పార్టీ బలోపేతమే లక్ష్యం
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:31 PM
MLC Nagendrababu meeting జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. ప్రతి పల్లెలోనూ జనసేన సభ్యాత్వాలను నమోదు చేయించాల’ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగేంద్రబాబు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ నాగేంద్రబాబు
లావేరు, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ‘జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. ప్రతి పల్లెలోనూ జనసేన సభ్యాత్వాలను నమోదు చేయించాల’ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగేంద్రబాబు పిలుపునిచ్చారు. శనివారం లావేరులోని జనసేన పార్టీ కార్యాలయంలో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ నాగేంద్రబాబు మాట్లాడుతూ.. ‘రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నిరంతరం పనిచేస్తున్నారు. వైసీపీ పాలనలోని ఐదేళ్లలో రూ.90కోట్ల నిధులతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలోనే రూ.1000 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారులు, అభివృద్ధి పనులకు ఖర్చు చేసింది. ఈ ఘనత జనసేన అధినేతకే దక్కుతుంది. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతో కలిసి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌తోపాటు మడ్డువలస, తోటపల్లి సాగునీటి కాలువల అభివృద్ధి విషయమై శాసన మండలిలో పోరాడుతా’నని తెలిపారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతానికి తనవంతు కృషిగా లావేరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, ఎచ్చెర్ల జనసేన పార్టీ సమన్వయ కర్త విష్వక్షేన్ తదితరులు పాల్గొన్నారు.