Share News

వండిందే మెనూ.. పెట్టిందే తిను

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:26 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ పదేపదే ఆదేశిస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు.

 వండిందే మెనూ.. పెట్టిందే తిను
చాలీచాలని కూరలతో భోజనం చేస్తున్న విద్యార్థులు

- ప్రతిరోజూ ఇవ్వని గుడ్డు

- 30 గ్రాములకు మించని కోడి కూర

- విద్యార్థులతో వడ్డింపులు

- పట్టించుకోని అధికార్లు

- ఇదీ గిరిజన వసతి గృహాల్లో పరిస్థితి

మెళియాపుట్టి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ పదేపదే ఆదేశిస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు. ముఖ్యంగా గిరిజన విద్యార్థుల వసతి గృహాల్లో వండిందే మెనూ..పెట్టిందే తినూ అన్న చందగా పరిస్థితి ఉంది. మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది 115 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ముగ్గురు కుక్‌లతో పాటు ఓ కమాటీ ఉన్నారు. వీరు చేయాల్సిన పనులను విద్యార్థులతో చేయిస్తున్నారు. మధ్యాహ్న భోజనాలను సైతం విద్యార్థులే వడ్డించుకుని తింటున్నారు. ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఉడక బెట్టిన కోడి గుడ్డు ఇవ్వాలి. కానీ, గుడ్డును సక్రమంగా అందించడం లేదు. ఆదివారం, మంగళవారం కోడి మాంసం ఒక్కొక్కరికి 100 గ్రాములు పెట్టాల్సి ఉన్నా 30 గ్రాములతోనే సరిపెడుతున్నారు. అదికూడా వారానికి ఒక్కరోజే పెడుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. పప్పు నీరులా పలుచగా, చప్పగా ఉంటుంది. చాలిచాలనీ కూరలు వడ్డిస్తున్నారు. కొంత మంది విద్యార్థులు తమ ఇళ్ల నుంచి తెచ్చుకున్న పచ్చడి, కారం మిక్చర్‌తో అన్నం తింటున్నారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులతో వంట చేయిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరోజు గుడ్డు వేయకపోతే రూ.వెయ్యి మిగులుతుంది. దీంతో నెలకు 20 రోజులు మాత్రమే విద్యార్థులకు గుడ్డు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి నెల గుడ్లను కిరాణా వ్యాపారులకు విక్రయించి రూ.10వేలు వరకు హాస్టల్‌ నిర్వాహకులు సంపాదిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అరటి పండ్లు కూడా విద్యార్థులకు సక్రమంగా ఇవ్వడం లేదు. ఈ ఆశ్రమ పాఠశాలలో రెండేళ్ల నుంచి ఒక వ్యక్తే వార్డెన్‌గా కొనసాగుతున్నారు. మిగతా ఆశ్రమ పాఠశాలల్లో ప్రతిఏటా వార్డెన్ల మార్పు ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం రెండేళ్ల నుంచి ఒక్కరే వార్డెన్‌గా పని చేస్తుండడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టెక్కలి సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన రాహుల్‌కుమార్‌రెడ్డి పెద్దలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసినప్పుడు అనేక లోటుపాట్లు కనిపించాయి. దీంతో అప్పట్లో హెచ్‌ఎంగా ఉన్న ప్రసాదరావును సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాఠశాల పరిస్థితి మారలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని అన్ని గిరిజన వసతి గృహాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

పర్యవేక్షణ కరువు..

సీతంపేట ఐటీడీఏ పరిధిలో సహాయ గిరిజన సంక్షేమ అధికారుల(ఏటీడబ్ల్యూవో) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సీతంపేట, మెళియాపుట్టి, మందస పరిధిలోని ఆశ్రమ పాఠశాలలపై పర్యవేక్షణ కరువైంది. ఏటీడబ్ల్యూవోల పర్యవేక్షణ లేకపోవడంతో కొంతమంది వార్డెన్లు మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. వారికి నచ్చిన విధంగా విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారు. ప్రస్తుతం మెళియాపుట్టి, సీతంపేటలో ఏటీడబ్ల్యూవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెళియాపుట్టి ఏటీడబ్ల్యూవోగా పనిచేసిన కృష్ణవేణి కొన్ని నెలల కిందట డెప్యూటేషన్‌ పార్వతీపురం డీడీగా వెళ్లిపోయారు. మందస ఏటీడబ్ల్యూవోగా పనిచేసిన శ్రీనివాసరావు ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీపై వెళ్లారు. అరకు నుంచి అనంతగిరి అనే వ్యక్తి మందస ఏటీడబ్ల్యూవోగా వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అనంతగిరికి డెప్యూటేషన్‌పై బదిలీ జరిగి నప్పటికీ ఐటీడీఏ పీవో మాత్రం ఆయన్ను రిలీవ్‌ చేయలేదు. మెళియాపుట్టి ఏటీడబ్ల్యూవోగా లాభర పాఠశాల హెచ్‌ఎం సూర్యనారాయణకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. అయితే వసతి గృహాలను ఆయన పరిశీలించే పరిస్థితి కనిపించడం లేదు.

విభజనతో ఇబ్బందులు..

సీతంపేట ఐటీడీఏ పరిధిలో సుమారు 47 ఆశ్రమ పాఠశాలలు, 18 పోస్టుమెట్రిక్‌ వసతిగృహాలు, 12 గురుకులాలు ఉన్నాయి. వీటిల్లో 16 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనతో శ్రీకాకుళంలోని సీతంపేట ఐటీడీఏ పార్వతీపురం మన్యంకు వెళ్లిపోయింది. దీంతో కొంతమంది అధికారులు మన్యం జిల్లాకే పరిమితమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వసతి గృహాలను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పీవోతో పాటు ఉన్నతాధికారులు ఇటువైపు చూడకపోవడంతో వార్డెన్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వార్డెన్లు, హెచ్‌ఎంలు కలిసి వివిధ బిల్లులు పెట్టుకొని దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించి వసతి గృహాల్లో మెనూ సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:26 AM