Disabled problems : దివ్యాంగుల దీనగాఽథ
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:33 AM
Problems in the review of Sadaram certificates వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ ధ్రువపత్రాలతో చాలామంది అనర్హులు దివ్యాంగ పింఛన్లు పొందారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రక్షాళన దిశగా చర్యలు చేపడుతోంది. ‘సదరం’లో భాగంగా దివ్యాంగుల ధ్రువపత్రాలు పునఃపరిశీలన చేయాలని అధికారులను ఇటీవల ఆదేశించింది.
సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలనలో అవస్థలు
సరైన ఏర్పాట్లు చేయని అధికారులు
రిమ్స్‌లో సాంకేతిక సమస్యతో గంటలకొద్దీ నిరీక్షణ
. నందిగాం మండలం శివరాంపురం పంచాయతీ భరణిగాం గ్రామానికి చెందిన మళ్ల గిరిబాబు శతశాతం దివ్యాంగత్వంతో మంచానికే పరిమితమయ్యారు. అయితే సంబంధిత సచివాలయ సిబ్బంది నెలవారీ దివ్యాంగ పింఛన్ పొందాలంటే సదరం సర్టిఫికెట్ రీ-వెరిఫికేషన్‌కు వెళ్లాలని ఇటీవల నోటీసు ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు గిరిబాబును గురువారం టెక్కలిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకువచ్చి వ్యయప్రయాసకు గురయ్యారు. కాగా ఇటీవల ప్రజాదర్బార్‌లో మంత్రి అచ్చెన్నాయుడు వద్దకు కూడా గిరిబాబును కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. శతశాతం దివ్యాంగం కలిగిన ఆయనకు నెలవారీ ఇస్తున్న పింఛన్ పెంచాలని కోరారు.
..................
నందిగాం మండలం కర్లపూడి గ్రామానికి చెందిన దివ్యాంగుడు కొంచాడ తేజేశ్వరరావు ఆర్థో, న్యూరో సమస్యలతో మంచం పట్టాడు. సచివాలయ సిబ్బంది సదరం సర్టిఫికెట్లు రీ-వెరిఫికేషన్ చేయించాలని చెప్పారు. దీంతో ఎన్నో కష్టాలు పడి కుటుంబ సభ్యుల సహకారంతో గురువారం టెక్కలిలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకున్నాడు.
................
‘సదరం’ సర్టిఫికెట్ల పునఃపరిశీలనతో దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. శతశాతం దివ్యాంగం ఉన్నవారిని సైతం సర్టిఫికెట్ల పునఃపరిశీలన చేయించాలని ఇటీవల సచివాలయ సిబ్బంది నోటీసులివ్వడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గురువారం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్-రిమ్స్), టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రి, పలాసలోని ప్రభుత్వాసుపత్రికి పలువురు దివ్యాంగులు ఆపసోపాలు పడి చేరుకున్నారు. పునఃపరిశీలన కోసం గంటల తరబడి నిరీక్షించి ఇబ్బందులు పడ్డారు. తమపై అధికారులకు మానవత్వం లేదా అని ప్రశ్నిస్తున్నారు. వైద్యబృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి.. సర్టిఫికెట్లను పునఃపరిశీలన చేయాలని కోరుతున్నారు.
...................
శ్రీకాకుళం రిమ్స్/ టెక్కలి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ ధ్రువపత్రాలతో చాలామంది అనర్హులు దివ్యాంగ పింఛన్లు పొందారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రక్షాళన దిశగా చర్యలు చేపడుతోంది. ‘సదరం’లో భాగంగా దివ్యాంగుల ధ్రువపత్రాలు పునఃపరిశీలన చేయాలని అధికారులను ఇటీవల ఆదేశించింది. మరోవైపు పింఛన్‌దారులకు కూడా సచివాలయ సిబ్బంది ద్వారా నోటీసులు అందజేసింది. ఈ మేరకు గురువారం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్-రిమ్స్), టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిలో దివ్యాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలన చేపట్టింది. కాగా.. రిమ్స్‌కు ధ్రువపత్రాల పునఃపరిశీలనకు వచ్చిన దివ్యాంగులకు అవస్థలు తప్పలేదు. జిల్లా నలుమూలల నుంచి చాలామంది దివ్యాంగులు గురువారం ఉదయం రిమ్స్‌కు చేరుకున్నారు. కానీ వారు కూర్చునేందుకు అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దివ్యాంగ వృద్ధులు ఊతకర్ర సాయంతో క్యూలో నిల్చొన్నారు. ఆసుపత్రి అధికారులు కానీ, సంబంధింత డీఆర్డీఏ శాఖ సిబ్బంది కానీ పట్టించుకోలేదు. నిజానికి రిమ్స్‌లో బుధ, గురు, శుక్రవారాల్లో రోజుకి 400 మంది చొప్పున పునఃపరిశీలన జరుగుతోంది. గతంలో జరిగిన అవకతవకల నేపథ్యంలో వైద్యులు కూడా విశాఖపట్నం, టెక్కలి, పాలకొండ, నరసన్నపేట వేరే ప్రాంతాల నుంచి వచ్చి ధ్రువపత్రాలను జారీ చేస్తున్నారు. ఈ నిజనిర్థారణ ప్రక్రియలో నలుగురు ఎముకల వైద్య నిపుణులు, ఒక ఈఎన్‌టీ నిపుణుడు, ఒక మానసిక వ్యాధి నిపుణుడు అలాగే ఒక కళ్ల వ్యాధుల నిపుణుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే గురువారం రిమ్స్‌లో నెట్‌వర్క్ సరిగా పనిచేయకపోవడం(సాంకేతిక సమస్య), తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా తనిఖీ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. ఉదయం 9-30 నుంచి సాయంత్రం 4-30 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. దీంతో దివ్యాంగులు క్రిందనే కూర్చుని, చతికిలపడిపోయారు. ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో చాలామంది ఆకలితోనే వేచి చూశారు. ఇకనుంచైనా అధికారులు తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు. వైద్యాధికారులైనా క్షేత్రస్థాయిలో పర్యటించి.. శతశాతం దివ్యాంగుల ఇళ్ల వద్దే సర్టిఫికెట్లను పునః పరిశీలించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
టెక్కలి జిల్లా కేందాసుప్రతిలోని ఇదే పరిస్థితి ఎదురైంది. పలువురు దివ్యాంగులు గంటల తరబడి నిరీక్షించి అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల టెక్కలి సబ్‌కలెక్టర్ కార్యాలయానికి పలువురు దివ్యాంగులు వెళ్లారు. తామంతా పింఛన్లకు అర్హత ఉన్నా నోటీసులు అందుతున్నాయని, తమకు న్యాయం చేయాలని ఆర్డీవో కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు. అలాగే ఈనెల 25న శ్రీకాకుళం జడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్న ‘మీ-కోసం’ కార్యక్రమంలో కూడా కలెక్టర్‌కు తమ మొర వినిపించేందుకు దివ్యాంగులంతా తరలిరావాలని ఆ సంఘం అధ్యక్షుడు ఆవుల వేణుగోపాలరావు పిలుపునిచ్చారు.
స్లాట్ సమయమిచ్చి.. కానరాని వైద్యాధికారులు
పలాస, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో పలువురు దివ్యాంగులకు పింఛన్లు రద్దయ్యాయి. మళ్లీ కొత్తగా సదరం సర్టిఫికెట్లు పొందేందుకు గురువారం స్లాట్ ద్వారా పునఃపరిశీలన కోసం సమయం కేటాయించారు. ఈ మేరకు 20 మందికిపైగా దివ్యాంగులు అతి కష్టంపై పలాస ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. సదరం కేంద్రం వద్ద గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ వైద్యాధికారుల కోసం నిరీక్షించారు. కానీ వారికి ఎవరి నుంచి సమాధానం దొరకలేదు. చివరకు సంబంధిత వైద్యాధికారులకు వేరే ఆసుపత్రి విధులు కేటాయించారని, మళ్లీ ఎప్పుడు సదరం సర్టిఫికెట్లు ఇస్తారో చెబుతామని సిబ్బంది చెప్పడంతో వారంతా తీవ్ర నిరాశ చెందారు. తమకు పింఛన్ అందుతుందో లేదోనని ఆవేదన చెందుతున్నారు. సదరంలో నమోదైన వివరాలు, స్లాట్ బుకింగ్‌పై జిల్లా వైద్యాధికారుల నుంచి స్థానిక వైద్యాధికారులకు ఎటువంటి సమాచారం రాలేదని చెబుతున్నారు. దీనిపై మునిసిపల్ కమిషనర్ ఎన్.రామారావు వద్ద ప్రస్తావించగా.. ‘రద్దయిన పింఛన్లను పునరుద్ధరించడానికి కొత్తగా సదరం ద్వారా దివ్యాంగుల ధ్రువీకరణ కోసం స్లాట్ ద్వారా సమయం కేటాయించాం. వైద్యులు ఏ కారణాల వల్ల రాలేదో మాకు తెలియదు. మొత్తం 27 మంది పింఛన్లు రద్దయ్యాయి. ఇందులో ఐదు పింఛన్లను వృద్ధాప్య పింఛన్లుగా మార్చాం. మిగిలిన 22 మంది సంబంధిత దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే పింఛన్లు పునరుద్ధరిస్తామ’ని తెలిపారు.