దారి మారలేదు.. బాధ తీరలేదు!
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:21 AM
roads problem in agency ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా గిరిజన గ్రామాల్లో రహదారులు బాగు పడడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఎన్‌ఆర్‌జీఎస్ నిధులు మంజూరు చేసినా గిరిజన గ్రామాల్లో రహదారుల పనులు పూర్తికాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.. గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు కనిపించరాదనే ఉద్దేశంతో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.
గిరిజన గ్రామాల్లో పూర్తికాని రహదారులు
పట్టించుకోని ఐటీడీఏ అధికారులు
మెళియాపుట్టి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి):
మెళియాపుట్టిం మండలం ఎం.ఎన్.రోడ్డు నుంచి కుడ్డబ మీదుగా రాజపురం వరకు 5 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ఏడాది కిందట రూ.2కోట్ల నిధులు మంజూరు చేశారు. కానీ ఇప్పటివరకు పనులు పూర్తికాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నరోడ్డు తవ్వేసి.. పనులు మధ్యలో వదిలేయడంతో రాళ్లు తేలి వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఈ రహదారి మీదుగా వెళితే.. వాహనాలు పాడైపోతున్నాయని ఈ ప్రాంతవాసులు వాపోతున్నారు.
మెళియాపుట్టి మండలం అంపురం గ్రామం నుంచి ఎగువరింపి వరకు 2.30 కిలోమీటర్లు మేర రహదారి నిర్మాణానికి రూ.1,72,50,000 నిధులు కొన్నాళ్ల కిందట మంజూరు చేశారు. రహదారి పనులు ఇంతవరకూ ప్రారంభించకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయని పేర్కొంటున్నారు.
మెళియాపుట్టి మండలం కొండపై ఉన్న కేరాశింగి గ్రామంలో రహదారి నిర్మాణానికి ఇప్పటివరకు రూ.3.95 కోట్ల నిధులు మంజూరైనా పనులు పూర్తికాలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు పూర్తికాకుండానే బిల్లులు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం మరో రూ.40 లక్షలు మంజూరు చేయగా.. కొంతమేర సీసీ రోడ్డు నిర్మించి వదిలేశారు. గతంలో వేసిన మెటల్ రోడ్డు ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో కేరాశింగితోపాటు గూడ గ్రామాలకు వెళ్లలేని దుస్థితి నెలకొంది.
ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా గిరిజన గ్రామాల్లో రహదారులు బాగు పడడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఎన్‌ఆర్‌జీఎస్ నిధులు మంజూరు చేసినా గిరిజన గ్రామాల్లో రహదారుల పనులు పూర్తికాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.. గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు కనిపించరాదనే ఉద్దేశంతో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలోని సీతంపేట ఐటీడీఏ పరిధిలో 13 మండలాల్లో 165 పనులకు సంబంధించి రూ.85.48 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకూ రూ.15.79 కోట్లు ఖర్చు చేసినట్టు ఇంజనీరింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. 8 రహదారులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 135 రహదారులు వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలినవి ఇంకా పనుల ప్రారంభానికి నోచుకోలేదు. ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ అధికారుల్లో కదలిక లేదనే ఉద్దేశంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కొన్నాళ్ల కిందట రూ.20.36 కోట్ల మేర నిధులకు సంబంధించి 16 రహదారుల పనులను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించారు. కాగా ఆ పనులను మళ్లీ ఐటీడీఏకు బదలాయించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు పనులు చేపడుతుండగా.. వారికి కొంతమంది అధికారపార్టీ నేతలు కొమ్ముకాస్తున్నానే ఆరోపణలు ఉన్నాయి. అలాగే చేసిన పనులకు బిల్లులు కావడం లేదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రహదారి పనులు పూర్తిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఇంజనీరింగ్ శాఖలో సమన్వయ లోపం?
ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారుల్లో సమన్వయలోపంతో పనులు పురోగతి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో పాతపట్నం సెక్షన్‌లో పనిచేసిన ఒక ఇంజనీరింగ్ అధికారిపై పలు ఆరోపణలు రాగా సస్పెన్షన్ చేశారు. అలాగే ఐటీడీఏ ఈఎన్‌సీ శ్రీనివాసరావు కొన్నాళ్ల కిందట ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇంజనీరింగ్‌శాఖలో ఈఈల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇటీవల పాతపట్నం సెక్షన్‌లో పనిచేసిన ఇంజనీర్ అధికారి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. కాంట్రాక్టర్ చెబుతున్నట్టు వినడం లేదనే ఉద్దేశంతో.. ఆ అధికారిని బదిలీ చేయాలని ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇంజనీరింగ్ శాఖపై దృష్టి సారించాల్సి ఉంది. గిరిజన ప్రాంతాల్లో రహదారుల పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.