Share News

గడ్డికి గడ్డుకాలం

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:52 PM

There is a shortage of grass మూగజీవాలకు గ్రాసం(గడ్డి) కొరత వెంటాడుతోంది. వ్యవసాయం యాంత్రీకరణ నేపథ్యంలో గ్రామాల్లో పశువుల సంఖ్య తగ్గింది. కానీ పాలకు డిమాండ్‌ ఉండడంతో కొంతమంది రైతులు వ్యవసాయంతోపాటు పాడి పశువుల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు.

గడ్డికి గడ్డుకాలం

యంత్రాలతో వరినూర్పుళ్లు

వేధిస్తున్న పశుగ్రాసం కొరత

ఆందోళనలో పాడిరైతులు

దాణా పంపిణీ చేయాలని విజ్ఞప్తి

నరసన్నపేట/ ఎల్‌.ఎన్‌.పేట, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): మూగజీవాలకు గ్రాసం(గడ్డి) కొరత వెంటాడుతోంది. వ్యవసాయం యాంత్రీకరణ నేపథ్యంలో గ్రామాల్లో పశువుల సంఖ్య తగ్గింది. కానీ పాలకు డిమాండ్‌ ఉండడంతో కొంతమంది రైతులు వ్యవసాయంతోపాటు పాడి పశువుల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 3,75,345 ఆవులు/ గేదెలు, 45,914 దూడలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కో ఆవు లేదా గేదెకు ఏడాదికి టన్నున్నర ఎండు గడ్డితోపాటు పచ్చిగడ్డి, దాణా కూడా అవసరం. కానీ, జిల్లాలో సరిపడా పశుగ్రాసం లేదు. దీనికి కారణం వ్యవసాయ యాంత్రీకరణమే. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 3.80 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. దాదాపు 70 శాతం మేరకు యంత్రాలతో వరి కోతలు, నూర్పులు చేపట్టారు. దీంతో పశుగ్రాసం ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది లక్ష టన్నులు మాత్రమే పశుగ్రాసం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పశుగ్రాసం ఉత్పత్తి తగ్గిపోవడంతో పాడిరైతులు లబోదిబోమంటున్నారు. కొంతమంది రైతులు తాము పండించిన వరి పంటను కూలీలతో కోతలు కోయించి.. వరిగడ్డిని భద్రం చేసుకుంటున్నారు. కానీ, అధిక శాతం మంది యాంత్రీకరణపై మొగ్గు చూపడంతో పశుగ్రాసం కోసం పాట్లు తప్పడం లేదు. కొరత కారణంగా పశుగ్రాసానికి డిమాండ్‌ పెరిగిందని పాడి రైతులు వాపోతున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ లోడు గడ్డి రూ.7వేలకు కొనుగోలు చేస్తున్నామని పేర్కొంటున్నారు. దీనికితోడు మార్కెట్‌లో తవుడు, నూకలు ఇతర పోషకాలతో కూడా దాణా ధరలు కూడా గతంలో కంటే భారీగా పెరిగాయని ఆవేదన చెందుతున్నారు. పాడి పశువుల పెంపకం భారమవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి కనీసం దాణా అయినా పంపిణీ చేయాలని కోరుతున్నారు.

దాణా పంపిణీ చేయాలి

మార్కెట్‌లో పోషకాలతో తయారు చేసిన పశు దాణా ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం స్పందించి పాడిరైతులకు రైతు సేవాకేంద్రాల ద్వారా పశుదాణాను సబ్సిడీపై పంపిణీ చేయాలి. అర్హులైన పాడి రైతులకు అందేలా చర్యలు చేపట్టాలి.

- శిమ్మ శ్రీనివాసరావు, పాడి రైతు, నరసన్నపేట

ఉన్నతాధికారులకు నివేదిస్తాం

గతేడాది పశుదాణా సబ్సిడీపై పంపిణీ చేశాం. ఈ ఏడాది జిల్లాలో పాడిపోషణపై రైతులు దృష్టి సారించారు. గ్రామాల్లో సిబ్బంది ద్వారా పాడి రైతులను గుర్తించి తగిన నివేదినకు ప్రభుత్వంకు నివేదిస్తాం.

- రాజగోపాలరావు, జేడీ, పశుసంవర్ధక శాఖ, శ్రీకాకుళం

Updated Date - Dec 09 , 2025 | 11:52 PM