పెద్దమడి గురుకులంలో సమస్యల తిష్ఠ
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:19 AM
పెద్దమడి గిరిజన బాలుర గురుకుల కళాశాలలో సమస్యలు తిష్ఠ వేశాయి.
- చాలీచాలనీ వసతితో విద్యార్థుల అవస్థలు
- తరగతి గదుల్లోనే చదువు, నిద్ర
- కానరాని ఆర్వోప్లాంట్
- బోధనా సిబ్బంది కొరత
మెళియాపుట్టి, అక్టోబరు22 (ఆంధ్రజ్యోతి): పెద్దమడి గిరిజన బాలుర గురుకుల కళాశాలలో సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ విద్యార్థులకు సరిపడ గదులు లేవు. ఉన్న గదులకు గచ్చులు లేవు. విద్యార్థుల చదువు, నిద్రపోవడం, వంట అన్నీఒకే చోటనే. ఆర్వో ప్లాంట్ లేక బోరు నీటినే వారు తాగుతున్నారు. బోధన సిబ్బంది కొరత ఉంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఈ గురుకుల కళాశాలను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంపైనే విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో సుమారు 30 ఏళ్ల కిందట పెద్దమడి గ్రామంలో పది ఎకరాల్లో గురుకుల పాఠశాల/కళాళాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆరు తరగతి గదులు ఉన్నాయి. రెండు డార్మెటరీ గదులు ఉన్నాయి. ఈ కళాశాలలో 185 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, గతంలో ఉన్న కళాశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు రూ.80 లక్షలు మంజూరు చేసి కొత్త భవనం నిర్మించింది. గచ్చులు, చెక్కసున్నాలు (ప్లాసింగ్) చేయాల్సిన సమయంలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఆ పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి గచ్చులు లేని తరగతి గదుల్లోనే విద్యార్థులకు అధ్యాపకులు పాఠాలు చెబుతున్నారు. విద్యార్థులు పడుకోవడానికి రెండు గదులే ఉండడంతో అవి సరిపోవడం లేదు. ఒకే గదిలో వంద మంది వరకు నిద్రపోతున్నారు. తామంతా దగ్గరగా పడుకోవడం వల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.
బోరు నీరే దిక్కు..
గురుకుల కళాశాలలో ఆర్వో ప్లాంట్ లేకపోవడంతో విద్యార్థులు బోరు నీటినే తాగుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందేమోనని విద్యార్థులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వర్షాల సమయంలో బురద నీరు వస్తున్నా తాగక తప్పడం లేదని అంటున్నారు. ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎన్ని సార్లు అధికారులకు వినతులు అందించినా ప్రయోజం లేదని వాపోతున్నారు. రెగ్యులర్ బోధనా సిబ్బంది ఇద్దరే ఉండడంతో చదువులు ముందుకు సాగడం లేదు. సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది క్వార్టర్స్ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో వాటిని వినియోగించకుండా వదిలేశారు. కొత్తవి నిర్మించాలని గురుకుల సొసైటీకి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. నివాస సౌకర్యం లేక గురుకుల కళాశాలకు రావడానికి సిబ్బంది వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి పెద్దమడి గిరిజన బాలుర గురుకుల కళాశాలలోని సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.
తరగతి గదుల్లోనే పడుకుంటున్నాం
మేము పడుకోవడానికి భవనాలు లేక తరగతి గదుల్లోనే నిద్రపోతున్నాం. తరగతి గదులకు చెక్క సున్నాలు చేయలేదు. కొన్ని సార్లు బెంచీలపై పడుకుంటున్నాం. నిద్ర సరిగా పట్టడం లేదు. పాఠాలు వినడానికి కూడా శ్రద్ధ కలగడం లేదు.
-ఎస్.కిరణ్, ఎంపీసీ సెకండియర్, పెద్దమడి గురుకులం
మంచి నీరు లేదు
ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలోని గురుకుల పాఠశాలలో కలుషిత తాగునీరు తాగడంతో విద్యార్థులకు పచ్చకామెర్లు సోకినట్లు తెలిసి మాకు భయం వేస్తుంది. మేము బోరు నీటినే తాగుతున్నాం. ఆర్వో ప్లాంట్ లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆర్వో ప్లాంట్‌ను మంజూరు చేస్తే బాగున్ను.
-జె.అజయ్, ఎంపీసీ సెకండియర్, పెద్దమడి గురుకులం
అధికారులకు చెబుతున్నా ప్రయోజనం లేదు
విద్యార్థుల సమస్యలను ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకువెళుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు. గచ్చులు లేని తరగతి గదుల్లో బోధన జరుగుతుంది. రెగ్యులర్ బోధనా సిబ్బంది లేరు. వారు ఉండడానికి వసతి లేకపోవడంతో ఇక్కడకు ఎవరూ రావడం లేదు.
-లక్ష్మణ్‌నాయుడు, ప్రిన్సిపాల్, గురుకుల కళాశాల, పెద్దమడి