Share News

Bjp : బీజేపీ బలోపేతమే లక్ష్యం

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:48 PM

BJP state president Madhav Visited ‘భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం. ప్రతీ గ్రామాన బీజేపీ జెండా ఎగరాల’ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పేర్కొన్నారు.

Bjp : బీజేపీ బలోపేతమే లక్ష్యం
శ్రీకాకుళంలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌, పార్టీ శ్రేణులు

ప్రసాద్‌, స్వదేశీ దర్శన్‌ నిధులతో పురాతన ఆలయాల అభివృద్ధి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌

శ్రీకాకుళం/ పాత శ్రీకాకుళం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ‘భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం. ప్రతీ గ్రామాన బీజేపీ జెండా ఎగరాల’ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా బుధవారం శ్రీకాకుళంలో ఆయన పర్యటించగా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. డేఅండ్‌ నైట్‌ జంక్షన్‌ నుంచి సన్‌రైజ్‌ హోటల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు, మేధావి వర్గంతో వేర్వేరుగా మాధవ్‌ సమావేశమయ్యారు. బీజేపీ సిద్ధాంతాలను.. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సమస్యలపై సమగ్రంగా చర్చించారు. శ్రీకాకుళంలోని గాంధీమందిరంలో చాయ్‌పే చర్చ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సన్‌రైజ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచ నాగరికతకు ఆనవాళ్లు సిక్కోలులో ఉన్నాయి. ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్లినా సిక్కోలు వాసులు సామాన్య కార్మికుడి నుంచి వివిధ రంగాల నిపుణుల వరకు ఉన్నారు. కానీ జిల్లా వ్యవసాయ రంగంలో వెనకబడి ఉంది. ఇక్కడి రైతులు ఇంకా రెండో పంట కోసం ఎదురు చూడటం బాధాకరం. జిల్లాలో జీవ వైవిద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పురాతన ఆలయాలు, చారిత్రక ప్రాంతాలను కేంద్ర పథకాలైన ప్రసాద్‌, స్వదేశీ దర్శన్‌ ద్వారా అభివృద్ధి చేస్తాం. భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయితే జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి జోరందుకుంటుంది. జిల్లా అభివృద్ధికి మూలపేట పోర్టు, మరో ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం నిధులు అందించి తోడ్పాటునిచ్చింది. విభజన అనంతరం రాష్ట్ర అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రతి చోట బీజేపీ దృష్టి కేంద్రీకరించింది. జిల్లాలోని వైతాళికులను, సంఘసంస్కర్తలను, స్వతంత్ర సమరయోధులను గుర్తించి.. వారిని సత్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. చెంచులు, బుడగజంగాలు, ఎరుకులను ఆదరించి మన సంస్కృతికి పునర్జీవనమివ్వాలి’ అని తెలిపారు. సమావేశంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, పార్టీ సీనియర్‌ నాయకులు పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, శవ్వాన ఉమామహేశ్వరి, అట్టాడ బాబ్జి, బి.ఉమామహేశ్వరరావు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 11:48 PM