Share News

షెడ్డే గూడు.. చెట్టే నీడ!

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:10 AM

అగ్నిప్రమాద సమయాల్లో ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్న అగ్నిమాపక కార్యాలయానికి సొంత గూడు కరువైంది. సుమారు పదిహేనేళ్ల కిందట మందస కేంద్రంగా అగ్నిమాపక కార్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

షెడ్డే గూడు.. చెట్టే నీడ!

  • సొంతగూటికి నోచుకోని మందస అగ్నిమాపక కార్యాలయం

  • పదిహేనేళ్లగా శిథిల భవనంలోనే..

  • బిక్కుబిక్కుమంటూ సిబ్బంది విధులు

  • పట్టించుకోని ఉన్నతాధికారులు

హరిపురం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): అగ్నిప్రమాద సమయాల్లో ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్న అగ్నిమాపక కార్యాలయానికి సొంత గూడు కరువైంది. సుమారు పదిహేనేళ్ల కిందట మందస కేంద్రంగా అగ్నిమాపక కార్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పట్లో శిథిలమైన షెడ్డులా మిగిలిపోయిన మండల కార్యాలయ సిబ్బంది క్వార్టర్స్‌లోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుంచి బితుకు బితుకుమంటూ అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు వాహనం ఉంచేందుకు నిలువు నీడలేక చెట్టుకిందనే నిలుపుతున్నారు. ఏ సమయంలో ఏం ప్రమాదం ముంచుకుస్తోందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గత ఐదేళ్లుగా తుఫాన్లు, అనంతరం ఏర్పడిన భారీ వర్షాలు సమయంలో వీరి సేవలు అత్యుత్తమంగా నిలిచాయి. వీరి సేవలను కొనియాడుతూ పలువురు అధికారులు అభినందనలు తెలిపారు. కానీ వీరికి పదిహేనేళ్లుగా వేధిస్తున్న వసతి సమస్య మాత్రం తీరడం లేదు. ఇదే విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు వేడుకోవడంతో నిధులు మంజూరయ్యాయి. ఆ తర్వాత నిర్మిస్తాం అంటూ చెబుతున్నారే తప్పా.. ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. దీంతో ప్రజల ఆస్తులను రక్షించే తమకే రక్షణ కరవైందని వారంతా నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. సొంత భవనం ఏర్పడితే తమ సేవలు మరింత విస్తృతం చేసి, విధి నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఫోన్‌ చేసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంటామని మందస అగ్నిమాపక కేంద్రం సూపర్‌వైజర్‌ బాడ వల్లభరావు చెబుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Oct 10 , 2025 | 12:10 AM