Share News

ఫిబ్రవరిలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:12 AM

వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పలాసలో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించేందుకు అధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు.

ఫిబ్రవరిలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం
రైల్వే వైద్యుల గృహాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో వెంకటేష్‌, కమిషనర్‌ శ్రీనివాసులు

- చర్యలు చేపడుతున్న అధికారులు

-ఆర్పీఎఫ్‌ సిబ్బంది వసతికి రైల్వేగృహాలు పరిశీలించిన ఆర్డీవో

పలాస, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పలాసలో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించేందుకు అధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. పలాస రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్న ఆర్పీఎఫ్‌ బ్యారక్స్‌లో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న బ్యారక్స్‌ను రైల్వే అతిథిగృహం, రైల్వే గృహాల వద్దకు మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు పలాస ఆర్డీవో జి.వెంకటేష్‌ బుధవారం ఈ స్థలాలను పరిశీలించారు. అక్కడ వసతి సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది సూచన మేరకు రైల్వే అతిథి గృహంలో ఖాళీగా ఉన్న వసతి సముదాయాన్ని పరిశీలించారు. అక్కడ 20 మందికి సరిపడా వసతి ఉన్నట్లు గుర్తించారు. ఇవి చాలవని ఆర్పీఎఫ్‌ సిబ్బంది చెప్పడంతో ఆ ప్రాంతంలో ఉన్న రైల్వేగృహాలను కూడా చూశారు. మహిళా ఆర్పీఎఫ్‌ సిబ్బంది ఉండేందుకు రైల్వే వైద్యుడి గృహాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం ఖాళీగా ఉండడంతో మహిళలకు సరిపడుతుందని సిబ్బంది అంగీకరించడంతో మొత్తం ఇంటినెంబర్లతో సహా జిల్లా కలెక్టర్‌కు వివరాలు సమర్పిస్తామని ఆర్డీవో తెలిపారు. డిసెంబరు నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆయన ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయం నిర్వహణకు ఇంకా అవసరమైతే గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, కంప్యూటర్‌ ల్యాబ్‌లను తాత్కాలికంగా నిర్మించడానికి కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరోమారు పరిశీలనకు కేంద్ర బృందం రానుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది నుంచి కేంద్రీయ విద్యాలయంలో ఒకటి నుంచి ఐదు తరగతులు ప్రారంభించడానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నారు. ఆర్డీవో వెంట మునిసిపల్‌ కమిషనర్‌ ఇ.శ్రీనివాసులు, డెప్యూటీ తహసీల్దార్‌ వి.గిరి, టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 12:12 AM