Eco-tourism : పర్యాటకాభివృద్ధికి.. ఇదే అదును
ABN , Publish Date - May 04 , 2025 | 11:47 PM
Tourism development పర్యాటకాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇచ్ఛాపురం మండలంలోని విదేశీ విహంగ కేంద్రమైన ‘తేలుకుంచి’ని కూడా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
తేలుకుంచి నుంచి తిరుగు పయనమైన విదేశీ పక్షులు
విడిది కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని స్థానికుల విజ్ఞప్తి
ఇచ్ఛాపురం, మే 4(ఆంధ్రజ్యోతి): పర్యాటకాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇచ్ఛాపురం మండలంలోని విదేశీ విహంగ కేంద్రమైన ‘తేలుకుంచి’ని కూడా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. చిత్తడి, తంపర నేలలకు తేలుకుంచి గ్రామం ప్రసిద్ధి. ఇక్కడ పక్షులకు సమృద్ధిగా ఆహారం లభిస్తుంది. సంతానోత్పత్తికి అనుకూలమైన వాతావరణం. అందుకే సైబీరియా, జర్మనీ, ఆస్ర్టేలియా, సింగపూర్, మలేషియా, హంగేరి దేశాల నుంచి పక్షులు వేలాది కిలోమీటర్లు ప్రయాణించి.. ఇక్కడకు ఏటా సెప్టెంబరు, అక్టోబరులో వస్తుంటాయి. ఏడు నెలలపాటు ఇక్కడే ఉండి.. స్థానికులను కనువిందు చేస్తాయి. గుడ్లుపెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. పిల్లలు కొంచెం పెద్దయ్యాక వాటితో మార్చి, ఏప్రిల్‌లో తిరుగుపయనమవుతాయి. ఈ క్రమంలో ప్రస్తుతం పక్షులు తిరుగుముఖం పడుతున్నాయి. మళ్లీ అక్టోబరులో రానున్నాయి. ఈ సమయంలో విడిది కేంద్రంలో అభివృద్ధి పనులు చేపడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వైసీపీ హయాంలో నిర్లక్ష్యం
టీడీపీ ప్రభుత్వ హయాంలో తేలుకుంచిలో కొన్నిరకాల నిర్మాణాలు జరిగాయి. 2019 ఆరంభంలో తేలుకుంచిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కీలక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో అవన్నీ బుట్టదాఖలు అయ్యాయి. పర్యాటకశాఖకు ఎటువంటి నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టలేదు. విదేశీ పక్షుల సంతోనాత్పత్తికి సంబంధించి ఏర్పాట్లు చేయలేదు. దీంతో గుడ్లుతోపాటు చాలా పక్షులు చెట్టు కింద నుంచి జారిపడి మృత్యువాత పడుతున్నాయి. కనీసం చెట్లకు వలలు ఏర్పాటు చేసినా కొంతవరకూ పక్షులను రక్షించవచ్చు. చుట్టుపక్కల చెరువులను అభివృద్ధి చేస్తే పక్షులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అటవీ, పర్యాటక శాఖ సంయుక్తంగా చర్యలు చేపడితే విదేశీ పక్షుల విడిది కేంద్రం అభివృద్ధి సాధించే అవకాశముంది. కాగా.. తేలుకుంచితోపాటు తేలినీలాపురంలో పక్షుల విడిది కేంద్రాల అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు.
పక్షులను చూస్తే బాధేస్తోంది..
విదేశీ పక్షులు వచ్చిన్పుడు చాలా ఆనందం వేస్తుంది. అవి వస్తేనే ఈ ప్రాంతంలో సమృద్ధిగా పంటలు పండుతాయని మా నమ్మకం. కానీ ఈ కేంద్రంలో పక్షులు పడే బాధలు వర్ణనాతీతం. సరైన ఏర్పాట్లు లేక చెట్లపై నుంచి జారిపడి సంతానోత్పత్తి గుడ్లు పగిలిపోతుంటాయి. పక్షులు సైతం మృత్యువాత పడుతుంటాయి. ఆ సమయంలో చాలా బాధేస్తోంది. ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
- పాతిర్ల రాజశేఖర్, తేలుకుంచి, ఇచ్ఛాపురం
......................
ప్రభుత్వం దృష్టిపెట్టాలి
పక్షుల విడిది కేంద్రంపై వైసీపీ పాలనలో కనీస స్థాయిలో పర్యవేక్షణ లేదు. అటవీశాఖ, పర్యాటకశాఖ అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ విదేశీ పక్షుల కేంద్రంపై దృష్టిపెట్టాలి.
- మేరుగు సూర్యనారాయణ, తేలుకుంచి, ఇచ్ఛాపురం
......................
ప్రతిపాదనలు పంపాం
తేలుకుంచి విదేశీ పక్షుల విడిది కేంద్రంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. అటవీ శాఖపరంగా మొక్కలు కూడా నాటి సంరక్షిస్తున్నాం. పక్షుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం. శాశ్వత నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదనలు చేశాం. త్వరలో వాటికి ప్రభుత్వం నుంచి మోక్షం కలుగుతుందని ఆశిస్తున్నాం.
- ఏ.మురళీకృష్ణ నాయుడు, అటవీరేంజ్ అధికారి, కాశీబుగ్గ