ఆచార్య సచ్చిదానందమూర్తి జీవితం నేటితరానికి దార్శనికం
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:00 AM
Sachchidanandamurthy is a visionary తాత్విక విశ్లేషకులు, విజ్ఞాన విలువలు పంచిన మహానీయులు ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి.. నేటితరానికి ఓ దార్శనికతగా నిలుస్తారని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు.
ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు
ఎచ్చెర్ల, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): తాత్విక విశ్లేషకులు, విజ్ఞాన విలువలు పంచిన మహానీయులు ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి.. నేటితరానికి ఓ దార్శనికతగా నిలుస్తారని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ‘ద రోల్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ రెలిజియన్ ఫెర్సిఫెక్టివ్ ఆఫ్ కేఎస్ మూర్తి’ అనే అంశంపై జాతీయ సెమినార్ గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ ‘నేటి సాంకేతిక ప్రపంచంలో క్షీణిస్తున్న మానవీయ విలువలు, దిగజారుగుతున్న నైతికతకు సరైన చికిత్స ఆచార్య మూర్తి సైద్ధాంతిక ఆలోచనలే. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం విశిష్టతను దశాబ్దాల కిందటే సచ్చిదానందమూర్తి ప్రస్తావించారు. సాంస్కృతిక, సామాజిక, తాత్విక వికాసానికి వేదాంతం, బుద్ధిజం, బాధ్యతతో కూడిన విజ్ఞానం ఎంతో అవసరమని ఆచార్య మూర్తి బోధించేవార’ని తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ అధ్యాపకుడు, విద్యార్థి మధ్య సత్యాన్వేషణ బంధం ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు సాధ్యమని తెలిపారు. ఇండియన్ ఫిలాసాఫికల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆచార్య ఎస్.పన్వీర్ సెల్వం(మద్రాసు యూనివర్సిటీ) మాట్లాడుతూ తత్వశాస్త్ర అధ్యయనంలో ఆచార్య సచ్చిదానందమూర్తి ప్రపంచ మేథావిగా ఖ్యాతిపొందారన్నారు. ప్రత్యేక అతిథిగా బరంపురం యూనివర్సిటీ వీసీ ఆచార్య గీతాంజలి దాస్ మాట్లాడుతూ అనేక మతాలు, అభిరుచులు, సంప్రదాయాలు, సంస్కృతులు మిళితులైన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌తో ప్రపంచ సవాళ్లు ఎదుర్కోవచ్చన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బీఆర్‌ఏయూ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని మాట్లాడుతూ ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్ శత వసంతాలు, ఆచార్య సచ్చిదానందమూర్తి శతజయంతి ముగింపు సందర్భంగా రెండు రోజులపాటు వర్సిటీలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఆచార్య సచ్చిదానందమూర్తిపై ప్రచురించిన ప్రత్యేక సంకలనాన్ని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య, వివిధ యూనివర్సిటీలకు చెందిన ఆచార్యులు పాల్గొన్నారు.