నిరీక్షణ ఫలించింది
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:16 AM
Appointment documents for new teachers వారంతా ఉపాధ్యాయ వృత్తిలో చేరాలని అహర్నిశలు కష్టపడి చదివారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో అర్హత సాధించి.. ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా కొత్త ఉపాధ్యాయులు అందరికీ గురువారం నియామక పత్రాలు అందజేశారు.
కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాలు
శ్రీకాకుళం/ గార రూరల్/నరసన్నపేట/పాతపట్నం/ గుజరాతీపేట, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): వారంతా ఉపాధ్యాయ వృత్తిలో చేరాలని అహర్నిశలు కష్టపడి చదివారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో అర్హత సాధించి.. ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా కొత్త ఉపాధ్యాయులు అందరికీ గురువారం నియామక పత్రాలు అందజేశారు. జిల్లాకు సంబంధించిన 673 మంది నూతనోపాధ్యాయులను నియామకపత్రాలు అందుకున్నారు. పాతపట్నం నియోజకవర్గం నుంచి 91 మంది అభ్యర్థులు డీఎస్సీలో అర్హత సాధించారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు చెందిన ‘ఎంఏఆర్’ ట్రస్టు ద్వారా శిక్షణ పొందినవారిలో 21 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ కొలువు పొందారు. వారిని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తదితరులు అభినందించారు. వారి చేతులమీదుగా కొంతమంది అభ్యర్థులు మరోసారి నియామక పత్రాలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురు కొత్త ఉపాధ్యాయులు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. తమ కల నెరవేరిందని, నిరీక్షణ ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. బాధ్యతతో ఉపాధ్యాయ వృత్తి చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆమదాలవలస, నరసన్నపేట, పలాస ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష పాల్గొన్నారు.
మొదటి ప్రయత్నంలోనే..
మొదటి ప్రయత్నంలోనే ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం చాలా ఆనందంగా ఉంది. 2018లో బీఈడీ పూర్తి చేశాను. 2019లో జరిగిన డిఎస్సీకి దరఖాస్తు చేశాను. అప్పట్లో మా అబ్బాయికి ఆరోగ్యం బాగా లేనందున పరీక్షకు హజరుకాలేపోయాను. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడంతో చాలా బాధ పడ్డాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీపై మళ్లీ ఆశలు చిగురించాయి. రోజుకు 12 గంటలపాటు చదివాను. డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ బయోలాజీలో అర్హత సాధించాను. నాతోపాటు మా కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతో ఆనందించారు.
- కోటెడ్డి దివ్యకుమారి, చిలగాం, గార మండలం
కష్టం ఫలించింది
2008 సంవత్సరం నుంచి ఉపాధ్యాయ ఉద్యోగం కోసం కష్టపడి చదువుతున్నాను. గతంలో నియామకాలు తక్కువ కావడంతో రెండుసార్లు అర్హత సాధించినా ఉద్యోగానికి ఎంపిక కాలేకపోయాను. ఈసారి మెగా డీఎస్సీ కావడంతో నాలాంటి వారికి చాలా అవకాశం వచ్చింది. పీజీటీ మ్యాథ్స్‌లో అర్హత సాధించాను. మా ఆనందానికి అవధుల్లేవు.
ఆరంగి ధనుంజయరావు, ఆరంగిపేట, గార మండలం
ఎంతో అనందంగా ఉంది
2016లో డీఈడీ పూర్తిచేశాను. మా తల్లిదండ్రులు 2017లో పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు. ఆవులు పెంచుకుంటూ జీవిస్తున్నాం. ఆవుల ఆలనాపాలన చూస్తూ రాత్రి సమయంలో డీఎస్సీ కోసం ప్రణాళిక బద్దంగా చదివాను. నా భర్త వెంకటేష్ ఎంతో ప్రోత్సహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పోస్టులు ఎక్కువగా ఉండటంతో అక్కడ పరీక్ష రాశాను. ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైనట్లు సమాచారం రావడంతో ఎంతో ఆనంద పడ్డాను. నియామక పత్రం అందుకున్న సమయంలో ఉద్వేగానికి లోనయ్యాను. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌కు రుణపడి ఉంటాం.
- శిమ్మ అరుణకుమారి, జమ్ము, నరసన్నపేట
కల నెరవేరింది...
ఎన్నో ఏళ్ల నా కల నెరవేరింది. ఉపాధ్యాయురాలిగా నియామక పత్రం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇచ్చినమాట నిలబెట్టుకొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్టు ద్వారా ఉచిత మెగా డీఎస్సీ శిక్షణ కల్పించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు కృతజ్ఞతలు. ఈరోజు జీవితకాలం గుర్తుండిపోతుంది.
- దేవాది సుకన్య, మాకన్నవలస, సారవకోట మండలం
రెండో ప్రయత్నంలోనే సాధించా
రెండో ప్రయత్నంలో డీఎస్సీ రాసి ఉద్యోగాన్ని పొందడం ఎంతో ఆనందం ఉంది. తొలిసారి పరీక్షల్లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నా. ప్రణాళికబద్ధంగా. పట్టుదలతో చదవడంతో ఈ విజయం సాధ్యమైంది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తపనతో ఏడాదిపాటు ఇంటికి దూరంగా అవనిగడ్డలో ఉంటూ శిక్షణ తీసుకున్నా. నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది. అన్నయ్య కార్తీక్ కూడా ఉపాధ్యాయుడే. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నేను కూడా ఉపాధ్యాయురాలిని కాగలిగాను.
- వాన దివ్య, జమ్ము, నరసన్నపేట