ఆక్రమణల జోరు.. పట్టించుకోరు
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:04 AM
Land possession పలాస మండలంలో దేవదాయశాఖ, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. దేవదాయశాఖ, రెవెన్యూశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
టెక్కలిపట్నంలో దేవదాయశాఖ భూమి కబ్జా
తర్లాకోటలో శ్మశానవాటికనూ వదలని వైనం
అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
పలాస రూరల్/ లావేరు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): పలాస మండలంలో దేవదాయశాఖ, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. దేవదాయశాఖ, రెవెన్యూశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలాస మండలం తర్లాకోటలో సంస్థానాధీశులకు చెందిన శ్మశానవాటిక స్థలాన్ని కూడా అక్రమార్కులు వదలడం లేదు. ఒకప్పుడు ఈ శ్మశానవాటిక 29 సెంట్లు ఉండగా.. గత రెండేళ్లుగా క్రమేపీ 20 సెంట్లకుపైగా ఆక్రమించేశారు. దీనిపై గతంలో సమాచారం ఇచ్చినా సచివాలయం అధికారులు, వీఆర్వో, సర్వేయర్లు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇటీవల ఆక్రమణల విషయమై పలాస తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చి ఆక్రమిత స్థలాన్ని పరిశీలించారు. కానీ ఇంతవరకూ అక్రమార్కులపై చర్యలు తీసుకోలేదు.
టెక్కలిపట్నం గ్రామంలో దేవదాయశాఖ భూములను కూడా అక్రమార్కులు ఆక్రమించేశారు. దేవదాయశాఖకు చెందిన స్థలంలో షెడ్లు వేసి.. షాపులు నిర్మించి విక్రయించేందుకు యత్నించారు. దీనిపై ఇటీవల పత్రికల్లో కథనాలు రావడంతో దేవదాయశాఖ అధికారులు హుటాహుటిన ఆ షాపును బంద్ చేయించారు. కానీ ఆ షాపును పూర్తిస్థాయిలో తొలగించకపోవడం గమనార్హం. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దేవదాయ, సంస్థానాధీశుల భూముల్లో ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఈవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా.. దేవదాయశాఖ భూములను లీజుకు ఇచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో అక్కడ షెడ్‌లను ఖాళీ చేయిస్తామన్నారు.
డాబాలవాని చెరువునూ వదల్లే
లావేరు మండలం చినమురపాకలోని డాబాలవాని చెరువు ఆక్రమణకు గురైంది. చెరువులో నీటి సామర్థ్యం తగ్గి తమ భూములకు సాగునీరు చాలడం లేదంటూ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు గర్భం సుమారు 350 ఎకరాలు ఉండేది. ఈ చెరువు నీటి ఆధారంగా దాదాపు 750 ఎకరాల్లో ఆయకట్టు సాగు చేసేవారు. కాగా ఈ చెరువు క్రమేపీ ఆక్రమణకు గురవుతూనే ఉంది. పదేళ్ల కిందట గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఆ చెరువు గర్భంలో చినమురపాక నుంచి పెదరొంపివలసకు మట్టిరోడ్డు వేశారు. అప్పటి నుంచి ఈ చెరువు రెండు భాగాలుగా విడిపోయింది. రోడ్డుకు పైభాగం అంతా ఆక్రమణదారుల చెరలో చిక్కుకుంది. సుమారు 75 ఎకరాల మేరకు ఆక్రమణకు గురి కాగా.. ఆ భూమిలో ప్రస్తుతం కొందరు వరి, పత్తి పండిస్తున్నారు. కొంతమంది సరుగుడు, నీలగిరి మొక్కలు పెంచుతున్నారు. ఇంకొందరు పంట కళ్లాలుగా వినియోగిస్తున్నారు. గతంలో ఆయకట్టు భూమి అంతటికీ సాగునీరు అందేదని, ప్రస్తుతం ఆక్రమణల కారణంగా ఆ పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. అధికారులు స్పందించి డాబాలచెరువులో ఆక్రమణలను అరికట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ జీఎల్‌వీ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. చెరువు ఆక్రమణలను పరిశీలిస్తామన్నారు. ఆక్రమణలు తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.