి, మందస, పలాస, టెక్కలి, పాతపట్నం పోలీసు స్టేషన్ల పరిధిలో గత మూడు నెలల్లో పదుల సంఖ్యలో గంజాయి రవాణాదారులను పోలీసులు అరెస్టు చేశారు.
- పోలీసులకు పట్టుబడుతుంది కేవలం గంజాయి రవాణాదారులే
- వ్యాపారులు, బ్రోకర్లు, సాగుదారులు దొరకట్లే
- నిరంతరం నిఘాతోనే రవాణాకు అడ్డుకట్ట
పలాస, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి):
- ఈ ఏడాది మే 15న సుజిత్ సూర్జియా అనే వ్యక్తి గంజాయి ప్యాకెట్లతో పోలీసులకు పట్టుబడ్డాడు. సుజిత్ గుణుపూర్-బరంపురం బస్సు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై కుటుంబాన్ని పెంచడానికి ఆదాయం సరిపడకపోవడంతో గంజాయి స్మగ్లరుగా అవతారం ఎత్తాడు. ఈ క్రమంలో పర్లాకిమిడి (ఒడిశా)కు చెందిన పుస్కో పొరిచా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. 14 కిలోల గంజాయి ప్యాకెట్లను మహారాష్ట్ర పూణేలో ఉన్న జ్యోతి చవాస్ అనే వ్యక్తికి అప్పగిస్తే రూ.20వేలు ఇస్తానని సుజిత్‌కు పుస్కో పొరిచా చెప్పాడు. దీంతో గంజాయి బ్యాగును పలాస రైల్వే స్టేషన్‌కు తరలిస్తుండగా సుజిత్ పోలీసులకు పట్టుబడి జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఈయన కేవలం రవాణాదారుడు మాత్రమే. అసలు నిందితులు మాత్రం పట్టుబడలేదు.
- గత నెల 15న కాశీబుగ్గ పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు మహిళలతో సహా మొత్తం నలుగురు గ్యాంగ్ పోలీసులకు పట్టుబడింది. 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని వారిని జైలుకు పంపించారు పోలీసులు. వీరంతా కేవలం కిలోకు రూ.5వేలకు ఒప్పందం కుదుర్చుకొని గంజాయిని రవాణా చేస్తున్నవారే. బిహార్ రాష్ట్రానికి చెందిన వీరంతా ఒడిశాలోని గంజాయి తయారీదారుల నుంచి సరుకును కొనుగోలు చేసి, దాన్ని బ్రోకర్లకు అప్పగించే ప్రయత్నంలో పట్టుబడ్డారు.
- పలాస, టెక్కలి సబ్‌డివిజన్ పోలీసుశాఖ పరిధిలో గత మూడు నెలల్లో పదుల సంఖ్యలో గంజాయి కేసులు నమోదయ్యాయి. టన్నుకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటి వరకూ 50 మంది వరకూ నిందితులను అరెస్టు చేశారు. నిరంతరం నిఘాతోనే ఇది సాధ్యమైందని పోలీసులు చెబుతున్నారు. అయితే, కేవలం గంజాయి రవాణాదారులను మాత్రమే పోలీసులు పట్టుకొని జైలుకు పంపిస్తున్నారు తప్ప దీనికి మూలకారకులను ఇప్పటి వరకూ ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఛేదిస్తే మొత్తం గంజాయి రవాణాకు చెక్ పెట్టవచ్చని సాక్ష్యాత్తు పోలీసు అధికారులే చెబుతుండడం విశేషం.
జిల్లాలోని ఇచ్ఛాపురం, కంచిలి, మందస, పలాస, టెక్కలి, పాతపట్నం పోలీసు స్టేషన్ల పరిధిలో గత మూడు నెలల్లో పదుల సంఖ్యలో గంజాయి రవాణాదారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఒడిశా, బిహార్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వారే. వీరంతా ఒడిశాలోని రాయఘడ బ్లాక్, మోహనసమితి, ఆర్ ఉదయగిరి ప్రాంతాల్లో విస్తృతంగా పండించే గంజాయిని వివిధ మార్గాల ద్వారా రవాణా చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కిలో రూ.5వేలుకు కొనుగోలు చేసి నిర్దేశించిన ప్రాంతాలకు తరలిస్తుంటారు. కిలోకు సరుకు నాణ్యతబట్టి రూ.5వేలు నుంచి రూ.10వేలు వరకూ వారికి వ్యాపారులు ముట్టచెబుతారు. వ్యాపారులు మాత్రం కిలో రూ.40వేల వరకూ అమ్ముతుంటారని పోలీసులకు పట్టుబడిన వారు చెబుతున్నారు. గంజాయి వ్యాపారులు కొందరి గిరిజనులతో గంజాయిని సాగు చేయించి వారికి రెండింతల డబ్బులు ఇస్తుంటారు. వరికి బదులు పూలమొక్కల చాటున గంజాయి పండిస్తూ లాభాలు అర్జిస్తున్నారు. బ్రోకర్ల వ్యవహారం, వారి వివరాలు పోలీసులకు లభ్యమైనా గిరిజన గ్రామాల్లో వారిని పట్టుకోవడం కష్టసాధ్యమవుతుంది. ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల పోలీసులు, ప్రభుత్వాలు సంయుక్తంగా దాడులు చేస్తే తప్ప అసలు నిందితులు, పండించే రైతులు దొరకడం కష్టమే. కొద్ది రోజుల కిందట గంజాయి రవాణా ముఠా జిల్లా పోలీసులకు దొరికింది. ఆ ముఠా ద్వారా ఆర్.ఉదయగిరి ప్రాంతాల్లో గంజాయి పండించే రైతులు, బ్రోకర్ల వివరాలు లభ్యమయ్యాయి. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు వారి చిరునామా తప్ప ఒక్కరు కూడా దొరకలేదు. వారం రోజుల పాటు ఆ ప్రాంతంలో నిఘా పెట్టినా వారి ఆచూకీ లభ్యంకాలేదు. దీంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. సరిహద్దు ప్రాంతాలైన పాతపట్నం, మెళియాపుట్టి, మందస, ఇచ్ఛాపురం, కంచిలి మండలాలతో పాటు ఒడిశా సరిహద్దుల వెంట భారీగా పోలీసులను మోహరించడంతో పాటు అనుమానం వచ్చిన ప్రతీబ్యాగును తనిఖీ చేస్తే కొంతవరకు గంజాయి రవాణాను అరికట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, అందుకు అవసరమైన పోలీసు సిబ్బంది లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనికోసం సచివాలయ పోలీసు వ్యవస్థను వినియోగిస్తే కొంతవరకు ఫలితాలు ఉండవచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
గంజాయిపై ఉక్కుపాదం
గంజాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి రవాణా చేసినా, అమ్మినా తీవ్రమైన నేరంగా పరిగణిస్తాం. వీటితో పట్టుబడితే కనీసం పదేళ్ల జైలు, రూ.2 లక్షల అపరాధ రుసుం విధించడం జరుగుతుంది. గంజాయి రవాణా చేసి విలువైన జీవితాన్ని పాడుచేసుకోవద్దు. గంజాయి స్మగ్లర్లకు జైలు శిక్షతో పాటు వారి ఆస్తులు కూడా జప్తు చేస్తాం.
-పి.సూర్యనారాయణ, సీఐ, కాశీబుగ్గ.. 8పీఎల్‌ఎస్‌పి2