మిల్లర్ల మాయాజాలం
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:51 AM
అన్నదాత ప్రతి ఏడాదీ నిలువు దోపిడీకి గురవుతున్నాడు.
- రైతుల నుంచి అదనపు వసూళ్లు
- నూకలు వస్తున్నాయంటూ 8 కిలోల ధాన్యం అదనంగా తీసుకుంటున్న వైనం
- దింపుడు చార్జి భారం కూడా రైతులపైనే
- పట్టించుకోని కస్టోడియన్ అధికారులు
- ఇప్పటికే రూ.15కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు
శ్రీకాకుళం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): అన్నదాత ప్రతి ఏడాదీ నిలువు దోపిడీకి గురవుతున్నాడు. ప్రభుత్వం అన్నదాత పక్షాన నిలబడి.. నేరుగా ప్రయోజనం దక్కేలా.. వారు మోసానికి గురికాకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు.. అధునాతన టెక్నాలజీని సైతం తీసుకువచ్చినా సరే.. ఇవేవీ భరోసా ఇవ్వలేకపోతున్నాయి. స్థానికంగా ఉండే అధికారులు కేవలం ‘నామమాత్రపు అధికారులు’గా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రతిఏటా మాదిరిగానే ఈ దఫా కూడా మిల్లర్ల చేతిలో రైతులు మోసపోతున్నారు. మిల్లర్లకు అన్ని సదుపాయాలు సమకూర్చినా పాతవాసనను విడిచి పెట్టడంలేదు. రైతులు కూడా గొంతెత్తి ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు. మిల్లర్ల మాఫియా ఏరీతిన సాగుతుందో... జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సాక్షాత్తు పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.
ఐదు నుంచి ఎనిమిది కిలోల ధాన్యం అదనం
రైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించాలంటే పీపీసీ వద్దకు వెళ్లి అక్కడ సివిల్ సప్లయ్ టెక్నికల్ సిబ్బందికి చెప్పి ట్రక్ షీట్‌ను జనరేట్ చేయించుకోవాలి. అప్పుడు జీపీఎస్ ఉన్న వాహనంతో బ్యాంకు గ్యారెంటీ ఉన్న మిల్లుకు మాత్రమే, అందులో రైతు కోరుకున్న మిల్లుకు ధాన్యం చేరుతాయి. ఇదంతా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు.. ఆదేశాలు. కానీ క్షేత్రస్థాయిలో ఇలా జరగడంలేదు. ఇటీవల అర్ధరాత్రి వేళల్లో ట్రక్‌షీట్లను జనరేట్ చేసేశారు సిబ్బంది. ఈవిషయం జాయింట్ కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే చర్యలకు ఉపక్రమించారు. అయితే ఇటువంటివి కోకొల్లలుగా జిల్లాలో ఉన్నాయి. నూకలు వస్తున్నాయని.. బియ్యం ముక్కలవుతుందని కారణాలను చూపుతూ మిల్లర్లు అదనంగా ధాన్యాన్ని వసూలు చేస్తున్నారు. ఎనభై కిలోల ధాన్యం బస్తాకు అదనంగా ఐదు నుంచి ఎనిమిది కిలోలను రైతుల నుంచి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని రైతుల తరఫున ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎనిమిది కిలోల ధాన్యం సుమారుగా రూ.190 అవుతోంది. అలాగే కూలీ ధరల విషయానికొస్తే... కల్లం నుంచి ధాన్యం తీసుకువెళ్లేందుకుగాను కళాసీల చార్జీలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. మిల్లుల వద్ద ధాన్యం వాహనం నుంచి దింపేందుకుగాను దింపుడు కూలీ చార్జీ(హమాలీ చార్జీ)ని ప్రభుత్వం మిల్లరు ఖాతాలో జమ చేస్తుంది. కానీ.. దింపుడు కూలీ కింద బస్తాకు రూ.15 చొప్పున రైతు నుంచే తక్షణమే వసూలు చేస్తున్నారు మిల్లర్లు. అక్కడ ఉన్న కస్టోడియన్ అధికారి నామమాత్రంగానే వ్యవహరిస్తున్నారు. ఒక్కో మిల్లరు ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనం కంటే రైతుల నుంచి ప్రత్యక్షంగాను, పరోక్షంగా దోచుకుని లాభపడుతున్నారు. ప్రతి మిల్లు నుంచి అదనంగా అసోసియేషన్‌కు ఇవ్వాలని కొంత వసూలు చేస్తున్నారని.. ఇలా ఇప్పటికి రూ. 15 కోట్లు మేరకు కలెక్షన్ చేశారని జడ్పీలో కూన రవి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈవిషయమై అసోసియేష్ కూడా ఖండించుకోలేకపోయింది. ఇందుకు కారణం మిల్లర్ల మాయాజాలమే. అలాగే మిల్లర్ల నుంచి పలురూపాల్లో వాటాలు వెలుతున్నాయని బహిరంగ ఆరోపణ.
తనిఖీలు నిర్వహిస్తేనే ప్రయోజనం..
మిల్లర్లు ప్రభుత్వానికి.. అధికార యంత్రాంగానికి అతీతులేమీకారన్న భావన వారిలో కలిగించాలి. ప్రతి మిల్లు వద్ద తహసీల్దార్.. ఆపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. రైతుల నుంచి కూడా అభిప్రాయాన్ని సేకరించాలి. వాస్తవాన్ని ఎప్పటికప్పుడు జాయింట్ కలెక్టర్‌కు, కలెక్టర్‌కు తెలియజేయగలగాలి. ప్రజాప్రతినిధులు సైతం మిల్లర్ల అక్రమాలపై హెచ్చరిస్తుండాలి. వారే స్వయంగా అధికారులను పురమాయించి అవసరమైతే దాడులు జరిపించే పరిస్థితి ఉండాలి. ఇంకా అవసరమైతే ప్రజాప్రతినిధులు కూడా ఆరోపణలు వస్తున్నవారిని సైతం దూరం పెట్టగలగాలి. ఇలా అయితేనే రైతులు కూడా ధైర్యంగా తాను నష్టపోతున్న వైనాన్ని నిర్భయంగా చెప్పగలడు. లేకుంటే ప్రభుత్వం పక్కాగా ఉన్నా.. మిల్లర్ల వల్ల చెడ్డపేరు సంబంధిత వ్యక్తులకు అంటుకోక తప్పదు. అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే ప్రయోజనం ఉంటుంది.