Share News

కొండెక్కిన కోడి

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:16 PM

చికెన్‌, చేపల ధరలు మాంసప్రియులను హడలెతిస్తున్నాయి.

కొండెక్కిన కోడి
కోళ్లు

- పెరిగిన చికెన్‌ ధరలు

- స్కిన్‌లెస్‌ కిలో రూ.305

- అదే దారిలో చేపలు..

టెక్కలి/నరసన్నపేట, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): చికెన్‌, చేపల ధరలు మాంసప్రియులను హడలెతిస్తున్నాయి. స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.305 పలుకుతోంది. స్కిన్‌తో రూ.285, లైవ్‌ రూ.165కు వ్యాపారులు విక్రయిస్తున్నారు. నెల కిందట స్కిన్‌లెస్‌ కిలో రూ.265, స్కిన్‌తో రూ.245, లైవ్‌ రూ.140 ఉండేది. సుగుణ, వెన్‌కాబ్‌, స్నేహ, వీహెచ్‌ఎల్‌, వెంకటేశ్వర తదితర సంస్థలు బ్రాయిలర్‌ కోళ్లను జిల్లా వ్యాప్తంగా చికెన్‌ వ్యాపారులకు సరఫరా చేస్తుంటాయి. ఆయా సంస్థలు నిర్దేశించిన ధరకు అమ్మకాలు జరుగుతుంటాయి. జిల్లాకు పూసపాటిరేగ, రణస్థలం, ఎచ్చెర్ల, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి కోళ్లు సరఫరా అవుతుంటాయి. ఇప్పుడే చికెన్‌ ధర ఇలా ఉంటే రానున్న సంక్రాంతికి ఎలా ఉంటుందోనని మాంసప్రియులు ఆందోళన చెందుతున్నారు. చేపల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. సముద్రపు చేపలు 40శాతం మేర ధరలు పెరిగాయి. కోనాం కిలో రూ.900, వంజరాలు కిలో రూ.700, పండుగొప్పు రూ.600, చిన్న వంజరాలు రూ.500, కణసలు రూ.300, గులివిందలు రూ.300, కలవలు కిలో రూ.200కు విక్రయిస్తున్నారు. చెరువు చేపల ధరలను పరిశీలిస్తే.. బొచ్చు కిలో రూ.300, కొరమీను రూ.600, ఏటిబొంతలు రూ.400, గడ్డిచేప రూ.250, బంగారుపాప కిలో రూ.300కు వ్యాపారులు విక్రయిస్తున్నారు. చెరువు చేపలు ఉభయగోదావరి జిల్లాల నుంచి దిగుమతి అవుతుండడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. సముద్ర చేపలకు సంబంధించి స్థానికంగా వేట తక్కువగా ఉండడంతో విశాఖపట్నం నుంచి వ్యాపారులు జిల్లాకు తీసుకువచ్చి అమ్మకాలు చేపడుతున్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:16 PM