సముద్రంలో తెప్ప బోల్తా
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:09 AM
సముద్రంలో తెప్పబోల్తాపడిన ప్రమాదంలో ఓ మత్స్యకారుడు మృతి చెందగా, మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.
- మత్స్యకారుడి మృతి.. మరో ఇద్దరు క్షేమం
- గుప్పెడుపేట తీరంలో ఘటన
పోలాకి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): సముద్రంలో తెప్పబోల్తాపడిన ప్రమాదంలో ఓ మత్స్యకారుడు మృతి చెందగా, మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన గుప్పెడుపేట తీరంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గుప్పెడుపేటకు చెందిన మత్స్యకారులు చెక్క రాజారావు (45), చెక్క హరయ్య, తులే సింహాచలం మంగళవారం ఉదయం తెప్పపై సముద్రంలోకి వేటకు వెళ్లారు. కొంత సేపటికే తెప్పబోల్తాపడి మునిగిపోయింది. దీంతో రాజారావు గల్లంతు కాగా మిగతా ఇద్దరు ఈదుకుంటూ తీరానికి చేరుకున్నారు. కొద్దిసేపటి తరువాత రాజారావు మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. రాజారావుకు భార్య చెల్లెమ్మ, కుమార్తె సుష్మిత, కుమారులు గోవింద, చరణ్ ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట ఆస్పత్రికి తరలించారు. భార్య చెల్లెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జి.రంజిత్ తెలిపారు.