అక్రమాలు కొండంత..చర్యలు గోరంత
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:51 PM
టెక్కలి మండలం జగతిమెట్ట జగనన్న ఇళ్ల కాలనీ అక్రమాల పుట్టగా తయారైంది. ఈ కాలనీలో వేసిన లేఅవుట్లు, పట్టాల కేటాయింపు ఇలా అన్నింట్లో కూడా భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇష్టారాజ్యంగా పొజిషన్ సర్టిఫికెట్లను జారీ చేశారు.
- ఇదీ జగతిమెట్ట జగనన్న కాలనీలో పరిస్థితి
- 150 వరకు అక్రమ పట్టాల గుర్తింపు
- రద్దు చేసింది 40 మాత్రమే
- మరో 18 పునాదులు తొలగింపు
- కీలక రికార్డులు మాయం
- కారణమైన అధికారులపై కానరాని చర్యలు
టెక్కలి మండలం జగతిమెట్ట జగనన్న ఇళ్ల కాలనీ అక్రమాల పుట్టగా తయారైంది. ఈ కాలనీలో వేసిన లేఅవుట్లు, పట్టాల కేటాయింపు ఇలా అన్నింట్లో కూడా భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇష్టారాజ్యంగా పొజిషన్ సర్టిఫికెట్లను జారీ చేశారు. రూ.లక్షలకు వాటిని అమ్ముకున్నారు. కీలకమైన రికార్డులు మాయమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి కొందరు నాయకులు, కొందరు రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇవన్నీ బయటపడ్డాయి. కానీ, ఏడాది అవుతున్నా చర్యలు మాత్రం నామమాత్రమే. దీంతో అక్రమాలు కొండంత, చర్యలు మాత్రం గోరంత అన్న చందంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.
టెక్కలి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీ కోసం టెక్కలి దరి జగతిమెట్ట సమీపంలో సర్వేనెం.288, 289లో సుమారు 12 ఎకరాల డీ.పట్టాను అధికారులు సేకరించారు. శ్యామసుందరాపురానికి చెందిన 40మంది రైతులకు చెందిన ఈ భూమిని ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా సేకరించారు. వీరికి నగదు చెల్లింపులు కూడా జరిగాయి. అలాగే, వీరికి ఒక్కో ఇంటి పట్టాను అందించాల్సి ఉంది. కానీ, అధికారులు మాత్రం 40మందికి బదులు 70 మంది రైతుల పేర్లు సృష్టించి వారికి పట్టాలు అందించారు. ఇళ్ల పట్టాల కేటాయింపుల్లో కొందరు రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శించి దొరికినకాడికి దోచుకున్నారు. అప్పటి అధికార పార్టీకి చెందిన కొందరి ప్రజాప్రతినిధుల సిఫారసులతో ఇష్టారాజ్యంగా ఇళ్ల పట్టాలు జారీచేయడం, పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయడం చేశారు. అప్పట్లో కొందరు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు దళారీల అవతారం ఎత్తారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇళ్ల పట్టాలను భారీ ధరలకు అమ్మకాలు చేశారు. ఈ కాలనీలో 389 లేఅవుట్లకు అనుతులు ఉంటే 420 వెలిశాయి. 150 వరకు భోగస్ పట్టాలు మంజూరు చేశారు.
చర్యలు అంతంత మాత్రమే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే జగతిమెట్ట జగనన్న కాలనీలోని అక్రమాలను వెలికితీయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆర్డీవో ఎం.కృష్ణమూర్తికి ఆ బాధ్యతలను మంత్రి అప్పగించారు. దీంతో ఆర్డీవో విచారణ చేపట్టారు. తీగలాగితే దొంక కదిలినట్లయింది. భూములు ఇచ్చిన రైతులు 40మంది అయితే 70మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు గుర్తించారు. అలాగే 389 లేఅవుట్లకు బదులు 420 లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు. 150 వరకు భోగస్ పట్టాలు ఉన్నట్లు తేల్చారు. ఈ లేఅవుట్లలో 70వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక్కడ పొజిషన్ సర్టిఫికెట్లను రూ.లక్షలకు కొనుక్కొని ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన వారు వందల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ, అధికారులు మాత్రం కేవలం 18 ఇళ్ల పునాదులను తొలగించి మమ అనిపించారు. అలాగే, 40 బోగసు పట్టాలు రద్దు చేసి చేతులు దులుపుకొన్నారు.
రెవెన్యూ సిబ్బందిపై చర్యలేవి?
ఆర్డీవో దర్యాప్తులో చాలా విషయాలు బయటపడ్డాయి. రెవెన్యూ అధికారులు మొదలుకొని సిబ్బంది వరకు సూత్రదారులు, పాత్రదారులుగా ఆయన గుర్తించారు. 2019-24 మధ్యకాలంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిని సబ్‌కలెక్టర్ కార్యాలయానికి ఒక్కొక్కరుగా పిలిచి ఆర్డీవో విచారించారు. తహసీల్దార్ సంతకాలతో పాటు మిగిలిన సంతకాలు ఒక్కరే పెట్టి పొజిషన్ సర్టిఫికెట్లను కుప్పలుతెప్పలుగా అమ్ముకున్నట్లు నిర్ధారించారు. లేఅవుట్లకు సంబంధిచి జియోట్యాగింగ్ వివరాలు కానీ, ఎంపికైన లబ్దిదారుల జాబితాలు కానీ, ఇళ్ల పట్టాలు జారీచేసిన రిజిష్టర్లు గానీ ఇలా ఏ ఒక్క వివరాలు కూడా తహసీల్దార్ కార్యాలయంలో లభించలేదు. ఆ రికార్డులు ఎప్పుడు మాయమయ్యాయో, ఎలా మాయమయ్యావో అంతుపట్టని ప్రశ్నగా మారింది. ఈ అక్రమాల్లో తహసీల్దార్, డీటీ, ఆర్‌ఐ, మండల సర్వేయర్, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ముగ్గురు వీఆర్వోలను బాధ్యులను చేస్తూ వారి సస్పెన్షన్‌కు కలెక్టర్‌కు సిఫారసు చేస్తున్నట్లు ఆర్డీవో వెల్లడించారు. అయితే రోజులు గడుస్తున్నా వారిపై చర్యలు కానరాలేదు. ఈ విషయమై కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్‌ను వివరణ కోరగా.. ‘తప్పిదాలకు పాల్పడిన సిబ్బందిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తహసీల్దార్ సస్పెన్షన్ అంశం సీసీఎల్‌ఏకు సిఫారసు చేస్తాం.’ అని తెలిపారు.