Share News

Fertilizer distribution : రైతుల ప్రయోజనమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:16 PM

Fertilizer distribution in Tandemvalasa ‘రైతుల ప్రయోజనమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో ఖరీఫ్‌ సాగు అవసరానికి సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందొద్దు’ అని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Fertilizer distribution : రైతుల ప్రయోజనమే ప్రభుత్వ లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

తండేంవలసలో ఎరువుల పంపిణీ

శ్రీకాకుళం రూరల్‌, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘రైతుల ప్రయోజనమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో ఖరీఫ్‌ సాగు అవసరానికి సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందొద్దు’ అని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం మండలం తండేంవలసలోని రైతుసేవా కేంద్రంలో రైతులకు ఎరువుల పంపిణీ చేపట్టారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘జిల్లాలో 23వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరో 3వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు రానున్నాయి. ఎరువుల కొరత లేదు. ఏడాది అంతటికీ ఒకేసారి నిల్వ చేసుకోవాలనే ఉద్దేశంతోనే కొన్నిచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయి. రబీలో రాష్ట్రానికి 9.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది. రబీ కోసం ఇప్పుడే ఎరువులు నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు. మోతాదుకు మించిన ఎరువులు వినియోగిస్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి. దీనిపై రైతులకు అవగాహన పెంపొందించుకోవాల’ని తెలిపారు. యూరియా అధిక ధరకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం శ్రీకాకుళంలో ప్రత్యేకంగా ఫోన్‌ నెంబర్‌ ఏర్పాటు చేశామన్నారు.

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. ‘యూరియా అవరసం మేరకు వినియోగించాలి. ఎక్కువగా వాడితే వరిపంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రైవేటు దుకాణాల్లో కూడా ప్రభుత్వం అందించిన ధరకే యూరియా లభ్యమవుతుంది. వ్యవసాయశాఖ అధికారుల సూచనలతో అధిక దిగుబడి సాధించాల’ని తెలిపారు.

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. ‘అక్రమంగా నిల్వలు చేస్తే సమచారం ఇవ్వాలి. ప్రతీ హామీని నెరవేరుస్తున్న ప్రభుత్వం మాదే. ఏడాదిలోనే తండేంవలస గ్రామంలో కోట్ల రూపాయలతో రహదారులు నిర్మించామ’ని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్‌, వ్యవసాయశాఖ జేడీ త్రినాథస్వామి, తహసీల్దార్‌ ఎం.గణపతి, మండల వ్యవసాయ అధికారి పి.నవీన్‌, ఎంపీడీవో శైలజ, మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు, సర్పంచ్‌ కూర్మారావు, అంబటి వైకుంఠం, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 11:16 PM