Maoist Chief Nambala: చివరి చూపు దక్కలే
ABN , Publish Date - May 27 , 2025 | 12:16 AM
Maoist Chief Nambala: ఛత్తీస్‌గఢ్ లోని అబూజ్‌మడ్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ కమాండర్ ఇన్ చీఫ్ నంబాల కేశ వరావు అలియాస్ బసవరాజు అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి.
- నారాయణపూర్‌లో మావోయిస్ట్ చీఫ్ నంబాల అంత్యక్రియలు పూర్తి
- కేశవరావు మృతదేహం కోసం మూడురోజులుగా ఎదురుచూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు
- అయినా అప్పగించని పోలీసులు
టెక్కలి, మే 26 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ కమాండర్ ఇన్ చీఫ్ నంబాల కేశ వరావు అలియాస్ బసవరాజు అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్‌లో సోమవారం రాత్రి అక్కడి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులకు మృతదేహాన్ని అప్పగించాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వు లు ఉన్నప్పటికీ అక్కడి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడంపై కేశవరావు కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వెలిబుచ్చారు. బసవరాజు కడసారి చూపునకు ఆయన స్వగ్రామమైన జీయన్నపేట గ్రామస్థులు నోచుకోలేదు.
మూడు రోజులుగా ఎదురుచూపు
ఏపీ హైకోర్టు ఉత్తర్వులతో కేశవరావు మృతదేహం కోసం మూడురోజుల కిందట ఆయన సోదరుడు రాంప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు నారాయణపూర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పోలీసులు కేశవరావు మృతదేహం ఇచ్చేందుకు అంగీకరించలేదు. ‘మీ జిల్లా పోలీసుల అనుమతి తీసుకొని వచ్చారా?, మీరు కేశవరావు కుటుంబసభ్యులేనా?, లీగల్‌హెయిర్ సర్టిఫికెట్ తెచ్చారా, తాజాగా కేశవరావుతో కలిసి తీసుకున్న ఫొటో ఏదైనా ఉందా.?’ అని పలు రకాల ప్రశ్నలు అక్కడి పోలీసులు సంధించారు. సోమవారం కేశవరావు పెద్దసోదరుడు ఢిల్లేశ్వర రావు తమ స్వగ్రామం జీయన్నపేట వెళ్లి గ్రామస్థులు, బంఽధువులతో మాట్లాడారు. అయితే, ఆయన వెంట పోలీస్ షాడో బృందం ఉంది. కేశవరావు మృతదేహం కోసం పౌరహక్కుల సంఘం నాయకులు మరోమారు సోమవారం హైకోర్టును ఆశ్రయించి నట్లు తెలిసింది. ఈలోపే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్‌లో సోమవారం రాత్రి అక్కడి పోలీసులు కేశవరావు అంత్యక్రియలను పూర్తి చేసేశారు.