Share News

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:03 AM

FFC building inaugurated in Pydibhimavaram యువత భవిష్యత్‌ కోసం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పరిశ్రమల స్థాపనతోపాటు స్వయం ఉపాధి పొందేలా యువతను ప్రోత్సహిస్తోంద’ని ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రంలోని 87 ప్రాంతాల్లో సుమారు రూ.20వేల కోట్లతో వివిధ పరిశ్రమలను ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌ విధానంలో మంగళవారం ప్రారంభించారు.

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
పైడిభీమవరంలో ఎఫ్‌ఎఫ్‌సీ భవనం ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌, చిత్రంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌దినకర్‌ పుండ్కర్‌

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

పైడిభీమవరంలో ఎఫ్‌ఎఫ్‌సీ భవనం ప్రారంభం

రణస్థలం/ జి.సిగడాం, నవంబరు 11(ఆంరఽధజ్యోతి): ‘యువత భవిష్యత్‌ కోసం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పరిశ్రమల స్థాపనతోపాటు స్వయం ఉపాధి పొందేలా యువతను ప్రోత్సహిస్తోంద’ని ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రంలోని 87 ప్రాంతాల్లో సుమారు రూ.20వేల కోట్లతో వివిధ పరిశ్రమలను ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌ విధానంలో మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా పైడిభీమవరంలోని పారిశ్రామికవాడలో రూ.14.60 కోట్లతో ఏపీఐఐసీ ద్వారా ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌(ఎఫ్‌ఎఫ్‌సీ) బహుళ యూనిట్‌ భవనాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావుతో కలిసి మంత్రి శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలంతా స్థానికంగానే పని చేసుకోవటానికి వీలుగా ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను నిర్మించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక వేత తయారవ్వాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని, యువత ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.

ఆవిష్కరణలను కొనియాడిన సీఎం

ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు మొదటగా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో వర్చువల్‌గా మాట్లాడారు. పైడిభీమవరం ఐడీఏలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ పరిశ్రమను స్థాపించిన లిక్వినాక్స్‌ సంస్థ అధినేత రాజేశ్‌బాబు చేసిన సేవలను సీఎం కొనియాడారు. విద్యార్థులు సైతం వినూత్న ఆవిష్కరణల దిశగా ప్రయత్నించాలని సూచించారు. రాజేష్‌బాబు మాట్లాడుతూ.. ‘2016లో విశాఖ భాగస్వామ్య సదస్సులో ఒప్పందం కుదుర్చుకున్నాం. 2019లో ఉత్పత్తి ప్రారంభించాం. 2020లో కరోనా కష్టకాలంలో మా సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్‌ సిలిండర్లు సరఫరా చేసి లక్షలాది మంది రోగుల ప్రాణాలు కాపాడాం. రిమ్స్‌, జెమ్స్‌, కేజీహెచ్‌కు నిరంతరాయంగా సిలిండర్లు అందజేశామ’ని తెలిపారు. మరో పారిశ్రామికవేత్త విజయనగరానికి చెందిన పీవీఎస్‌ రామస్వామి మాట్లాడుతూ.. ‘సంతవురిటిలో వరి, ఇతర పంటల వ్యర్థాల నుంచి బయోకంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ ఉత్పత్తి చేసే పరిశ్రమను స్థాపిస్తున్నాం. సీఎం ఆలోచనా విధానాన్ని ప్రేరణగా తీసుకుని ఈ పరిశ్రమకు అంకురార్పణ చేశాం. విశాఖలోని సీఐఐ సదస్సులో ఎంవోయూ కుదుర్చుకోనున్నామ’ని సీఎం చంద్రబాబుకు తెలియజేశారు.

సంతవురిటిలో బయోగ్యాస్‌ ప్లాంట్‌

జి.సిగడాం మండలం సంతవురిటిలో రూ. 100 కోట్లతో నిర్మించనున్న బయోగ్యాస్‌ ప్లాంట్‌కు మంత్రి శ్రీనివాస్‌ మంళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం పరిశ్రమలు- ఉపాధి కల్పన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ పరిశ్రమల ద్వారా 2 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు స్వయం ఉపాధి కల్పనకు రుణాల రూపంలో ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తోంది. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాల’ని పిలుపునిచ్చారు. సంతవురిటిలో నిర్మించనున్న బయోగ్యాస్‌ ప్లాంట్‌ ద్వారా సుమారు 500 మందికి ప్రత్యక్షంగా, వెయ్యి మంది రైతులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు.

భారీ పెట్టుబడులు ఆకర్షించేలా..

విశాఖపట్నంలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ‘విశాఖ సీఐఐ సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన 8 మంది స్పీకర్‌లు ఈ సదస్సులో పాల్గొంటారు. వివిధ దేశాల ప్రతినిధులు, పలు ప్రముఖ కంపెనీల సీఎక్స్‌వోలు, ఆర్థిక నిపుణులు, కేంద్ర మంత్రులు పాల్గొని వివిధ దేశాల వాణిజ్య అవకాశాలపై చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 410 ఒప్పందాలు కుదుర్చుకోనుంది. వీటి ద్వారా రాష్ట్రానికి సుమారు రూ. 9.76 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నా’మని మంత్రి తెలిపారు. కార్యక్రమాల్లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆర్డీవో సాయిప్రత్యూష, డీపీవో సౌజన్యభారతి, తహసీల్దార్‌ ఎం.సరిత, ఎంపీడీవో జి.రామకృష్ణ, కూటమి నేతలు లంక శ్యామలరావు, ముప్పిడి సురేష్‌, చౌదరి బాబ్జీ, రౌతు శ్రీను, పిసిని జగన్నాథంనాయుడు, లంక ప్రభ, సర్పంచ్‌లు బుడారి లక్ష్మణరావు, సాకేటి నాగరాజు, ఏఎంసీ ఉపాధ్యక్షుడు బూరాడ వెంకటరమణ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు బెవర జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 12:03 AM