Suside attempt : భూమి ఆక్రమణకు గురైందని..
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:38 AM
Elderly woman attempts suicide at Grievance భూమి ఆక్రమణకు గురైందనే ఆవేదనతో ఓ వృద్ధురాలు ‘మీ-కోసం’ వేదికగా నిర్వహించే గ్రీవెన్స్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గడ్డిమందు సీసాను వెంట తెచ్చుకోగా.. పోలీసులు అప్రమత్తమై దానిని స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా.. సమస్య పరిష్కరిస్తానని నేరుగా ఆయన హామీ ఇవ్వడంతో వృద్ధురాలు ఊరట చెందింది.
గ్రీవెన్స్ వద్ద వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం
అప్రమత్తమైన పోలీసులు.. గడ్డిమందు సీసా స్వాధీనం
సమస్య పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): భూమి ఆక్రమణకు గురైందనే ఆవేదనతో ఓ వృద్ధురాలు ‘మీ-కోసం’ వేదికగా నిర్వహించే గ్రీవెన్స్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గడ్డిమందు సీసాను వెంట తెచ్చుకోగా.. పోలీసులు అప్రమత్తమై దానిని స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా.. సమస్య పరిష్కరిస్తానని నేరుగా ఆయన హామీ ఇవ్వడంతో వృద్ధురాలు ఊరట చెందింది. వివరాల్లోకి వెళితే.. కొత్తూరులోని గాజులవీధికి చెందిన పొగిరి అన్నపూర్ణమ్మ 79 ఏళ్ల వృద్ధురాలు. భర్త చనిపోయాడు. ఇద్దరు కుమారులు బతుకుదెరువు కోసం దూరప్రాంతాలకు వెళ్లిపోయారు. ఆమె మాత్రం స్వగ్రామంలో ఒంటరిగా కాలం వెల్లదీస్తోంది. ఆ వృద్ధురాలికి చెందిన భూమిని ఓ ఆసామి తనదంటూ ఆక్రమించుకున్నాడు. తనకు న్యాయం చేయాలని సచివాలయం, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ రెండేళ్లపాటు తిరిగింది. అయినా ఫలితం లేకపోవడంతో చివరిగా కలెక్టర్‌ను కలిసి తమ గోడుచెప్పాలనుకుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సంచిలో గడ్డిమందు సీసాను తెచ్చుకుని.. సోమవారం శ్రీకాకుళంలోని జడ్పీలో నిర్వహించిన ‘మీ-కోసం’ గ్రీవెన్స్‌కు వచ్చింది. గ్రీవెన్స్ ప్రవేశ ద్వారం వద్ద ఒకటో పట్టణ ఏఎస్‌ఐ వీఏ నాయుడు, సిబ్బంది, బీడీ టీం ఆమెను పరీశీలించగా గడ్డిమందు సీసా కనిపించింది. ఆ సీసాను స్వాధీనం చేసుకున్నారు. దానిపై ఆరా తీసి.. తన భూమి ఆక్రమణకు గురైందని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం జరగకపోతే చనిపోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. దీంతో వారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. కలెక్టర్ స్వయంగా వృద్ధురాలి వద్దకు వచ్చి.. ఆమె గోడు విని.. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.